మొత్తానికి అడవిని కాపాడుకున్నాయి!

అటు కారడవి కాదు, ఇటు చిట్టడవి కాదు.. సాదాసీదా వనం అది. అదే.. ‘పెనుగొల్లు’ అడవి. ఓ రోజు కాకి... ‘కావ్‌.. కావ్‌.. ఈ సాయంత్రం అడవి సభకు అందరూ రండహో...!’ అని అరుస్తూ వెళ్లింది.

Updated : 21 Nov 2023 03:04 IST

అటు కారడవి కాదు, ఇటు చిట్టడవి కాదు.. సాదాసీదా వనం అది. అదే.. ‘పెనుగొల్లు’ అడవి. ఓ రోజు కాకి... ‘కావ్‌.. కావ్‌.. ఈ సాయంత్రం అడవి సభకు అందరూ రండహో...!’ అని అరుస్తూ వెళ్లింది. ఆ రోజు సాయంత్రం యథావిధిగా కోయిల గీతాలాపనతో సభ ఆరంభమైంది. సింహం పెద్ద బండ మీద కూర్చుంది. ఆ బండ దగ్గరే మంత్రి అయిన కోతి కూర్చుంది. దాని చుట్టూ ఉన్న చెట్ల మీద చిలుక, కాకి మిగతా పక్షులు ఒద్దికగా వాలి ఉన్నాయి. అలాగే అడవిలోని జంతువులన్నీ కుదురుగా కూర్చున్నాయి.

సింహం మాట్లాడుతూ.... ‘నేటి సమావేశం ఉద్దేశం ఏంటంటే... మన అడవిని మనుషులు నరికేస్తున్నారు. ఇదే కొనసాగితే... మన జంతువులు, పక్షులకు నిలువ నీడ ఉండదు. అప్పుడు మనం అడవిలో నుంచి ఉసూరుమని ఊళ్లలోకి వెళ్లాల్సిన ప్రమాదం పొంచి ఉంది’ అంది.

ఇంతలో... ‘అయ్యో... మృగరాజా! నన్ను వీధి కుక్కలు ఊరిలో ఉండనివ్వవు’ అని గొల్లుమంది నక్క. ‘నన్ను మాత్రం ఉండనిస్తాయా ఏంటి?’ అని కోతి కూడా అంది. ‘మృగరాజా! పల్లె ప్రజలు అడవులను నరికేస్తే వర్షాలు పడవు. పంటలు పండవు’ అని జోస్యం చెప్పసాగింది చిలుక. ‘అయ్యో..! అలా అయితే నన్ను ఎంగిలి చేత్తో కూడా కొట్టరేమో’ అంది కాకి.

‘ఆపండి మీ గోల.. ప్రతి సమస్యకు పరిష్కారం ఉండకపోదు. మంత్రి ఏమంటావు?’ అని అడిగింది సింహం జూలును సవరించుకుంటూ. తల గోక్కుంటూ కోతి ఎలుగుబంటి వైపు చూడసాగింది. అదేమో పక్కనే ఉన్న చెట్టుకు పట్టిన తేనెపట్టును ఆశగా చూస్తూ ఉంది.

‘ఏంటి మంత్రి మౌనంగా ఉన్నావు’ అని మళ్లీ అడిగింది సింహం. ‘మృగరాజా...! ఈ సమస్యను తేనెటీగలు పరిష్కరించగలవని నాకు అనిపిస్తోంది’ అంది కోతి. ‘సరే ఆ తేనెటీగలను రమ్మనండి’ అంది సింహం. వెంటనే తేనెటీగలు వచ్చి వాలాయి. ‘ఈ అడవిని మీరే కాపాడాలి’ అని గట్టిగా చెప్పింది సింహం. ‘చిరుజీవులమైన మేం అడవిని కాపాడగలమా?’ అన్నాయవి మృగరాజుతో.

‘తప్పకుండా కాపాడగలరు...’ అని పక్షులు, జంతువులు గట్టిగా అరిచాయి. ‘మీ అరుపులు ఆపండి. తేనెటీగల్లారా రేపటి నుంచే మీ పని ప్రారంభించండి’ అని ఆదేశించింది సింహం. ‘అలాగే మృగరాజా!’ అని నమస్కరించాయి తేనెటీగలు. ఆఖర్లో నెమలి నాట్యంతో ఆరోజు సభ ముగిసింది.

పక్షులు, జంతువులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. మరుసటి రోజు నుంచే తేనెపట్టులోని రాణి ఈగ... ఇతర తేనెటీగలకు, అడవిలోని ప్రతిచోటా రక్షకభటుల్లాగా.. చెట్టు చెట్టునూ కనిపెట్టుకొని ఉండమని పని పురమాయించింది. అడవిలోని చెట్లను నరకడానికి ఎవరైనా వస్తే, గొడ్డలి వేటు వేసీ వేయగానే తేనెటీగల దండు వాళ్ల వెంట పడేది. ‘జుం.. జుం..’ అని శబ్దం చేస్తూ... భయపెట్టడంతో వాళ్లు గొడ్డళ్లు వదిలేసి మరీ పరిగెత్తే వాళ్లు. అలా తేనెటీగలు ఆనాటి నుంచి అడవిని కాపాడసాగాయి. ఇక ఆ తర్వాత పెనుగొల్లు అడవిలోకి వెళ్లాలంటేనే జనాలు చాలా భయపడేవారు. ఎవరూ చెట్లను నరికే వారు కాదు. దాంతో అడవిలోనే జంతువులు, పక్షులు హాయిగా జీవించసాగాయి.

 అమ్మిన వెంకట అమ్మిరాజు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని