అనగనగా ఓ రాజు... ముగ్గురు కవులు!

పూర్వం చంద్రగిరిని పాలించే సుధన్వుడు గొప్ప సాహిత్యాభిమాని. ఆయన ఆస్థానంలో ముగ్గురు కవులుండేవారు. తరచూ వారు ఒక కొత్త కావ్యాన్ని రాసి, రాజుకు సభలో శ్రావ్యంగా గానం చేసి వినిపిస్తూ ఉండేవారు.

Updated : 05 Dec 2023 05:09 IST

పూర్వం చంద్రగిరిని పాలించే సుధన్వుడు గొప్ప సాహిత్యాభిమాని. ఆయన ఆస్థానంలో ముగ్గురు కవులుండేవారు. తరచూ వారు ఒక కొత్త కావ్యాన్ని రాసి, రాజుకు సభలో శ్రావ్యంగా గానం చేసి వినిపిస్తూ ఉండేవారు. రాజుతో గొప్పగా సన్మానాలు పొందుతుండేవారు. వారు ముగ్గురూ మంచి స్నేహితులవడంతో.. సభలో ఒకరినొకరు విమర్శించుకునేవారు కాదు. అక్కడి నుంచి బయటికి వచ్చాక మాత్రం ఒకరి లోపాలను మరొకరు చర్చించుకుని, సరిదిద్దుకునేవారు.

రాజుగారికిది తెలియదు. మంచి విమర్శకుడు ఒకరు సభలో ఉంటే బావుంటుందని, కావ్యంలోని మంచి చెడ్డల గురించి చర్చ జరిగితే ఇంకా మంచి సాహిత్యం రావడానికి వీలుంటుందని భావిస్తూ ఉండేవాడు. ఒకరోజు దుర్మతి అనే వ్యక్తి సభకు వచ్చి, తనకు తానుగా గొప్ప సాహితీ విమర్శకుడిగా పరిచయం చేసుకున్నాడు. రాజు ఆనందించి, అతనికి  కోటలో ఉద్యోగం ఇచ్చాడు.

ఇక దుర్మతి చెలరేగిపోయేవాడు. చిన్నా, పెద్దా లేకుండా ముగ్గురు కవుల సాహిత్యాన్ని ఎడాపెడా విమర్శించడం ప్రారంభించాడు. మంత్రి అది గమనించి.. ‘సాహిత్యాన్ని విమర్శించాలంటే కొన్ని నియమాలుంటాయి. వాటిని మీరు పట్టించుకుంటున్నట్లు కనిపించడంలేదు. విమర్శ అంటే తప్పులు, ఒప్పులను చర్చించడం. అంతేగానీ తప్పులను మాత్రమే భూతద్దంలో చూపడం కాదు’ అని సలహా ఇచ్చాడు.

అహంకారంతో ఉన్న దుర్మతి దాన్ని పెడ చెవిన పెట్టాడు. బురద మీద రాయి వేస్తే పైన పడుతుందని ముగ్గురు కవులూ మౌనం వహించారు. కాలం గడిచే కొద్దీ రాజుకు దుర్మతి చేసే విమర్శల మీద చిర్రెత్తుకు వచ్చింది. ‘మీరు ఇంతలా విమర్శించే కంటే.. ఉత్తమకావ్యం అంటే ఎలా ఉండాలో ఉదాహరణగా చూపిస్తూ, ఒక మంచి కావ్యాన్ని రాయొచ్చు కదా! అది చదివి దాన్ని ఆదర్శంగా తీసుకుని మంచి కావ్యాలను రాయడానికి ప్రయత్నిస్తారు. వీలైనంత త్వరగా ఆ పని పూర్తి చేయండి’ అని ఆజ్ఞాపించాడు.

విమర్శకుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. అతడు నీళ్లు నమలడం మంత్రి గమనించాడు. మరుసటి రోజే ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే దుర్మతి ఎటో వెళ్లిపోయాడు. ఎంత విచారించినా ఆచూకీ లేదు. మంత్రిని అతని సంగతేమిటని అడిగాడు రాజు. ‘ప్రభూ! ఏ పనైనా చేయడం కష్టం. తప్పులు పట్టడం తేలిక. ఇది అందరూ ఎరిగిన జీవిత సత్యం. తప్పులు ఎత్తి చూపడమంత తేలికైతే కాదు, కావ్యం రాయడం. అదీగాక విమర్శకుడికి తప్పు ఒప్పులను చెప్పగలిగే పద్ధతి తెలిసి ఉండాలి. అసూయాద్వేషాలతో చేసే విమర్శ సరైనదికాదు. నేను పొరుగు రాజ్యంలో దుర్మతి గురించి వేగుల ద్వారా వాకబు చేశాను. అక్కడ అతను చిన్న ఉద్యోగి. కవులు, పండితులు రాజుగారితో గొప్పగా సన్మానాలు పొందుతుండటం చూసి, అతనిలో దురాశ కలిగించింది. పాత తాళపత్రగ్రంథం ఒకదాన్ని ఎలాగో సంపాదించి, దానికి ముందు వెనుక ఉన్న తాళపత్రాలను తీసివేశాడు. తన వివరాలున్న కొత్త తాళపత్రాలను జతచేసి రాజుగారికి తన రచనగా చూపించి సన్మానం పొందాడు. సభలోని ఒక పండితుడు ఈ విషయాన్ని పసిగట్టి రాజుగారి చెవిన వేయడంతో మండిపడ్డాడాయన. ఆ విధంగా నిండు సభలో దుర్మతికి అవమానం జరిగింది. అక్కడ పరువు పోగొట్టుకున్న అతడు ఆ రాజ్యాన్ని వదిలి మనరాజ్యానికి వచ్చి కొత్తగా విమర్శకుడి అవతారం ఎత్తాడు. కవులు, పండితుల మీద ఉన్న అసూయాద్వేషాలతో పద్ధతి లేకుండా విమర్శలు చేశాడు. సాహిత్యం అంటేనే సరిగా తెలియని అతణ్ని మీరు ఉత్తమకావ్యం ఒకటి రాయమనేసరికి తన బండారం బయట పడుతుందని జాడ లేకుండా పోయాడు’ అన్నాడు.

ఇక మీదట దుర్మతిలాంటి చెడ్డ విమర్శకులకు తావివ్వకూడదని, మంచి విమర్శకులకు మాత్రమే చోటు ఇవ్వాలని రాజు గట్టిగా నిర్ణయించుకున్నాడు. తరువాత కాలంలో ముగ్గురు కవులు కూడా రాజుగారి సమక్షంలోనే తమ కావ్యాల్లోని తప్పులను, ఒప్పులను మంచి మనసుతో చర్చించుకుంటూ.. తమ రచనల్లోని లోపాలను దిద్దుకుంటూ, తమకుతామే మంచి విమర్శకులు అన్న పేరు పొందారు. మంచి మంచి కావ్యాలను రచించి రాజు మెప్పును పొందారు.        

డా.గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని