పారని నక్క జిత్తులు!

కావేరీ నది ఒడ్డున ఉన్న అడవికి సివంగి రాణిగా, ఏనుగు మంత్రిగా ఉండేది. అది ఎవరు ముందు చెబితే వారి మాటే నమ్ముతుందన్న విషయం వికట అనే నక్కకు బాగా తెలుసు.

Updated : 26 Nov 2023 04:44 IST

కావేరీ నది ఒడ్డున ఉన్న అడవికి సివంగి రాణిగా, ఏనుగు మంత్రిగా ఉండేది. అది ఎవరు ముందు చెబితే వారి మాటే నమ్ముతుందన్న విషయం వికట అనే నక్కకు బాగా తెలుసు. అది ఒకరోజు చందమామను చూపిస్తానంటూ కుందేలు పిల్లని అడవి చివరకి తీసుకెళ్లి తినేసింది. మళ్లీ ఏమీ ఎరగనట్లు అడవిలోకి వచ్చింది.

పాపం తల్లి కుందేలేమో తన పిల్ల కనపడక విలవిల్లాడి పోయింది. అది చూసిన కాకి ‘నీ బిడ్డ అడవి బయటకు వెళ్లడం చూశాను’ అని చెప్పింది. దానికి ఇదంతా వికట చేసిన పనే అని అనుమానం వచ్చింది. తన పిల్లను అదే ఏదో చేసిందనుకుంది.

ఈ విషయమంతా ఎలాగైనా రాణికి చెప్పాలని తల్లి కుందేలు లేడితో మాట్లాడటం వికట వింది. కుందేలు కంటే ముందుగానే రాణిని కలవడానికి వెళ్లిందది. అక్కడికి వెళ్లి ‘మహారాణి, ఏనుగు మంత్రికి వందనాలు. ఈ అడవిలో ఏ చిన్న జంతువు కనిపించకపోయినా అన్నీ నన్నే అనుమానిస్తున్నాయి. నేను చాలా కాలంగా జంతువులను చంపి తినడం మానేశాను. ఏమైనా పెద్ద జంతువులు తిని వదిలేసిన మాంసంతో పొట్ట నింపుకుంటున్నాను. ఈ విషయమే మీకు విన్న వించుకుందామని వచ్చాను’ అంది వినయంగా.

‘ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారని’ అంది రాణి. ‘ఎవరో అంటారని కాదు మహారాణీ! మీకు విషయం ముందుగా చెబితే నాకు నింద రాకుండా ఉంటుందని..!’ అంది మరింత వినయంగా. ‘నీ పైన ఎవరు చాడీలు చెప్పినా రాణీగారు వినరులే ఇక నీవు నిశ్చింతగా వెళ్లొచ్చు’ అంది ఏనుగు. నక్క లోలోపలే సంతోషిస్తూ.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. అది వెళ్లిన కొంత సేపటికి కుందేలు వచ్చింది. ‘మహారాణీ నిన్నటి నుంచి నా బిడ్డ కనిపించడంలేదు. వికట అనే నక్క, దాన్ని చంపిందని నా అనుమానం’ అంది బాధపడుతూ. ‘చిన్నపిల్లలను ఎటు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే కానీ కనిపించిన జంతువులన్నింటినీ అనుమానించడం సరికాదు’ అని బదులిచ్చింది రాణి.‘చూడు.. కుందేలా! నీ కంటే ముందే వికట, రాణిని కలిసింది. ముందుగా ఎవరు వచ్చి చెబితే, వారిదే నిజం అనుకునే నైజం రాణిది. అందుకే నీ మాట వినలేదు. వికట పాపం పండిన రోజు అన్నీ బయటకు వస్తాయి’ అంది నెమ్మదిగా కాకి. ఒకరోజు వికట, పక్క అడవి తోడేలు రెండూ కలిశాయి. ‘మిత్రమా! మీ అడవిలో ఓ గున్న ఏనుగును చూశాను. చాలా కండ పట్టి భలే ఉంది. దాన్ని తీసుకురా! రెండు రోజుల వరకు ఇక ఏ జంతువు జోలికి వెళ్లాల్సిన పని ఉండదు’ అంది తోడేలు. ‘అమ్మో.. అది మా మంత్రి ఏనుగు బిడ్డ. దాన్ని తెస్తే ఏమైనా ఉందా! అడవి అల్లకల్లోలం అయిపోతుంది’ అంది వికట.

‘ఏమీ కాదు.. తీసుకురాగానే చంపితే భయపడాలి. దాన్ని తెచ్చి ఈ గుహలో దాచేద్దాం. ఆ గొడవ కాస్త తగ్గుముఖం పట్టాక తినేద్దాం. గున్న మాంసం భలే ఉంటుంది. ముందు రెండు రోజులు మహారాణి దగ్గరే ఉండు. నీ మీద ఏ అనుమానమూ రాదు. తర్వాత, గున్నకు చెరకు తోట చూపిస్తా అని తీసుకురా’ అంది తోడేలు.

‘సరే సమయం చూసుకుని తీసుకొస్తా. అంత వరకు నువ్వు కూడా ఇక్కడ తిరగకు’ అంది వికట. అనుకున్న ప్రకారం అది, రాణి దగ్గర మకాం వేసింది. రాణికి నీతి కథలు చెబుతూ ఉంది. అది చూసిన కాకి, కుందేలును కలిసి ‘ఈసారి వికట ఏదో పెద్ద ఎత్తుగడ వేసింది. ఎవరిని మోసం చేస్తుందో మరి?’ అంది.

‘మిత్రమా! నువ్వు చిన్న సహాయం చేస్తే, ఈ నక్క పీడ విరగడై పోతుంది’ అంది కుందేలు. ‘ఏం చేయమంటావు’ అంది కాకి. ‘వికటని కనిపెట్టుకుని ఉండు. అది వేసే ఎత్తులు ఎప్పటికప్పుడు నాకు చెప్పు చాలు’ అని బదులిచ్చిందది. రెండు రోజుల తరువాత వికట ఆడుకుంటున్న గున్న ఏనుగును కలిసింది. ‘ఓ గున్న.. ఎంతసేపు ఈ గడ్డి తింటావు. ఈ అడవికి తూర్పున చెరకు తోట ఉంది. అక్కడికి రా నీకు తియ్యని చెరకు తినిపిస్తా’.. అంది. అలా దాన్ని మభ్యపెట్టి అడవి చివరకు తీసుకుపోయిందది.

‘ఓ గున్న .. నువ్వు ఈ గుహలో కూర్చో..’ అంటూ తోడేలు తెచ్చిన చెరకు దానికి అందించింది. ఆనందంగా చెరకు తింటోన్న గున్నను లోపల వదిలిపెట్టి, గుహ ద్వారానికి అడ్డుగా రాయిని పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది వికట. ఇదంతా చూసిన కాకి, కుందేలుకు విషయమంతా చెప్పింది. వెంటనే కుందేలు, ఏనుగుకు ఈ సంగతంతా వివరించింది.

ఏమీ తెలియనట్లు మంత్రి ఏనుగు మరుసటి రోజు గున్న ఏనుగు కోసం అందరితోపాటు వెతికింది. ఎక్కడా కనబడక పోవడంతో ఎక్కడికి పోయింది అనుకుంటూ బాధ పడింది ఏనుగు మంత్రి! గోల సద్దుమణిగాక గుహ దగ్గరకు బయలు దేరింది వికట. ‘రా తోడేలు మామా..! నీ కోరిక తీరగా గున్న ఏనుగు మాంసం తిందువు కానీ’ అని గుహకు అడ్డుగా ఉన్న రాయిని తొలగించింది వికట.

‘రా లోపలకు’ అంది మంత్రి ఏనుగు! గుహలో దాన్ని చూడగానే నక్క, తోడేలుకు పై ప్రాణాలు పైకే పోయాయి. ఏనుగు తన తొండంతో వికటని, కాలితో తోడేలును తొక్కి పడేసింది. .....కుందేలు చెప్పగానే మంత్రి ఏనుగు తన గున్న ఏనుగును భద్రంగా బయటకు పంపింది. నక్క, తోడేలు వచ్చే ముందు తాను గుహలోకి వెళ్లి రాయిని అడ్డం పెట్టుకుంది ఇదంతా తెలియక నక్క, తోడేలు తమ ప్రాణాలు కోల్పోయాయి. ‘ఎవరు ముందు చెబితే, వారి మాటే నిజం అనుకునే మా రాణి గారిని, నన్ను క్షమించండి. నా బిడ్డను కాపాడినందుకు కృతజ్ఞతలు’ అని తర్వాత ఏనుగు, కుందేలుకు చెప్పింది.

కూచిమంచి నాగేంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని