హరివిల్లుతో చిన్నూ స్నేహం!

‘హరివిల్లూ! నువ్వెంత అందంగా ఉన్నావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాతో స్నేహం చేస్తావా?’ అన్నాడు చిన్నూ.

Published : 20 Nov 2023 00:03 IST

‘హరివిల్లూ! నువ్వెంత అందంగా ఉన్నావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాతో స్నేహం చేస్తావా?’ అన్నాడు చిన్నూ. ‘ఓ! అలాగే చేస్తాను. నన్ను చూసి ముచ్చట పడే నీలాంటి పిల్లలంటే నాకు భలే ఇష్టం. అప్పుడు నేను మరింత ప్రకాశవంతంగా మారిపోతాను’ మెరిసిపోతూ అంది హరివిల్లు.

‘హరివిల్లూ! నీలోని ఏడు రంగులు చాలా బాగుంటాయి. నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ, ఆ ప్రదేశమంతా అందంగా మారిపోతుంది. చెరువు మీద కనిపిస్తే చెరువుకు అందం వస్తుంది. ఇంటి మీద కనిపిస్తే ఇల్లు బాగుంటుంది. మా స్కూల్‌ గ్రౌండ్లో కనిపిస్తే మా స్కూల్‌ కూడా చాలా బాగుంటుంది. నువ్వు నాతో కలిసి ఉంటావా?’ అన్నాడు చిన్నూ.
‘హ హ...’ అంటూ నవ్వేసింది హరివిల్లు. ‘అలా నవ్వితే నేను వదిలిపెట్టను. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నాతో ఉంటావా?’ బతిమాలినట్లు అన్నాడు చిన్నూ. ‘సరే! నేను కాదంటే నువ్వు ఒప్పుకునేలా లేవు. ఇక నుంచి నీతోనే ఉంటాను’ అంటూ ఆకాశం నుంచి దిగి కిందకు వచ్చింది హరివిల్లు.

నేల మీదకు దిగి తన పక్కకు వచ్చిన హరివిల్లును మురిపెంగా చూస్తూ చేత్తో ముట్టుకుని మురిసిపోయాడు చిన్నూ. ‘మా మంచి హరివిల్లు! పద మా ఇంట్లోకి వెళ్దాం. నాతో పాటు నా గదిలో ఉండు. ఎంచక్కా మనిద్దరం ఆడుకుందాం’ అన్నాడు చిన్నూ.

‘సరే!... అలాగే’ అంటూ చిన్నూ వెనుక హరివిల్లు అతడి గదిలోకి నడిచింది. ఆ రోజంతా హరివిల్లుతో ఆడుకున్నాడు చిన్నూ. అలా రెండు రోజులు గడిచాయి. మూడో రోజు చిన్నూ నిద్ర లేచేసరికి హరివిల్లులోని రంగులు పాలిపోయినట్లు కనిపిస్తున్నాయి. ప్రకాశవంతంగా, అందంగా ఉండే హరివిల్లు కళావిహీనంగా కనిపించేసరికి చిన్నూకు ఏమీ అర్థం కాలేదు.

‘హరివిల్లూ! నువ్వేంటి ఇదివరకటిలాగా అందంగా లేవు. ఇలా నీ రంగులన్నీ మసకబారినట్లు కనిపిస్తున్నాయి. నీకేమైంది?’ అని బాధగా అడిగాడు చిన్నూ. ‘చిన్నూ! నేను ఉండాల్సింది ఆకాశంలో. సూర్య కిరణాలు నేల మీదకు ప్రసరిస్తున్నప్పుడు వానచినుకులు పడితే నేను ఏర్పడతాను. నన్ను ఇంట్లో బంధిస్తే నాలో ప్రకాశం ఉండదు. వర్ణాలు కూడా ఉండవు’ అంది హరివిల్లు.

‘అయ్యో! అలా అయితే నిన్ను బాధ పెట్టను. ఎంచక్కా నువ్వు ఆకాశంలోనే ఉండు. నువ్వు అందంగా మెరిసిపోతేనే బాగుంటావు. అక్కడి నుంచే, నాతో స్నేహం చెయ్యి. వెళ్లి పో హరివిల్లు... వెళ్లి పో!’ అన్నాడు చిన్నూ. ‘చిన్నూ... చిన్నూ! ఏంటి నాన్నా? ఏంటి కలవరిస్తున్నావు? నిద్రలో కూడా హరివిల్లును మరచిపోలేదా?’ తట్టిలేపింది వాళ్ల అమ్మ పల్లవి. ‘అమ్మా! ఇదంతా కలా? నిజం కాదా?!’ అంటూ లేచాడు చిన్నూ. ‘ఇదంతా.. అంటే ఏది చిన్నూ?’ అని ప్రశ్నించింది పల్లవి.

‘హరివిల్లు నాతో మన ఇంట్లోనే ఉందమ్మా! కానీ పాపం సూర్యరశ్మి లేకపోవడం వల్ల తనలోని అందమైన రంగులు కోల్పోయింది. అందుకని నేనే ఆకాశంలోకి వెళ్లిపొమ్మని చెప్పాను’ అన్నాడు చిన్నూ.

‘చిన్నూ..! నిన్న సాయంత్రం హరివిల్లు కావాలని పేచీ పెట్టావు గుర్తుందా? అలా ఏడుస్తూ నిద్రపోవడం వల్ల నీకు కల వచ్చింది. హరివిల్లు ఎలా ఏర్పడుతుందో, సూర్యకాంతి లేకపోతే ఏం జరుగుతుందో నేను చెప్పినప్పుడు నువ్వు పట్టించుకోకుండా ఏడ్చావు. అదే నీకు హరివిల్లు చెప్పినట్లు అనిపించింది. అలా చూసినవన్నీ కావాలని పేచీ పెట్టకూడదు. పెద్దవాళ్లు చెప్పినవి వినాలని ఇప్పటికైనా నీకు అర్థమైందా?’ అంది పల్లవి. ‘బాగా తెలిసిందమ్మా! నువ్వు చెప్పిన మాట వింటాను. పేచీ పెట్టను, విసిగించను.. బుద్ధిగా ఉంటాను సరేనా!’ అన్నాడు చిన్నూ. ఆకాశంలో హరివిల్లు అందమైన చిన్నారి చిన్నూ ముఖంలో సప్త వర్ణాల రూపంలో మెరిసింది.  

కె.వి.సుమలత


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని