బంగారు చేపలు దొరికాయోచ్‌!

పూర్వం రామాపురంలో రంగయ్య, మంగయ్య అనే జాలర్లు ఉండేవారు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు.

Updated : 28 Nov 2023 04:55 IST

పూర్వం రామాపురంలో రంగయ్య, మంగయ్య అనే జాలర్లు ఉండేవారు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఊరికి ఉత్తరాన ఉండే నదిలో నాటు పడవ మీద ఇద్దరూ కలిసి వెళ్లి చేపలు పట్టేవారు. ఒడ్డుకు చేరాక చెరిసగం పంచుకుని ఊర్లో వీధి, వీధి తిరిగి అమ్మేవారు. ఇద్దరికీ ఆదాయం బాగానే ఉండేది. దాంతో వారికి జీవనం జరిగిపోతుండేది. ఎప్పటిలానే ఆ రోజు కూడా, ఇద్దరూ కలిసి నదిలో పడవపై వేటకు వెళ్లారు. ఆ రోజు ఒక విచిత్రం జరిగింది. అదేమంటే ఈసారి వలలో బంగారు రంగులో మెరిసిపోతున్న చేపలు కొన్ని పడ్డాయి. వాటి కనులు నీలాలను పోలి ఉన్నాయి. పక్కనే ఉన్న జాలర్లు ఆశ్చర్యపోయారు. ఇలాంటి చేపలు చాలా అరుదుగా వలల్లో పడుతుంటాయని అన్నారు.

జాలర్ల దగ్గర చిల్లరగా చేపలు కొని పట్టణంలో వాటిని పెద్ద మొత్తంలో అమ్మి బాగా లాభాలు గడించే పెద్ద వ్యాపారి.. ఆ సమయానికి అక్కడే ఉన్నాడు. బంగారు చేపల్ని చూసేసరికి అతనికి పట్టలేని ఆనందం కలిగింది. ఎందుకంటే పట్టణంలో వాటికి గిరాకీ ఎక్కువ. వాటిని ధనవంతులు ఇంట్లో మంచి నీళ్ల గుంటలు ఏర్పాటు చేసుకుని ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. పిల్లలు వాటిని చూస్తూ ముచ్చట పడుతుంటారు.

అందుకని రంగయ్య, మంగయ్యను వాటిని తనకు అమ్మమని అడిగాడు. రంగయ్య వాటిని అమ్మడానికి ఒప్పుకోలేదు. ఆ వ్యాపారి మొండివాడు! అనుకున్నది సాధించేదాకా వదలడు. ‘మీరు అడిగినంత ధర ఇస్తాను’ అని అతడు రంగయ్య, మంగయ్యతో బేరానికి దిగాడు. ‘ఈ రోజు నక్కతోక తొక్కి వేటకు వచ్చినట్లున్నామే!’ అనుకుని తన భాగాన్ని ఆ వ్యాపారికి అధిక ధరకు అమ్మి, సంతోషంగా ఇల్లు చేరాడు మంగయ్య. రంగయ్య మాత్రం వ్యాపారి ఎంత ధర చెప్పినా పట్టువీడలేదు.

తన భాగానికి వచ్చిన చేపల్ని తీసుకుపోయి, తన ఇంటి పక్కనున్న నీటిగుంటలో వేసి జాగ్రత్తగా సంరక్షించసాగాడు. త్వరలోనే గుంటలో చేపల సంఖ్య విపరీతంగా పెరిగింది. వాటిలో కొన్నింటిని పట్టి అధిక ధరలకు అమ్మి మంచి లాభాలు గడించాడు రంగయ్య. ఇలా గుంటలో చేపలను కంటికిరెప్పలా కాపాడుకుంటూ పెంచడం, వాటి సంఖ్య పెరిగినపుడు కొన్నింటిని అమ్మి, సొమ్ము చేసుకుంటూ రంగయ్య తక్కువ కాలంలోనే ఆర్థికంగా బలపడ్డాడు. ఆ విధంగా అవి అతని పాలిట నిజంగా బంగారు చేపలే అయ్యాయి. ఇదంతా చూస్తున్న మంగయ్యకు తాను తొందరపడి, పొరపాటు చేశానని అర్థమైంది. ఆ విషయమే రంగయ్యతో చెప్పి బాధపడ్డాడు. దానికి రంగయ్య, ‘బాధపడకు మంగయ్యా! ఇది సహజమే! నువ్వు తాత్కాలిక ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చావు. అరుదైన బంగారు చేపలకు భవిష్యత్తులో మరింత గిరాకీ ఉంటుందని నేను ఊహించాను. వాటి సంఖ్యను పెంచి మరింత లాభాలు పొందవచ్చనే ముందు చూపుతో, ఆరోజు వ్యాపారికి అమ్మడానికి నిరాకరించాను. మంచినీళ్ల గుంటలో వాటి సంఖ్యను పెంచుతూ వచ్చాను. మా ఇంటిపక్కనే ఉన్న ఖాళీస్థలంలో మరొక గుంట తవ్వుదాం. నువ్వూ దాంట్లో ఈ చేపలు పెంచు. భవిష్యత్తులో లాభాలు గడించవచ్చు’ అన్నాడు.

మిత్రుడి మంచి మనసుకు మంగయ్య సంతోషించాడు. బంగారు వన్నె చేపలు పెంచాడు. ఆర్థికంగా బలపడ్డాడు. ఆ తరవాత మిత్రుడి ముందుచూపును ఆదర్శంగా తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. ‘తాత్కాలిక ప్రయోజనాల కన్నా... శాశ్వత ప్రయోజనాలు మిన్న’ అని తెలుసుకున్నాడు. అంతేగాక మిత్రుడు చేసిన మేలును ఎప్పుడూ మరవలేదు.

డా.గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని