అమ్మ చెబితే సరే!

అనగనగా కాసారం అనే దట్టమైన అడవి ఉండేది. అందులో ఓ చెట్టు తొర్రలో చిలుకల జంట గుడ్లుపెట్టి, పిల్లల్ని పొదిగింది. అవి కాస్త పెద్దయ్యే వరకు మెత్తని పండ్ల గుజ్జు, చిన్నచిన్న పండ్ల ముక్కలు తినిపించేవి పెద్ద చిలుకలు. అవి కాస్త కళ్లు విప్పగానే కొరికి తినడానికి వీలుగా ఉండే పండ్లను తెచ్చిపెట్టేవి.

Updated : 24 Nov 2023 05:18 IST

అనగనగా కాసారం అనే దట్టమైన అడవి ఉండేది. అందులో ఓ చెట్టు తొర్రలో చిలుకల జంట గుడ్లుపెట్టి, పిల్లల్ని పొదిగింది. అవి కాస్త పెద్దయ్యే వరకు మెత్తని పండ్ల గుజ్జు, చిన్నచిన్న పండ్ల ముక్కలు తినిపించేవి పెద్ద చిలుకలు. అవి కాస్త కళ్లు విప్పగానే కొరికి తినడానికి వీలుగా ఉండే పండ్లను తెచ్చిపెట్టేవి. ఎక్కడెక్కడి నుంచో తియ్యని మామిడి, నోరూరించే సపోటా, కండగల జామ, ఎర్రెర్రని సీమచింత మొదలైన పండ్లను తెచ్చి పెడుతూ ఉండేవి. ఒక్కోసారి ఒక్కో పండు తీసుకొస్తుంటే.. ఈసారి ఏ పండు తెస్తాయా? దాని రుచి ఎలా ఉంటుందా? అని ఎదురు చూస్తూ ఉండేవి పిల్ల చిలుకలు.

ఒకసారి అమ్మ చిలుక పండు తెస్తే, మరోసారి నాన్న చిలుక తెచ్చేది. అవే వాటికి ఎలా తినాలో నేర్పించేవి. ఒకసారి అమ్మ చిలుక రెండు దోర జామపండ్లను జంటగా పట్టుకొచ్చింది. అందులో మెత్తని గుజ్జుతో పాటు గింజలు కూడా ఉన్నాయి. ‘అమ్మా! గింజలు గట్టిగా ఉన్నాయి’ అంది ఒక పిల్ల. ‘ఆ గింజలు నేను తినను బాబు’ అంది రెండోది. ‘తినాలమ్మా...! అవి తింటేనే మీ ముక్కులు గట్టి పడతాయి’ అని చెప్పింది తల్లి చిలుక. కొన్నిరోజుల తర్వాత వాటికి కొంచెం కొంచెం ఎగరడం వచ్చింది. ‘మాతో పాటు మిమ్మల్ని కూడా ఈరోజు చెట్టు దగ్గరకు తీసుకువెళతాను. మీకు నచ్చిన పండ్లు తిందురు కానీ...’ అని చెప్పింది తండ్రి చిలుక.

దగ్గరలో ఉన్న మామిడిచెట్టు దగ్గరికి తీసుకెళ్లిందది. చిన్నకాయలు, పెద్దకాయలు, దోర కాయలు, పండ్లు, ఇలా ఎన్నో ఉన్నాయి. అదంతా చూసి చిలుక పిల్లలకు చాలా సరదాగా అనిపించింది. ఒక్కో కాయను కొరికి చూసింది ఒక పిల్ల. ఏ కాయ కొరికినా... అమ్మ ఇచ్చిన పండంత రుచిగా లేదంది మరో చిలుక. ‘అలా అన్ని కాయలూ కొరికి పాడుచేయకూడదు. నేను చూపిస్తాను.. వాటిని తినండి’ అంది అమ్మ చిలుక. ‘సరే..’ అన్నాయి పిల్లలు. ‘అమ్మా! నువ్వు తెచ్చిన పండ్లు ఈ చెట్టుకు లేవేంటి?’ అని అడిగింది ఒక పిల్ల. ‘ఇది మామిడి చెట్టు. ఇక్కడ మామిడి పండ్లు మాత్రమే ఉంటాయి. రేపు జామ చెట్టు దగ్గరికి వెళ్దాం. ఒక్కో చెట్టుకు ఒక్కో కాయ కాస్తుంది. దేని రుచి దానిదే’ అంది నాన్న చిలుక.

మర్నాడు పిల్లల్ని జామ చెట్టు దగ్గరకు తీసుకెళ్లాయి. ‘మీరు కాయలన్నీ కొరికేయకండి. నిన్న చెప్పాను కదా! అలా జాగ్రత్తగా ఎంచుకోండి. మన ఇంటికి తీసుకెళ్లి తిందాం’ అంది అమ్మ చిలుక. ‘ఇక్కడే తినేద్దాం’ అంది ఒక పిల్ల చిలుక.

‘అమ్మ చెప్పినట్లు వినండి’ అని రెండు దోరకాయలను నోట కరచి ఇంటివైపు దారి తీసింది నాన్న చిలుక. మరో రెండు కాయలతో బయలుదేరింది అమ్మ చిలుక. వెనకాలే వెళ్లాయా  పిల్ల చిలుకలు. మరుసటిరోజు.. ‘నిన్న మనం తిన్న చోట ఒకటే జామచెట్టు ఉంది. అందుకు కారణం ఆ చెట్టు కిందే, దాని కాయలు, పండ్లు, విత్తనాలు పడి ఉంటాయి. నీడ వల్ల అవి మొలకెత్తవు. ఒకవేళ మొలకెత్తినా పెరగవు. అందుకే మనలాంటి పక్షులు, ఉడుతలు, ఆ కాయలను, పండ్లను, విత్తనాలను వేర్వేరు ప్రదేశాలకు తీసుకు వెళ్లి తింటాయి. అప్పుడు అక్కడ గింజలు పడి కొత్త మొక్కలు మొలకెత్తుతాయి. అందుకే నచ్చిన చెట్టు మీద ఒకటో రెండో కొరికి తిన్నా అక్కడి నుంచి ఆ కాయలు పండ్లు తెచ్చుకుని వేరే చోట పెట్టుకుని తినడం మంచిది’ అంది అమ్మ చిలుక. ‘అప్పుడు మనకు కావల్సినన్ని పండ్ల చెట్లు పెరుగుతాయి’ అంది పిల్ల చిలుక. ‘అమ్మ చెబితే సరే!’ అన్నాయి రెండూ!!  

కాశీ విశ్వనాథం పట్రాయుడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని