దాహం నేర్పిన పాఠం!

సిరి మూడో తరగతి చదువుతోంది. తను చాలా అల్లరి అమ్మాయి. తోటి పిల్లలను ఏడిపిస్తుండేది. అలా చేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినేది కాదు.

Updated : 11 Nov 2023 05:33 IST

సిరి మూడో తరగతి చదువుతోంది. తను చాలా అల్లరి అమ్మాయి. తోటి పిల్లలను ఏడిపిస్తుండేది. అలా చేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినేది కాదు. నీటితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉండే పంపులన్నీ తిప్పి.. ఆ నీళ్లను బయట పోస్తూ వృథా చేస్తుండేది. బాటిళ్లకు రంధ్రాలు చేసి, ఫౌంటెయిన్‌లా వచ్చిన నీటిని అందరి మీద చల్లుతుండేది. నీటిని అలా పారబోయొద్దని అమ్మానాన్నలు ఎంత చెప్పినా సిరి అసలు వినిపించుకునేది కాదు. పైగా ‘ట్యాంకులో బోలెడు నీళ్లు ఉన్నాయి. నేను ఆడుకునేది కొన్నింటితోనే కదా’ అంటూ మొండిగా సమాధానమిచ్చేది.

స్కూల్లో ఒకరోజు భోజనం చేసి, చేతులు కడుక్కున్నాక కుళాయిని ఆపకుండానే వెళ్లిపోయింది సిరి. స్నేహితులు చెప్పినా వినకుండా.. ‘మీరు ఆపేయండి’ అని నిర్లక్ష్యంగా జవాబిచ్చింది. ఇదంతా అక్కడే ఉన్న మాలతి టీచర్‌ గమనించారు. కానీ, అప్పుడు తననేమీ అనలేదు. ఒక ఆదివారం ఉదయం పిల్లలందరినీ పార్కుకు తీసుకెళ్లారు. వారి వెంట మాలతి టీచర్‌ కూడా ఉన్నారు. అక్కడికి వెళ్లాక పిల్లలంతా ఊయలలు ఊగుతూ, జారుడు బల్లపై జారుతూ సరదాగా గడపసాగారు. కానీ, సిరి మాత్రం తన వాటర్‌ బాటిల్‌లోని నీళ్లను అందరి మీద చల్లుతూ పరుగులు తీయసాగింది. అలా చేయొద్దని టీచర్‌ చెప్పినా.. విన్నట్టే విని మళ్లీ అదే చేసింది.

చూస్తూనే మధ్యాహ్నం అయింది. ‘పిల్లలూ.. ఆలస్యం అవుతుంది. ఇక ఇంటికి వెళదాం పదండి’ అన్నారు టీచర్‌. అప్పటి వరకు ఆటపాటలతో అలిసిపోయిన పిల్లలంతా, హాయిగా ఒకచోటికి చేరిపోయారు. గొంతెండిపోవడంతో అందరూ వాళ్ల బ్యాంగుల్లోంచి బాటిల్‌ తీశారు. సిరికి కూడా చాలా దాహం వేసింది కానీ, తన బాటిల్‌లో నీళ్లన్నీ అయిపోయాయి. స్నేహితులెవరిని అడిగినా ప్రయోజనం లేకపోయింది. ఇక టీచర్‌ దగ్గరకు వెళ్లి ‘టీచర్‌ నాకు చాలా దాహంగా ఉంది. నా బాటిల్‌లో నీళ్లు అయిపోయాయి. ఫ్రెండ్స్‌ని అడిగాను కానీ, దాహంగా ఉండటంతో ఇప్పుడే తాగేశారంతా’ అంది దిగాలుగా. టీచర్‌ తన బాటిల్‌ ఇవ్వడంతో.. ‘హమ్మయ్యా’ అనుకుంటూ తాగేసింది.
‘చూశావా సిరి.. నీళ్లతో ఆటలొద్దని, ఎంత చెప్పినా నువ్వు వినలేదు. నేను ఎందుకు చెప్పానో ఇప్పుడైనా అర్థమైందా?’ అని అడిగారు టీచర్‌. అర్థమై కానట్లుగా తలూపింది. కానీ, దాహంతో ఆ కొంచెంసేపు పడిన బాధ మాత్రం తనకు బాగా గుర్తుంది. ఇక అప్పటి నుంచి నీటితో ఆడకూడదని, పారబోయొద్దని మనసులోనే అనుకుంది. బస్సు రావడంతో అందరూ ఇంటికి బయలుదేరారు.

మరుసటి రోజు ఉదయాన్నే పిల్లలంతా స్కూల్‌కి వచ్చారు. ‘నీరు, దాని ఆవశ్యకత’ పాఠం ప్రారంభించారు టీచర్‌. ‘పిల్లలూ.. నీరు చాలా ముఖ్యం. ఆహారం లేకపోయినా కొన్ని రోజులు బతకగలం కానీ, నీరు లేకుండా ఉండలేం. అందుకే అవసరం ఉన్నంత వరకే వాడుకోవాలి. నీటిని అస్సలు వృథా చేయకూడదు’ అని వివరించారు టీచర్‌. ‘ఎవరైనా ఒక్కరు వృథా చేస్తే ఏమవుతుంది టీచర్‌?’ అని మళ్లీ అడిగింది సిరి. ‘ప్రతి ఒక్కరూ నీలా ఒక్కరు పారబోస్తే ఏమవుతుందని అనుకుంటే.. ఇక చుక్క నీరు కూడా మిగలదు. ఏదైనా ఒక్కరితోనే మొదలవుతుంది. అలా ఒక్కొక్కరు కలిస్తే, అది ఓ అలవాటుగా మారుతుంది. నీళ్లు మనకు తాగడానికి మాత్రమే కాదు.. పొలాలకు, చెట్లకు, విద్యుత్తు కోసం అవసరం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి నదుల మీద ఆనకట్టలు, ఇళ్ల ముందు ఇంకుడు గుంతలు నిర్మిస్తారు. మనమేమో ఇష్టమొచ్చినట్లు నీటిని వృథా చేస్తుంటాం. అలా చేయడం సరైంది కాదు. నీటిని ఎంత జాగ్రత్తగా వాడితే, మనకు అంత మంచిది’ అన్నారు టీచర్‌.

‘అలాగే టీచర్‌.. ఇక నుంచి నేను నీటిని వృథా చేయను. పొదుపుగా వినియోగిస్తాను. నా స్నేహితులకు, బంధువులకు కూడా ఇదే మాట చెబుతాను’ అని ఉత్సాహంగా సమాధానమిచ్చింది సిరి.  

 కె.వి.సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని