ఆ మూటే పాఠం నేర్పింది..!

నరసింహపురం గ్రామంలో రామయ్య, శరభయ్య అనే స్నేహితులు ఉండేవారు. ఒకరోజు వారిద్దరు పొరుగూరు సంతకి వెళ్లి, చిన్న అడవి మార్గంలో తిరిగి వస్తున్నారు. వారికి ఆ దారిలోనే రోడ్డు దాటుతూ ఓ అడవిపంది కనిపించింది.

Published : 23 Nov 2023 00:35 IST
రసింహపురం గ్రామంలో రామయ్య, శరభయ్య అనే స్నేహితులు ఉండేవారు. ఒకరోజు వారిద్దరు పొరుగూరు సంతకి వెళ్లి, చిన్న అడవి మార్గంలో తిరిగి వస్తున్నారు. వారికి ఆ దారిలోనే రోడ్డు దాటుతూ ఓ అడవిపంది కనిపించింది. దాన్ని చూసిన శరభయ్య కర్ర తీసుకొని కొట్టబోయాడు. అప్పుడు రామయ్య.. ‘ఏంటి నువ్వు చేస్తున్న పని. దాని దారిన అది వెళుతోంది. కారణం లేకుండా కొట్టడం దేనికి’ అని అతనితో అన్నాడు. అంతటితో ఆగిన శరభయ్య ‘నీకు దాని గురించి తెలియదు. నా జొన్న పంటను మొత్తం నాశనం చేసింది’ బదులిచ్చాడు. ‘ఆకలేసి తిందేమో. కొన్ని జొన్న కంకులు తిన్నంత మాత్రాన దాన్ని అలా కొట్టడం సరికాదు. అయినా... అది ఈ అడవిపందేనని సాక్ష్యం ఏంటి?’ అన్నాడు రామయ్య. ‘నాకు తెలుసు.. కచ్చితంగా ఇదే. ఈ చుట్టుపక్కల ఉన్న పొలాల్లో ఒకటే అడవిపంది తిరుగుతోంది. దీని వల్ల మనకు నష్టం తప్ప లాభం ఏం జరగదు’ అని అన్నాడతను. అలా మాట్లాడుకుంటూనే ఇద్దరూ గ్రామానికి చేరుకున్నారు.
ఒకరోజు శరభయ్య ఇంట్లో లేని సమయంలో దొంగతనం జరిగింది. తన కూతురు పెళ్లి కోసమని దాచిన బంగారమంతా పోయింది. చేసేదేం లేక.. రామయ్యతోపాటు వెళ్లి గ్రామపెద్దకు ఫిర్యాదు చేశాడు. వారం గడిచిన తర్వాత ఒక నగల మూట దొరికిందని, మీ నగల ఆనవాళ్లు ఏంటో చెప్పమని శరభయ్యకు అతడి నుంచి పిలుపు వచ్చింది. వెంటనే రామయ్యను తీసుకొని వెళ్లి, గుర్తులు వివరించాడు. అతను చెప్పినవి సరిపోవడంతో అది శరభయ్యదేనని నిర్ధారించుకున్న గ్రామపెద్ద ఆ మూటను అప్పగించాడు. వెంటనే ‘అసలు దొంగ ఎవరు? మీకు ఎక్కడ దొరికాడు’ అని ప్రశ్నించాడు శరభయ్య. పక్క గ్రామానికి చెందిన వేణు అనే అబ్బాయి తెచ్చి ఇచ్చాడని చెప్పాడు గ్రామపెద్ద. అతనికి ఎలా దొరికాయని మళ్లీ అడిగాడు శరభయ్య. అప్పుడు ఆయన బదులిస్తూ..‘మీ ఇంట్లో దొంగతనం చేసిన తర్వాత, ఆ దొంగ అడవికి పారిపోయాడు. అక్కడ అతన్ని ఒక కోతి కరవబోయింది. దాని నుంచి తప్పించుకొని వెళ్తుంటే.. అడవిపంది తరిమింది. దీంతో ఆ నగల మూటను అక్కడే పడేసి, దొంగ పరిగెత్తాడు. అప్పుడే అక్కడి నుంచి వస్తున్న వేణు, వాళ్ల తాతయ్య ఇదంతా చూశారు. వేణు వెళ్లి నగల మూటను తీసుకున్నాడు. వాళ్ల గ్రామంలో ఎవరివైనా నగలు పోయాయా? అని అడిగితే చాలామంది పోయాయని చెప్పారు కానీ, వారు చెప్పిన ఆనవాళ్లు ఏమాత్రం సరిపోలేదట. ఈరోజు మన గ్రామానికి వచ్చి నన్ను అడిగారు. అందుకే నిన్ను పిలిపించాను’ అని అన్నాడు.
అప్పుడు అక్కడే ఉన్న రామయ్య.. ‘అడవిపందితో నష్టం తప్ప, లాభం లేదన్నావు.. గుర్తుందా? కానీ ఇప్పుడు దాని వల్లే నీ నగల మూటను, ఆ దొంగ పడేసి వెళ్లిపోయాడు. అది ఈ అబ్బాయికి దొరికింది’ అన్నాడు. ‘నువ్వు చెప్పింది నిజమే. జంతువులైనా, మనుషులైనా దేన్నీ, ఎవరినీ తక్కువ చేసి చూడకూడదు. ప్రతిదాని వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుందని అర్థమైంది. ఇక నుంచి ఏ జంతువునూ కారణం లేకుండా కొట్టను’ అంటూ.. నగలు ఇచ్చిన వేణుకు కృతజ్ఞతలు తెలిపాడు. అతనికి బహుమతిగా కొంత డబ్బును అందివ్వబోయాడు. అప్పుడా పిల్లవాడు.. ‘నేను చేసింది మీకు సాయమే కావచ్చు. కానీ, నేను ఈ డబ్బులు తీసుకోలేను. ఇవి నాకిచ్చే బదులు, అడవిలోని జంతువులకు ఉపయోగపడేలా ఏదైనా పని చేయించండి. సరైన ఆహారం లేక అవి గ్రామాల్లోకి వస్తున్నాయి. ఊరి చివర ఉన్న అడవిలో మరిన్ని చెట్లను నాటించండి’ అన్నాడు. ఆ మాటలకు అక్కడున్నవారంతా వేణుని అభినందించారు.  
సంగనభట్ల చిన్న రామకిష్టయ్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని