కోటలో కొలువు!

సూర్యగిరి రాజ్యాన్ని జయసింహుడు పాలిస్తున్నాడు. ఆ పరిధిలోని సీతాపురం గ్రామంలో రామయ్య తన కుటుంబంతో నివసిస్తున్నాడు.

Updated : 16 Nov 2023 03:34 IST

సూర్యగిరి రాజ్యాన్ని జయసింహుడు పాలిస్తున్నాడు. ఆ పరిధిలోని సీతాపురం గ్రామంలో రామయ్య తన కుటుంబంతో నివసిస్తున్నాడు. తన మాటలతో అందరినీ నవ్విస్తుంటాడు. దాంతో మిత్రులంతా ‘రామయ్యా..! నీ మాటలతో ఎవరినైనా మెప్పించగలవు. నువ్వు తలచుకుంటే మహారాజు ఆస్థానంలో కొలువు సాధించగలవు. ఓసారి ప్రయత్నించు’ అని ప్రోత్సహించేవారు. చాలా రోజులుగా ఆ మాటలు వింటున్న రామయ్య, ఒకరోజు ఉద్యోగం కోసం కోటకు బయలుదేరాడు. లోపలకు వెళ్లబోతున్న రామయ్యను.. ఇద్దరు భటులు, ద్వారం దగ్గరే ఆపి ‘ఎవరు నువ్వు? అనుమతి లేనిదే ఎవరూ లోపలకు వెళ్లకూడదు’ అన్నారు. ‘నాకు ఇక్కడికి రావడానికి అనుమతి ఉంటే మీకు చెబుతాను కదా.. కొలువు కోసం మహారాజుని కలవడానికి వచ్చాను. దయచేసి నన్ను వెళ్లనివ్వండి’ అని వినయంగా అడిగాడు రామయ్య.

అయితే కాస్త ధనం ఇస్తే వెళ్లనిస్తామని బదులిచ్చారా భటులు. ‘ఓహో లంచమా?’ అన్నాడు రామయ్య. ‘చాలీ చాలని జీతాలతో కుటుంబాలను పోషించలేకపోతున్నాం. ఇలా తీసుకుంటే తప్ప మాకు కంచంలో మెతుకులు కనబడటం లేదు’ అన్నారు భటులు. వారి మాటలు విన్న రామయ్య ‘నన్ను ఇప్పుడు రాజు వద్దకు వెళ్లనివ్వండి. నా ప్రతిభతో ఆయన్ని మెప్పించి.. బహుమతి పొందితే, అది మీకిచ్చేస్తాను’ అని వారిని ఒప్పించి లోపలికి వెళ్లాడు. అలా అయిదు ద్వారాల వద్దనున్న భటులను దాటుకుంటూ సభలోకి ప్రవేశించాడు రామయ్య.

ఆ సమయంలో రాజు సమావేశంలో ఉన్నారు. అక్కడికి వెళ్లిన రామయ్య.. ‘భూమిని పాలించే దేవుడిని కలుసుకోవడానికి, పది మంది పూజారులను దాటుకుని వచ్చాను’ అని వందనం చేశాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన జయసింహుడు.. ‘ఇంతకీ ఎవరు నువ్వు? నీ పేరేంటి?’ అన్నాడు. ‘మహారాజా! నా పేరు రామయ్య. కోటలో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని వచ్చాను’ అన్నాడు. నువ్వు ఎలాంటి కొలువు చేయగలవు? అని రాజు ప్రశ్నించగా.. ‘నా మాటలతో అందరినీ నవ్వించగలను’ అని బదులిచ్చాడు. ‘విదూషకుడి కొలువు అన్నమాట’ అని రాజు అనడంతో.. ‘మన ఆస్థానంలో ఆ స్థానం ఖాళీగా ఉంది’ అన్నాడు మంత్రి. ‘అయితే నీకు ఒక పరీక్ష పెడతాం. అందులో గెలిస్తేనే కొలువుకు అర్హుడివి అవుతావు’ అన్నాడు రాజు.

కాసేపటికి వంటమనిషి ఒక పళ్లెంలో తీపి, మరో దాంట్లో కారంతో చేసిన పదార్థాలను సభలోకి తీసుకువచ్చాడు. అది పూర్తిగా తినేయాలని రామయ్యకు షరతు పెట్టాడు మహారాజు. అతను ఏం చేస్తాడని అక్కడ ఉన్నవారంతా ఆసక్తిగా చూడసాగారు. ఇంతలో.. ‘ఎదురుగా మహారాజు, మంత్రి ఉండగా వారికి పెట్టకుండా నేనెలా తినగలను. వారికి కూడా ఆహారం తెప్పించండి. అందరం కలిసి ఆరగిస్తాము’ అన్నాడు రామయ్య. ఆ మాటలకు సంతృప్తి చెందిన మహారాజు అతడిని మెచ్చుకుని, ‘పరీక్షలో విజయం సాధించావు. ఈ కొలువులో ఇక నువ్వు చేరిపోవచ్చు’ అన్నాడు.

‘ధన్యవాదాలు మహారాజా! నాదొక మనవి’ అన్నాడతను. ఏంటని ప్రశ్నించాడు రాజు. ‘కష్టపడి పని చేస్తున్నవారికి కుటుంబ పోషణకు సరిపడే జీతం ఇవ్వడం ధర్మం. మన రాజ్యంలో సంపదకు కొరత లేదు. మీ ఆస్థానంలో పని చేసే వాళ్లకు జీతాలు కాస్త పెంచితే.. బాగుంటుందని నా అభిప్రాయం. కోటలోకి వచ్చేటప్పుడు భటులు నన్ను లంచం అడిగారు. ఎందుకలా అని ఆరా తీస్తే జీతాలు సరిపోవట్లేదని వాపోయారు. అది రాజ్యానికి ఎప్పటికైనా మంచిది కాదు’ అని వివరించాడు రామయ్య.
‘ఇంతవరకు ఈ విషయం నా వరకు రాలేదు. నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. వారి జీతాలను ఈ క్షణం నుంచే పెంచుతున్నాను’ అన్నాడు రాజు. ఇక ఆ రోజుకు పని పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరాడు రామయ్య. జీతాలు పెరిగాయని తెలుసుకున్న భటులు, రామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి లంచం మాట ఎత్తమని మాటిచ్చారు. రామయ్యకు కోటలో కొలువు దక్కడంతో సీతాపురం గ్రామ ప్రజలంతా ఎంతో సంతోషించారు.
యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని