నిజం.. నిజంగా నిప్పులాంటిది!

సుందరవనం అనే అడవిలో మృగరాజు సింహానికి గజం అనే ఏనుగు మంత్రిగా ఉండేది. అది చాలా మంచిది. సింహానికి చక్కని సలహాలు ఇస్తుండేది. జంతువుల బాధలను సింహానికి చెప్పి, వాటి కష్టాలను తొలగించేందుకు కృషి చేసేది.

Updated : 04 Dec 2023 05:27 IST

సుందరవనం అనే అడవిలో మృగరాజు సింహానికి గజం అనే ఏనుగు మంత్రిగా ఉండేది. అది చాలా మంచిది. సింహానికి చక్కని సలహాలు ఇస్తుండేది. జంతువుల బాధలను సింహానికి చెప్పి, వాటి కష్టాలను తొలగించేందుకు కృషి చేసేది. ఇలా ఉండగా ఒకరోజు ఓ బుజ్జి కుందేలు అడవి అందాలను చూస్తూ వెళుతోంది. ఇంతలో దానికి వెనుక నుంచి ఏనుగు పరిగెత్తుకుంటూ రావడం కనిపించింది. దాన్ని చూసి ఆ బుజ్జి కుందేలు భయపడి వేగంగా పరిగెత్తే ప్రయత్నం చేసింది. కానీ ఆ ఏనుగు దాన్ని సమీపించింది. కాస్త కూడా దయ లేకుండా, ఆ బుజ్జి కుందేలును తన తొండంతో పైకి లేపి అక్కడే పక్కన ఉన్న ఒక గోతిలో పడేసింది. తర్వాత ముందుకు వెళ్లిపోయింది.

ఆ గొయ్యి చాలా లోతుగా ఉంది. ఏనుగు, ఆ బుజ్జి కుందేలును గోతిలోకి పడేయడం వెనుక నుంచి వస్తున్న జింక, ఎలుగుబంటి ప్రత్యక్షంగా చూశాయి. అవి వెంటనే పరిగెత్తుతూ వెళ్లి దాని తల్లి కుందేలుకు సంగతిని చెప్పాయి.

ఆ కుందేలు ఏడుస్తూ వచ్చి.. ఎలుగుబంటి, జింక సాయంతో అతి కష్టం మీద తన బిడ్డను ఆ గోతి నుంచి తీసి కాపాడింది. తర్వాత అది జింక, ఎలుగుబంటితో పాటు వెళ్లి సింహానికి గజమే ఇదంతా చేసిందని ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ఏనుగు అక్కడ లేదు. అది విని సింహం తన వద్ద ఉన్న గజం చాలా మంచిదని కితాబును ఇచ్చింది. అప్పుడు కుందేలు.. ‘మృగరాజా! కొన్ని పైకి మంచిగా నటిస్తాయి. తీయటి మాటలు చెబుతాయి. అలాంటి వాటి మాయాజాలంలో మీరు పడవద్దు. అటువంటి వాటిని మీరు నమ్మరాదు. నా బిడ్డను మీ గజం ఆ గోతిలో తోసినప్పుడు ఈ ఎలుగుబంటి, జింక వాటి కళ్లతో ప్రత్యక్షంగా చూశాయి. కావాలంటే వాటినే అడగండి’ అని అంది.

అప్పుడు సింహం వాటిని... ‘మీరు చూసింది నిజమేనా?’ అని ప్రశ్నించింది. అవి నిజమేననీ, కుందేలు పిల్లను గజం ఆ గోతిలో పడవేయడం తాము కళ్లారా చూశామని చెప్పాయి. అక్కడే ఉన్న మిగతా జంతువులు ఆ గజం అలాంటిది కాదని, అది ఎంతో మందిని కాపాడిందని అన్నాయి. కానీ ఎలుగుబంటి, జింక మాత్రం ఆ కుందేలును మీ గజమే పడేసిందని, ఈ అడవిలో ఎన్ని ఏనుగులున్నా తాము దాన్ని గుర్తు పడతామని చెప్పాయి.

అప్పుడు ఆ సింహం, గజాన్ని పిలిపించింది. అది రాగానే సింహం దానికి విషయం చెప్పి, దాన్ని దీని గురించి ప్రశ్నించింది. అప్పుడు గజం.. ‘అయ్యో... మృగరాజా! నేను ఆ పని చేయలేదు. నా సంగతి మీకు తెలుసు కదా! నేను ఎవరికీ హాని చేసేదాన్ని కాను. అటువంటి నాపై ఎందుకు నిందలు వేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. సరే..! ఏం చేస్తాం. నాకు రోజులు బాగా లేవు. నిజం నిప్పులాంటిది. ఎప్పటికైనా మీకు అసలు విషయం తెలుస్తుంది’ అని అంది.

ఇంతలో ఒక కోతి పరుగున వచ్చి.. ‘మృగరాజా..! నా బిడ్డను మన గజం గోతిలో పడేసింది. నా బిడ్డను వెంటనే కాపాడి మీకు ఫిర్యాదు చేద్దామని ఇక్కడికి వచ్చాను’ అని అంది. తర్వాత అది అక్కడ ఉన్న గజాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ‘అరే! గజం ఇక్కడికి ఎలా వచ్చింది? ఈ ఏనుగే నా బిడ్డను కొద్దిసేపటి క్రితం గోతిలో పడేసింది! అది నా కన్నా ముందు ఎలా వచ్చింది?’ అని ఆశ్చర్యపోతూ అంది.

అప్పుడు గజం.. ‘చూశారా మృగరాజా! నేను రెండు గంటల నుంచి మీ ముందే ఉన్నాను. ఇప్పుడేమంటారు?’ అంది. అప్పుడు సింహం ఆశ్చర్యపోయి, వెంటనే పెద్దపులి, చిరుతపులిని పిలిపించింది. కుందేలు పిల్లను, కోతి బిడ్డను గోతిలో తోసిన ఆ ఏనుగును పట్టి తెమ్మని ఆదేశించింది. కాసేపటికి ఏనుగును తీసుకొచ్చి మృగరాజు ముందు నిలబెట్టాయి. విచిత్రంగా.. ఆ ఏనుగు రూపురేఖల్లో అచ్చం మంత్రి గజాన్ని పోలి ఉంది. అది పక్క అడవి నుంచి వచ్చిన ఏనుగు. అది ఈ అడవిలోని జంతువుల ఐకమత్యాన్ని చూసి ఓర్వలేక ఇక్కడి జంతువులను గోతిలో పడేస్తోంది. ఈ విషయమంతా ఒక కొండముచ్చు తెలిపింది. ‘ఆ ఏనుగును బంధించి, దానికి తిండి పెట్టకుండా హింసించండి’ అని మృగరాజు ఆదేశించింది. ఆ ఏనుగు భయంతో ఏడుస్తూ, తన తప్పును ఒప్పుకొంది. తనను మన్నించమని సింహాన్ని వేడుకొంది.

‘మృగరాజా! దాని శిక్షను రద్దు చేయండి. దాన్ని తన అడవికి పంపిస్తే చాలు. మీకున్న మంచి పేరును అది ఆ అడవిలో అన్నింటికీ చెబుతుంది. దయచేసి నా మాటను వినండి. మన ఐకమత్యాన్ని చూసి ఓర్వలేకే అది ఈ పని చేసిందని అదే తెలిపింది.

దాని మాటలను విన్న సింహం సంతోషించి.. ‘ఓ గజమా! నీవు చాలా మంచిదానివి. అందుకే నేను ఆ జింక, ఎలుగుబంటి చెప్పినా నమ్మలేదు. తొందరపడలేదు. ఇప్పుడు నీవు చెప్పినట్లే చేస్తాను’ అని అంది. కుందేలు, కోతి ఆ ఏనుగుపై అనవసర ఫిర్యాదు చేసినందుకు తమను మన్నించమన్నాయి. తాము కూడా పొరబడినందుకు జింక, ఎలుగుబంటి కూడా ఆ గజాన్ని మన్నించమని వేడుకున్నాయి.

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని