విషయం అదే మరి..!

మహేంద్రగిరి అడవికి శుద్ధోదన అనే సింహం రాజుగా ఉండేది. అది అడవిలో ఉండే జంతువులు, పక్షుల క్షేమ సమాచారాన్ని వాయసం అనే కాకి ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునేది.

Updated : 10 Nov 2023 05:00 IST

మహేంద్రగిరి అడవికి శుద్ధోదన అనే సింహం రాజుగా ఉండేది. అది అడవిలో ఉండే జంతువులు, పక్షుల క్షేమ సమాచారాన్ని వాయసం అనే కాకి ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునేది. ఒకరోజు సాయంత్రం మృగరాజు వద్దకు వచ్చిన వాయసం.. ‘అడవిలోని జీవుల తీరు పట్ల చాలా బాధగా ఉంది. ఇన్ని రోజులు వాటిలో మార్పు వస్తుందేమోనని ఎదురుచూశాను. కానీ, ఇప్పుడు తప్పక మీ వరకు తీసుకొస్తున్నా’ అని చెప్పింది.
దాని మాటలు విన్న మృగరాజు.. వెంటనే మంత్రి ఎలుగుబంటిని పిలిచింది. విషయాన్ని దానికి చెప్పి, మరుసటి రోజు ఉదయమే అడవిలోని జీవులతో సమావేశం ఏర్పాటు చేయించమంది. అది అక్కడే ఉన్న కోతిని పిలిచి.. ఈ విషయాన్ని జంతువులకు, పక్షులకు చేరవేయమంది. కోతి వెంటనే అడవంతా తిరిగి, పిల్ల జీవులతో సహా సమావేశానికి అన్నీ హాజరు కావాలని చెప్పింది. కారణమేంటో తెలియకపోయినా, మృగరాజు ఆదేశం కాబట్టి చెప్పినట్లుగానే జీవులన్నీ సమావేశానికి వచ్చాయి.
కాసేపటికి మృగరాజు వచ్చి జంతువులు, పక్షులన్నింటి వైపు ఒకసారి చూసింది. గొంతు సవరించుకొని, అక్కడికి వచ్చిన ఒక దుప్పి కుటుంబంలోని చిన్న పిల్లను పిలిచింది. ‘ఇక్కడున్న వాటిలో నీకు తెలిసిన జీవుల పేర్లు చెప్పు?’ అని అడిగింది. పిల్ల దుప్పి భయం భయంగా ముందుకు వచ్చింది. కానీ.. పది పేర్లు కూడా చెప్పలేకపోయింది. తర్వాత తల్లి దుప్పిని పిలిచిన మృగరాజు.. ‘ఇప్పుడు నీకు తెలిసిన వాటి పేర్లు చెప్పు’ అంది. అది నెమ్మదిగా గుర్తు చేసుకుంటూ.. 30 వరకు చెప్పింది.
అనంతరం వయసు మీరిన దుప్పిని పిలిచి ‘ఇక్కడ నీకు తెలిసిన వాటి పేర్లు చెప్పు?’ అని అడిగింది. వెంటనే అది అక్కడికి వచ్చిన అన్ని జీవుల పేర్లు దాదాపు చెప్పేసింది. దాంతో అవన్నీ ఆశ్చర్యపోయాయి. మృగరాజు దాని వైపు మెచ్చుకోలుగా చూస్తూ.. ‘దుప్పి కంటే ఇంకా ఎక్కువ పేర్లు ఎవరైనా చెప్పగలరా?’ అని ప్రశ్నించింది. అప్పుడో ముసలి కోతి ముందుకు వచ్చి దానికి తెలిసిన పేర్లన్నీ చెప్పింది.
ఆ తర్వాత మృగరాజు సమావేశాన్ని ఉద్దేశించి ‘చూశారా.. వృద్ధాప్యంలో ఉన్న దుప్పి, కోతి అన్నింటి పేర్లను ఎలా గుర్తుపెట్టుకున్నాయో.. అడవిలోని జంతువులు, పక్షులతో స్నేహంగా ఉండటం వల్లనే ఇది సాధ్యమైంది. పెద్దవాళ్ల కన్నా.. పిల్లలకే ఎక్కువ జ్ఞాపకశక్తి ఉంటుంది. కానీ, ఈ పిల్ల జీవులు మాత్రం పట్టుమని పది పేర్లు కూడా చెప్పలేకపోయాయి. ఒకప్పుడు అన్ని జంతువులు, పక్షులు కలిసిమెలిసి ఉండేవి. మంచిచెడులను పంచుకునేవి. అందుకే వాటికి ఆ జీవుల పేర్లన్నీ గుర్తున్నాయి. కానీ, నేడు పెద్ద జీవులు.. తమ పిల్లలను నివాసం నుంచి క్షణమైనా బయటకు విడిచిపెట్టడం లేదు. అతి గారాబం చేస్తూ.. వాటికి అవసరమైన ఆహారం కూడా తల్లులే తెచ్చి పెడుతున్నాయి. దీంతో పక్క పక్క గూళ్లలోనే ఉంటున్నా.. వాటి పేర్లు కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అసలు అడవిలో సందడే లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా అయిపోయింది. ఈ విషయం వాయసం ద్వారా నాకు తెలిసింది. పిల్ల జీవులకు మనం నివసించే అడవిలోని జంతువులు, పక్షుల పేర్లు కూడా తెలియకపోవడం చాలా బాధాకరం. ఈ పరిస్థితిని మనం అధిగమించాలంటే.. అవి ఇతర జీవులతో కలిసిపోవాలి. ఆ పద్ధతిని తల్లిదండ్రులే వాటికి అలవాటు చేయాలి’ అంది.
సమావేశంలో ఉన్న జంతువులు, పక్షులు మృగరాజు మాటలకు తల దించుకున్నాయి. ‘మౌనంగా ఉంటే సమస్య పరిష్కారం కాదు. ఇకముందు తరాల జీవులకు ఇలాంటి పరిస్థితి రాకూడదంటే.. తోటి జంతువులతో స్నేహం, ఆపదలో ఉన్న వాటికి సాయం చేయడం నేర్పాలి. అప్పుడే ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది’ అంది మృగరాజు. ఆ మాటలకు జీవులన్నీ సరేనన్నట్లు తలాడించాయి. ఇకపై పిల్లలను అతి గారాబం చేయమని, చుట్టుపక్కల ఉండే జీవులతో స్నేహంగా ఉండేటట్లు చూస్తామని మాటిచ్చాయి. సమావేశం ముగిసిన తర్వాత అన్ని జంతువులు, పక్షులు తమ పిల్లలను ఇతర జీవులకు పరిచయం చేశాయి. కొన్ని నెలల తర్వాత వాటిలో మార్పు వచ్చిందని వాయసం ద్వారా తెలుసుకున్న మృగరాజు సంతోషించింది.  
మొర్రి గోపి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని