ఇంతకీ సింహం ఎందుకు నవ్వింది?!

నందనవనం అడవికి రాజైన సింహం అత్యవసరంగా సమావేశానికి రావాల్సిందిగా, జీవులన్నింటికీ కాకితో కబురు పెట్టింది. మృగరాజు మాటను గౌరవించి, అడవి జీవులన్నీ సమావేశానికి వచ్చాయి

Published : 29 Nov 2023 23:51 IST

నందనవనం అడవికి రాజైన సింహం అత్యవసరంగా సమావేశానికి రావాల్సిందిగా, జీవులన్నింటికీ కాకితో కబురు పెట్టింది. మృగరాజు మాటను గౌరవించి, అడవి జీవులన్నీ సమావేశానికి వచ్చాయి. మృగరాజు రాతి బండ మీద కూర్చుంది. సమావేశానికి వచ్చిన జీవులన్నింటినీ తేరిపారా చూసింది. వెంటనే బిగ్గరగా నవ్వింది.

అత్యవసర సమావేశానికి కారణం ఏంటో మృగరాజు చెబుతుందని ఎదురు చూస్తున్న జంతువులు, పక్షులు.. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. సింహం వంక విచిత్రంగా చూశాయి. మృగరాజు రెండోసారి కూడా బిగ్గరగా నవ్వింది. దీంతో అడవి జీవులన్నీ మృగరాజు వైపు అనుమానంగా చూశాయి.

 ‘మృగరాజు నవ్వుకు కారణం ఏమై ఉంటుంది?’ అని అన్ని జీవులూ మనసులో అనుకున్నాయి. ముచ్చటగా మూడోసారి కూడా సింహం బిగ్గరగా నవ్వడంతో, జంతువులు, పక్షులు అసహనంగా సింహం వైపు చూశాయి.

 ‘మృగరాజా! కారణం లేకుండా నవ్వు, తోరణం లేకుండా పందిరి ఉండదని అంటారు. నేను అతితెలివిగా ప్రవర్తిస్తానని, అందుకే నన్ను జిత్తులమారి అంటారని.. మీరు నన్ను చూసి వెక్కిరిస్తూ నవ్వారు కదూ!’ అని నక్క అంది.
‘నా నవ్వుకు కారణం అది కాదు’ సింహం సమాధానంగా నక్క వైపు చూస్తూ అంది. ‘ఎంత ఎదిగినా అల్లరి చేస్తూ, కుప్పి గంతులు వేస్తానని నన్ను చూసి నవ్వారు కదూ, మృగరాజా!’ అని కోతి కూడా మూతి ముడుచుకుంటూ సింహాన్ని అడిగింది. ‘నా నవ్వుకు కారణం అది కాదు’ అని నక్కతో చెప్పినట్టే, కోతితో కూడా చెప్పింది సింహం.
‘నాకు మతి మరుపు ఎక్కువని, చిన్నగా ఉంటాననీ, నన్ను చూసి నవ్వారు కదూ’ ఉడుత ఉడుక్కుంటూ సింహాన్ని ధైర్యంగా అడిగింది. ‘నా నవ్వుకు కారణం అది కాదు’... నక్క, కోతికి చెప్పినట్లుగానే, ఉడుతతో కూడా అంది సింహం.
‘నాకు గూడు కట్టుకోవడం చేత కాదని, కాకి గూట్లో గుడ్లు పెడతానని.. నన్ను చూసి నవ్వారు కదూ!’ అని కోకిల కూడా సింహాన్ని అడిగింది. కానీ మృగరాజు నవ్వుతూ, ‘నా నవ్వుకు కారణం అది కాదు’ అని చెప్పింది.
‘నాకు బద్ధకం ఎక్కువని, ఇష్టమైన తేనెను కష్టపడకుండా ఇతరులను అడిగి తాగుతానని.. నన్ను చూసి నవ్వారు కదూ!’ అని ఎలుగుబంటి కూడా తనదైన రీతిలో సింహాన్ని అడిగింది. మృగరాజు మాత్రం అందరితో చెప్పిన సమాధానమే, చిన్నగా నవ్వుతూ ఎలుగుబంటితోనూ చెప్పింది. ‘మృగరాజా! మీ నవ్వుకు కారణం చెప్పక పోతే, అన్ని జీవులూ, వేటికవే.. నన్నంటే నన్ను చూసి నవ్వారనుకుని, వేటికవే బాధపడే అవకాశం ఉంది. కనుక మీ నవ్వుకు కారణం చెప్పండి... గుట్టు విప్పండి’ అని మంత్రి కుందేలు అడిగింది.
దీంతో సింహం లేచి, అన్ని జీవుల వైపు తిరిగి.. తేరిపారా చూస్తూ ఇలా అంది. ‘నక్క అన్నట్లుగా కారణం లేకుండా నవ్వు రాదు. అయితే నా నవ్వుకు కారణం మీరన్నది కాదు’ అంది. ‘మరెందుకు నవ్వారు, మృగరాజా?’ అని అన్ని జీవులూ ఆసక్తిగా ఒక్కసారిగా అడిగాయి.
సింహం కాస్త గంభీరంగా మొహం పెట్టుకుని... ‘సరిగ్గా వారం రోజుల క్రితం.. మన అడవిలో మనతో పాటు నివసించే చిరుత జబ్బు చేసి, చనిపోయింది. మనకు చాలా బాధ వేసింది. చిరుత మనం సమావేశం పెట్టుకున్నప్పుడు, అడవి సరిహద్దుల్లో కాపలా కాసేది. వేటగాళ్ల వంటి శత్రువులు రాకుండా అడవి చుట్టూ తిరిగేదని మనందరికీ తెలుసు. నేను అడవిలో లేనప్పుడు, అప్రమత్తంగా ఉండేది కూడా. ఇప్పుడు ఆ చిరుతలా.. తోటి జంతువులు, సాటి పక్షులను రక్షించే అధికారిగా ఎవరు ఉంటారని మొన్న జరిగిన సమావేశంలో మీ అందరినీ అడిగాను. అప్పుడు నక్క, ఎలుగుబంటి, తోడేలు ముందుకొచ్చాయి.
‘నన్నంటే, నన్ను నియమించండి.. అంటూ గోల పెట్టాయి. అయితే ఆ పదవి ఎవరికి ఇవ్వాలా... అని మంత్రి కుందేలుతో సమాలోచన చేశాను. అందుకే సమావేశం పేరుతో చిన్న పరీక్ష పెట్టాను’ అంది సింహం.
‘ఇది పరీక్షా?!’... మృగరాజు మాటతో అడవి జీవులన్నీ, సింహం వైపు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాయి. అది గమనించిన సింహం.., ‘ఆశ్చర్యం వద్దు. పదవికి పోటీ పడిన వారు పరీక్షలో గెలుపొందలేదు. కానీ పని మీదే తప్ప, పదవి మీద ఆశ లేని బాహుకుడు అనే ఏనుగు మాత్రం నెగ్గింది’ అని నవ్వుతూ చెప్పింది సింహం.
‘బాహుకుడు, మన సమావేశానికి రానప్పుడు, ఈ పరీక్షలో ఎలా నెగ్గింది. మృగరాజా?!’ అని నక్క, తోడేలుతో సహా అన్ని జీవులూ సింహాన్ని అడిగాయి. ‘తొందర పడకండి. బాహుకుడు సరిహద్దుల్లో మన రక్షణ కోసం కాపలాగా అడవి చుట్టూ తిరుగుతోందని, కాకి చూసి వచ్చి నాతో అంది. గతంలో చిరుత చేసే పనినే, ఇప్పుడు బాహుకుడు బాధ్యతగా చేస్తోంది అనిపించింది. అందుకే బాహుకుడిని తీసుకు రమ్మని కాకిని తిరిగి పంపించాను. అదిగో, కాకి, దాన్ని తీసుకు వస్తోంది. అటు చూడండి’ అని సింహం అంది.
వాటి వైపే వస్తున్న బాహుకుడిని మంత్రి కుందేలుతో సహా అన్ని జీవులూ ఒక్కసారిగా చూశాయి. ‘అడవి జీవుల సంరక్షణ అధికారిగా బాహుకుడిని నియమిస్తున్నాను’ అని మృగరాజు అనడంతో.. నక్క, తోడేలుతో సహా అడవి జీవులన్నీ బాహుకుడిని అభినందించాయి. ‘నా నవ్వుకు కారణం తెలిసిందా?’ మృగరాజు అన్ని జీవులను చూస్తూ అడిగింది. ‘తెలిసింది, మృగరాజా...నక్కతో సహా అన్ని జీవులూ నవ్వుతూ బదులిచ్చాయి.
కె.వి.లక్ష్మణరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని