తీర్పు తెచ్చిన మార్పు..!

అనగనగా ఒక అడవి. అందులో ఒక కుందేలు తన బుజ్జి కుందేలుతో నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఆ పిల్ల కుందేలు క్యారెట్‌ తింటూ కూర్చుంది. అది చూసిన తల్లి ‘ఈ క్యారెట్‌ నీకు ఎక్కడ దొరికింది

Updated : 03 Dec 2023 05:09 IST

అనగనగా ఒక అడవి. అందులో ఒక కుందేలు తన బుజ్జి కుందేలుతో నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఆ పిల్ల కుందేలు క్యారెట్‌ తింటూ కూర్చుంది. అది చూసిన తల్లి ‘ఈ క్యారెట్‌ నీకు ఎక్కడ దొరికింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు?’ అని ప్రశ్నించింది. ‘మన అడవి మధ్యలో ఉన్న ఎలుగుబంటి మామ తోటలో నుంచి తెచ్చుకున్నాను’ బదులిచ్చిందది. ‘నువ్వు ఇలా తెచ్చుకున్నట్లు దానికి తెలుసా’ అని అడిగింది తల్లి. అప్పుడు ‘ఓ తెలుసమ్మా..! ఎలుగు మామే తీసుకోమంది. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తోటకి వచ్చి క్యారెట్లు తీసుకొమ్మని కూడా చెప్పింది’ అంది పిల్ల కుందేలు. అయినా కాస్త సందేహంగా ఉన్న తల్లి కుందేలు.. ‘ఎలుగు అసలే పిసినారి. కానీ నిన్ను క్యారెట్లు తీసుకోమని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది’ అంది. ‘నేను చిన్నగా, బుజ్జిగా ఉంటాను కదమ్మా.. అందుకే నాతో అలా చెప్పి ఉంటుంది’ అని అంది ఆ పిల్ల. అలా అది ప్రతిసారి క్యారెట్లు తెచ్చుకొని తినసాగింది.

ఒకరోజు ఆ క్యారెట్‌ తోట దారిలోనే తల్లి కుందేలు వెళుతూ ఉంది. అక్కడ దానికి ఎలుగు కనిపించింది. అప్పుడది ఎలుగు ఎలా ఉన్నావు? అని పలకరిస్తూ ‘మీ తోటలో క్యారెట్లు చాలానే పండుతున్నట్లున్నాయి. అవి చాలా రుచిగా కూడా ఉన్నాయట. మా బుజ్జి కుందేలు చెప్పింది. రోజూ ఇక్కడ క్యారెట్లు తీసుకోవచ్చని దానికి నువ్వే చెప్పావట కదా. అందుకు నీకు ధన్యవాదాలు’ అంది. ‘అంటే ఇన్ని రోజులు నా తోటలో క్యారెట్లు దొంగతనం చేస్తోంది నీ బుజ్జి కుందేలన్నమాట. నేను కష్టపడి పెంచుకున్న పంటను అది తినేస్తుందా. ఉండండి మీ పని చెబుతాను’ అంటూ వెళ్లి మృగరాజుకు ఫిర్యాదు చేసింది ఎలుగు.

 తల్లి కుందేలు గాబరాగా ఇంటికి వెళ్లి, ‘బుజ్జీ.. ఇన్ని రోజులు నాకు ఎందుకు అబద్ధం చెప్పావు. ఎలుగుబంటి తోటలో ఎందుకు దొంగతనం చేశావు. నువ్వు చేసిన రెండు పనులూ తప్పే కదా. ఇప్పుడా ఎలుగు మన మీద ఫిర్యాదు చేయడానికి మృగరాజు వద్దకు వెళ్లింది’ అంది. ఆ బుజ్జి కుందేలు భయపడుతూ.. ‘అంటే అమ్మా.. నేను ఒకసారి ఎలుగు మామని ఒక క్యారెట్‌ ఇవ్వమని అడిగాను. కానీ ఇవ్వకుండా నన్ను కసురుకుంది. నాకేమో అవి తినాలనిపించింది. అందుకే చెప్పకుండా తీసుకున్నాను. నీకు చెబితే ఏమంటావోనని అబద్ధం చెప్పాను. ఇంకెప్పుడూ ఇలా చేయనమ్మా. దొంగతనం చేసినందుకు క్షమాపణలు కూడా చెబుతాను’ అని తెలిపింది. ‘నువ్వేం భయపడకు.. చేసిన తప్పును ఒప్పుకోవడం మంచి లక్షణం.. కానీ అలాంటి తప్పు మళ్లీ ఎప్పుడూ చేయకూడదు’ బిడ్డను ఊరడించింది తల్లి కుందేలు. ఇంతలోనే సమావేశానికి రమ్మని మృగరాజు కబురు పంపింది.

 ఇక అలా బుజ్జి కుందేలును తీసుకొని సమావేశానికి వెళ్లింది. అప్పటికే అక్కడికి అడవిలోని మిగతా జంతువులన్నీ చేరుకున్నాయి. మృగరాజు నీ ఫిర్యాదు ఏంటని ప్రశ్నించగా.. ఎలుగుబంటి ‘ఈ బుజ్జి కుందేలు నా తోటలో పండిన సగానికి పైగా క్యారెట్లను దొంగిలించింది. నాకు చాలా నష్టం జరిగింది. దానికి శిక్ష విధించి, నాకు నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను’ అని విన్నవించుకుంది.

అప్పుడు పిల్ల కుందేలు ‘మృగరాజా..! నేను క్యారెట్లు దొంగతనం చేయడం నిజమే కానీ, ఎలుగు మామ చెప్పినట్లు సగానికి పైగా తోటను మాత్రం ఖాళీ చేయలేదు. మూడుసార్లు రెండురెండు క్యారెట్లను మాత్రమే తీసుకున్నాను’ అంది. ఇంతలో అక్కడికి ఓ కాకి వచ్చి.. ‘మృగరాజా! తోటలో క్యారెట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఎలుగు దాని పిసినారితనంతో ఏ జీవిని లోనికి రానివ్వదు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం కుందేలు రెండుమూడుసార్లే తోటలోకి వెళ్లింది’ అని చెప్పింది. ‘కాకి చెప్పిందంతా నిజమేనా?’ ప్రశ్నించింది మృగరాజు. ఎలుగు కంగారుపడుతూ.. ‘అవును నిజమే. నేను అబద్ధం చెప్పాను. నన్ను క్షమించండి’ అంది. అప్పుడు మృగరాజు ‘చూడండి అబద్ధం చెప్పడం మంచి పద్ధతి కాదు. అది మీతో పాటు తల్లిదండ్రులకు కూడా చెడ్డ పేరు వచ్చేలా చేస్తుంది. బుజ్జీ నువ్వు ఇంకెప్పుడు దొంగతనం చేయనని, అబద్ధం చెప్పనని మాటివ్వాలి. ఒకవేళ మళ్లీ అలా చేస్తే.. కఠిమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఎలుగూ.. నువ్వు పిసినారితనాన్ని వదిలిపెట్టు. కొంతైనా ఇతరులకు సహాయం చేస్తుండు’ అంది. ‘మమ్మల్ని క్షమించండి మృగరాజా.. ఇక నుంచి మీరు చెప్పినట్లుగా ఉంటాం’ అన్నాయి రెండూ. సమావేశం నుంచి వెళుతూ.. ‘బుజ్జీ! రేపు ఉదయాన్నే తోటకు వచ్చేయ్‌.. నీకు క్యారెట్లు ఇస్తాను’ అని ఆనందంగా చెప్పింది ఎలుగు.
మొర్రి గోపి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని