చిట్టిలో మార్పు వచ్చిందోచ్‌!

ఆటల పీరియడ్‌ కావడంతో రెండో తరగతి విద్యార్థులంతా మైదానంలో ఆడుకుంటున్నారు.

Published : 06 Dec 2023 00:04 IST

ఆటల పీరియడ్‌ కావడంతో రెండో తరగతి విద్యార్థులంతా మైదానంలో ఆడుకుంటున్నారు. ఎంచక్కా పిల్లలంతా ఆడుకోవడానికి అక్కడ జారుడు బల్ల, ఉయ్యాల.. ఇలా రకరకాల ఆట వస్తువులు ఉన్నాయి. పిల్లలు ఒకరి తరువాత మరొకరికి అవకాశం వచ్చేలా చూసుకుంటూ, అందరూ అన్నీ ఆడుకుంటున్నారు. అక్కడున్న పిల్లలందరిలో చిట్టి మాత్రం చాలా పెంకి పిల్ల. తను ఏ ఆట ఆడినా సరే ఇచ్చిన సమయం కంటే ఇంకా ఎక్కువగా ఉపయోగించుకునేది. ఇక్కడి నుంచి నేను లేవనంటే లేవనంటూ మొండిగా ప్రవర్తించేది. చిట్టికి ఉయ్యాల అంటే చాలా ఇష్టం.. ఎంతసేపైనా అక్కడి నుంచి లేవడంలేదు. అప్పుడే పింకీ వచ్చి ‘చిట్టీ! నువ్వు ఇక్కడి నుంచి తప్పుకోవాలి. ఇప్పుడు నా వంతు’ అంది. ‘నేను లేవను. నువ్వు జారుడు బల్ల దగ్గరకు వెళ్లి ఆడుకో’ గట్టిగా చెప్పింది చిట్టి. ‘నేను అది ఇందాకే ఆడేశాను. ఇప్పుడు నువ్వే అక్కడికి వెళ్లాల్సింది’ అని బదులిచ్చింది పింకీ. ‘నేను ఉయ్యాలను వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్లను గాక వెళ్లను’ అంది చిట్టి. ఎంతకీ తను చెప్పింది వినకపోవడంతో అక్కడున్న పిల్లలంతా కలిసి ‘చిట్టి గొడవ చేస్తుందని టీచర్‌కి చెబుదామా?’ అనుకున్నారు.

అప్పుడు పింకీ ‘వద్దులెండి.. మనం ఉయ్యాలను చిట్టికి వదిలేసి వేరే ఆట ఆడుకుందాం’ అంది. తను చాలా మంచి అమ్మాయి. అందరితో కలిసిమెలిసి ఉంటుంది. కాసేపటి తర్వాత చిట్టితో సహా అందరినీ పిలిచి గుండ్రంగా కూర్చోబెట్టి ‘ఫ్రెండ్స్‌.. మనం ఇప్పుడు ఒక కొత్త ఆట ఆడుకుందాం. ఒకొక్కరు ఒక్కో జంతువు పేరు చెప్పాలి. అది ఎలా అరుస్తుందో అలా అరవాలి. అలా చేయలేకపోతే మీ మార్కు పోతుంది. చెప్తే ఒక మార్కు వస్తుంది’ అని ఉత్సాహంగా చెప్పింది పింకీ. ‘ఈ ఆట భలేగా ఉంది’ అంటూ పిల్లలందరూ సరదాగా ఆట మొదలుపెట్టారు. కానీ చిట్టీ మాత్రం అక్కడికి వెళ్లకుండా.. ‘హమ్మయ్యా! ఉయ్యాల నాకు వదిలేసి వెళ్లిపోయారు. ఎంచక్కా నేను ఒక్కదాన్నే ఆడుకోవచ్చు’ అని సంబరపడింది.

పిల్లలంతా ఒకచోట ఆడుకుంటుంటే, చిట్టి ఒక్కతే ఉయ్యాల ఊగుతోంది. అది వంకరగా ఉండటం గమనించిన పింకీ.. జాగ్రత్తగా ఆడుకో, లేదంటే కింద పడిపోతావు’ అని చిట్టిని హెచ్చరించింది. అయినా తను మాత్రం అస్సలు వినలేదు. నాకు ఎవరూ చెప్పక్కర్లేదు. ఉయ్యాల ఎలా ఊగాలో నాకు బాగా తెలుసు’ అని దురుసుగా సమాధానమిచ్చింది. వేగంగా ఊగడం వల్ల ఉయ్యాల ఒక్కసారిగా పైకి లేచింది. ఇక భయంతో కేకలు వేయడం మొదలుపట్టింది చిట్టి. అది చూసిన పిల్లలంతా ఉయ్యాల దగ్గరకు వెళ్లి కింద పడబోతున్న చిట్టిని పట్టుకున్నారు. ‘నువ్వేం భయపడకు చిట్టీ! నీకు మేమందరం ఉన్నాం’ అని ధైర్యం చెప్పారు. కాసేపటి తరువాత చిట్టి భయం నుంచి కోలుకుంది. స్నేహితులంతా కలిసి తనను కాపాడటం చిట్టికి ఆశ్చర్యంగా అనిపించింది. తను అహంకారంతో, అమర్యాదగా ప్రవర్తించినా, అదేది పట్టించుకోకుండా వారు చూపిన స్నేహం ఆమెను కదిలించింది. ‘పింకీ.. మీరంతా చాలా మంచివాళ్లు. నేను మీతో దురుసుగా ప్రవర్తించాను, అయినా నన్ను రక్షించారు. ఇక నుంచి నేను కూడా మీ అందరితో స్నేహంగా ఉంటాను’ వినయంగా అంది చిట్టి. ‘నువ్వు కూడా మంచిదానివే చిట్టీ.. అందుకే నీ తప్పేంటో తెలుసుకొని మారిపోయావు’ నవ్వుతూ బదులిచ్చింది పింకీ. ఇక అప్పటి నుంచి చిట్టి కూడా అందరితో కలిసి ఎంచక్కా ఆడుకోసాగింది.

 కె.వి.సుమలత


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని