చిరుత ఓడింది.. జింక గెలిచింది!

మహేంద్రగిరి అడవిలోని జంతువులన్నీ మృగరాజు నిర్వహించే పరుగు పందెం స్థలానికి బయలుదేరి వెళుతున్నాయి. ప్రతి సంవత్సరం మృగరాజు తన బుజ్జి సింహం జన్మదినం సందర్భంగా అడవిలో జంతువులకు పరుగు పందెం పెడుతోంది.

Updated : 27 Nov 2023 00:24 IST

హేంద్రగిరి అడవిలోని జంతువులన్నీ మృగరాజు నిర్వహించే పరుగు పందెం స్థలానికి బయలుదేరి వెళుతున్నాయి. ప్రతి సంవత్సరం మృగరాజు తన బుజ్జి సింహం జన్మదినం సందర్భంగా అడవిలో జంతువులకు పరుగు పందెం పెడుతోంది. గెలిచిన వారిని చక్కని కానుకలతో సత్కరిస్తోంది. అన్ని జంతువులకు చక్కటి విందు ఏర్పాటు చేస్తోంది. గత రెండు సంవత్సరాలుగా పరుగు పందెం పోటీలో చిరుత పులి రెండోస్థానం, జింక మొదటి స్థానం సాధిస్తున్నాయి. ప్రథమ స్థానంలో నిలిచినందుకు జింక మృగరాజుతో సత్కారం, కానుకలు పొందుతోంది.

కానీ గత నెల రోజులుగా జింక ఆచూకీ లేదు. అది ఏమైందో అడవిలో జంతువులకు ఇంతవరకు తెలియ రాలేదు. పరుగు పందెం చూడ్డానికి వస్తున్న జంతువులు అదే విషయం మాట్లాడుకుంటున్నాయి. ఎలుగుబంటి, ఏనుగుతో.. ‘మిత్రమా! రెండు సంవత్సరాలుగా చిరుతతో పోటీపడి, గెలుస్తూ వస్తున్న జింక నెల రోజులుగా కనిపించకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ సారి చిరుతతో పోటీపడి గెలిచేవారు ఎవరూ కనబడటం లేదు. చిరుతపులే విజేతగా నిలుస్తుందేమో!’ అని అంది. ఏనుగు కూడా... ‘అవును... జింక ఏమైందో ఏమిటో! అర్థమే కావటం లేదు. ఎక్కడికి వెళ్లిపోయిందో. చిరుతకు ఎదురే ఉండదు’ అని ఎలుగుబంటితో అంది. పోటీకి వస్తున్న అందరి మదిలో కూడా గతంలో గెలిచిన జింక కోసమే చర్చ జరుగుతోంది.

అన్ని జంతువులు పోటీ స్థలానికి చేరుకున్నాయి. మృగరాజు తన బుజ్జి సింహంతో పోటీ స్థలానికి చేరుకొని, పరుగు పందెం ఆరంభించమని మంత్రి నక్కను ఆదేశించింది. రెండు సంవత్సరాలుగా జింక చేతిలో ఓడిపోతున్న చిరుత ఈ సారి చాలా హుషారుగా ఉంది. మంత్రి నక్క ఆదేశంతో పోటీ ప్రారంభమైంది. చిరుతతో పాటు పోటీలో చాలా జంతువులు పాల్గొన్నాయి.

చిరుత వాయువేగంతో పరుగు అందుకొని, అన్ని జంతువుల కన్నా ముందే నిర్ణీత స్థలానికి చేరుకుంది. తానే విజేత అనే ఆనందంతో చిందులు వేస్తోంది. ఇంతలో మృగరాజు చిరుత పులిని ఉద్దేశించి... ‘నీ కేరింతలు కాస్త ఆపు. ఇంకా పోటీ పూర్తి కాలేదు. ఆనవాయితీ ప్రకారం గత సంవత్సరం విజేతతో నువ్వు పోటీ పడాల్సి ఉంది’ అని అంది. అప్పుడు చిరుత పులి... ‘మృగరాజా! జింక ఆచూకీ లేదు కదా! అటువంటప్పుడు నేనే విజేత కదా!’ అని అంది. ఇంతలో రెండు సంవత్సరాలుగా విజేతగా నిలుస్తున్న జింక పోటీ స్థలానికి వచ్చింది. దాన్ని చూడ్డంతోనే చిరుతపులి జావగారిపోయింది.

అది నేరుగా సింహం కాళ్లపై పడింది. ‘మృగరాజా! నన్ను క్షమించండి. ఈ ఏడాది ఎలా అయినా నేను గెలవాలనే ఆలోచనతో, నెల రోజుల క్రితం ఆహార సేకరణ నిమిత్తం వెళ్లిన జింకను అటకాయించి, ఈ సారి నువ్వు పరుగు పందెంలో పాల్గొనకూడదు. అందుకే నువ్వు ఇక్కడ ఉండకుండా వేరే ప్రాంతానికి వెళ్లిపో. లేకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తా’ అని బెదిరించాను. అందుకే నెల రోజులుగా జింక ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఈ రోజు నేనే విజేత అనుకున్నాను. నన్ను క్షమించండి’ అని అంది.

మృగరాజు, చిరుతతో... ‘గెలుపు అనేది పోటీ ద్వారా జరగాలి. కానీ నువ్వు జింకను భయపెట్టడం, మంత్రి నక్క చూసింది. విషయం నాకు చెప్పింది. అందుకే ఈ నెల రోజులుగా నా గుహలోనే జింకను ఉంచాను. నీకు గెలవాలనే సంకల్పం ఉంటే మరింత సాధన చేసి గెలవాలి. కానీ కపట బుద్ధితో జింకను బెదిరించి గెలుపు సాధించాలనుకోవడం సరికాదు. నీలాంటి వారికి ఈ అడవిలో చోటే ఉండదు. వెంటనే ఈ అడవి వదిలి వెళ్లిపో. లేకపోతే నా పంజా దెబ్బ రుచి చూడాల్సి ఉంటుంది’ అంది.

చిరుత పులి, జింకను క్షమించమని కోరుతూ... అక్కడి నుంచి వేరే అడవికి పారిపోయింది. జింకను చూసిన అన్ని జంతువులు చాలా ఆనందపడ్డాయి. మృగరాజుకు జింకను రక్షించినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. మృగరాజు ఏర్పాటు చేసిన విందును ఆరగించి తమ నివాసాలకు వెళ్లిపోయాయి.                    

మొర్రి గోపి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు