ఆకలి నేర్పిన పాఠం..!

రామాపురం ఊరు చివర రోడ్డు పక్కనే ఒక తోట ఉండేది. ఆహారం కోసం ఓ కోతుల గుంపు ఎప్పుడూ అందులోకే వచ్చేది. వాటికి కావాల్సిన పండ్లను ఎంచక్కా వెతుక్కుని తినేవి.

Published : 19 Nov 2023 00:27 IST

రామాపురం ఊరు చివర రోడ్డు పక్కనే ఒక తోట ఉండేది. ఆహారం కోసం ఓ కోతుల గుంపు ఎప్పుడూ అందులోకే వచ్చేది. వాటికి కావాల్సిన పండ్లను ఎంచక్కా వెతుక్కుని తినేవి. అందులో బాగా బద్ధకం ఉన్న కోతి ఒకటి ఉండేది. దాని పేరు మర్కటం. అది నిద్రపోయాక లేవడానికి, లేచాక ఆహారం వెతుక్కోవడానికి కూడా బద్ధకించేది. మిగతావి మాత్రం ఆహారం విషయంలో చురుగ్గా ఉండేవి. ఇదేమో ఆలస్యంగా నిద్రలేచి, అవి తెచ్చుకున్న ఆహారం పెట్టమని వాటిని బతిమాలేది.

మొదట్లో ఆ కోతులు కూడా ఆహారం తెచ్చి ఇచ్చేవి. కొన్నిరోజులు గడిచాక ఇక మర్కటాన్ని పట్టించుకోవడం మానేశాయి. ప్రతిసారీ అవి, ఆహారం తెచ్చి ఇవ్వబోమని ఎంత తిట్టినా అది మాత్రం పెద్దగా లెక్క చేసేది కాదు. తినడానికి కాస్త తిండి పెడితే చాలనుకునేది. ముసలి కోతులు తప్ప, మిగతావన్ని ఆహారం కోసం తోటంతా జల్లెడ పట్టేవి. మర్కటం మాత్రం ముసలి కోతులతో కలిసి చెట్టు మీదే ఉండిపోయేది. ఆ కోతులన్నీ సాయంత్రం తిరిగొచ్చాక ముసలి కోతులకు ఆహారం పెట్టి అవి తినేవి. కానీ, మర్కటానికి మాత్రం పెట్టేవి కాదు. అది వాటిని చూసి కోపగించుకునేది. అంతేకానీ ఆహారాన్ని మాత్రం వెతుక్కునేది కాదు.

ఒకరోజు ఉదయాన్నే ఒక పెద్దాయన పండ్లు, మొక్కజొన్న పొత్తులు ఇతర ఆహార పదార్థాలు తీసుకొచ్చి వానరాలన్నింటికీ పంచి పెట్టాడు. దాంతో కోతులన్నీ చాలా ఆనందంగా తినేశాయి. అలా ఆ పెద్దాయన ప్రతిరోజూ వాటికి ఆహారం తీసుకొచ్చి పెట్టసాగాడు. కోతులన్నీ ఉదయం అవ్వగానే ఆయన కోసం ఎదురుచూస్తుండేవి. ఇక ఏ కోతిని ఆహారం పెట్టమని అడగాల్సిన పనిలేదు కాబట్టి.. వాటన్నింటి కంటే మర్కటానికే చాలా ఆనందంగా ఉండేది. ఆయన తెచ్చిన ఆహారంపైనే ఆ కోతులన్నీ పూర్తిగా ఆధారపడ్డాయి. అదే వాటి దినచర్యగా మారిపోయింది. మర్కటంతోపాటు మిగతావీ మరింత బద్ధకంగా తయారయ్యాయి. అలాగే కొన్ని నెలలు గడిచాయి.
ప్రతిరోజులానే ఉదయం కోతులన్నీ ఆ పెద్దాయన తెచ్చే ఆహారం కోసం ఎదురుచూడసాగాయి. కానీ, ఆయన తోటలోని పండ్లు అయిపోవడంతో రావడం మానేశాడాయన. రోజంతా ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. అలా నాలుగు రోజులు గడిచిపోయాయి. ‘ఇన్ని రోజులు కష్టపడకుండా ఆహారం దొరికింది. కానీ, ఇప్పుడు బద్ధకాన్ని వదిలి పెట్టాల్సిందే. మళ్లీ వేట తప్పదు’ అని అవన్నీ అనుకున్నాయి. మరుసటి రోజు నుంచి కోతులన్నీ ఆహార అన్వేషణలోకి దిగాయి. మర్కటం మాత్రం, ఇంకా ఆ పెద్దాయన కోసమే ఎదురుచూడసాగింది.  

ఇటు ఏ ప్రయత్నాలు చేయక, అటు మిగతావి ఆహారం ఇవ్వకపోవడంతో దాని ఆరోగ్యం మెల్లగా క్షీణించసాగింది. దాంతో మిగిలిన కోతులు ‘ఇన్ని రోజులు మనకు ఆహారం ఇచ్చిన వ్యక్తి వస్తాడని నువ్వు ఎదురుచూస్తున్నావు.. కానీ ఇక ఆయన రారు. మన కోసం ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఇతరుల మీద ఆధారపడకూడదు. మేము నీకు ఇచ్చేదైనా, ఆయన పెట్టేదైనా కొన్ని రోజుల వరకు మాత్రమే. ఆకలవుతున్నా చలించకుండా కూర్చుంటే.. నీకే నష్టం జరుగుతుంది. ఎప్పటికైనా నీ కష్టాన్నే నువ్వు నమ్ముకోవాలి. ఎవరూ మనం కోసం ఏదీ చేయరని గుర్తుపెట్టుకో. ఇంకా నువ్వు మారకపోతే.. నీ ఆరోగ్యం మరింత పాడవుతుంది. ఇక ఏమీ ఆలోచించకుండా మాతోపాటు రా.. ఆహారం వెతుక్కుందాం’ అన్నాయి. ఆ మాటలు మర్కటాన్ని ఆలోచనలో పడేశాయి. ఇకనైనా బద్ధకాన్ని వదిలి ఆహారాన్వేషణ ప్రారంభించాలనుకుంది. తనలో మార్పునకు కారణమైన నేస్తాలకి కృతజ్ఞతలు తెలిపింది.
ఎన్‌.త్రినాథ రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు