తప్పిన ముప్పు.. తెలుసుకున్న తప్పు!

అనగనగా ఓ అడవి. దానికి సింహం రాజు. అది చాలా కోపిష్టిది. చిన్న చిన్న తప్పులకు కూడా జంతువులకు పెద్ద శిక్షలు విధిస్తుండేది. ఓ సారి దాని పుట్టినరోజు సందర్భంగా, జంతువులన్నీ వచ్చి శుభాకాంక్షలు తెలిపాయి. తర్వాత విందులు, వినోదాలు మొదలయ్యాయి. చిలుకలు తమ ముద్దుముద్దు మాటలతో రాజును కీర్తించాయి. నెమలి నాట్యంతో అన్నింటినీ మెప్పించింది. కోతులు కుప్పిగంతులతో సందడి చేశాయి.

Published : 07 Dec 2023 00:31 IST

నగనగా ఓ అడవి. దానికి సింహం రాజు. అది చాలా కోపిష్టిది. చిన్న చిన్న తప్పులకు కూడా జంతువులకు పెద్ద శిక్షలు విధిస్తుండేది. ఓ సారి దాని పుట్టినరోజు సందర్భంగా, జంతువులన్నీ వచ్చి శుభాకాంక్షలు తెలిపాయి. తర్వాత విందులు, వినోదాలు మొదలయ్యాయి. చిలుకలు తమ ముద్దుముద్దు మాటలతో రాజును కీర్తించాయి. నెమలి నాట్యంతో అన్నింటినీ మెప్పించింది. కోతులు కుప్పిగంతులతో సందడి చేశాయి.

మృగరాజు చక్కని గానం వినాలనుకుంది. ఆ విషయాన్నే మంత్రి నక్కకు తెలియజేసింది. అది వెంటనే కోయిలను పిలిచి.. ‘నీ గానంతో రాజును మురిపించాలి’ అని చెప్పింది. అలాగేనంటూ ముందుకు వచ్చిన కోయిలను చూడగానే సింహం ముఖం చిట్లించింది.

‘ఛీ.. ఛీ.. ఇంత నల్లగా ఉన్న ఈ పక్షిని చూస్తే నాకసహ్యం కలుగుతోంది. ముందు దీన్ని ఇక్కడ నుంచి వెళ్లిపొమ్మనండి’ అంది మృగరాజు. దాంతో కోయిల చిన్నబోయింది. ‘రాజా, దాని రంగు నల్లగా ఉన్నా.. గాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి వింటే, మళ్లీ మళ్లీ అది పాడే పాట వినాలనుకుంటారు’ అని నక్క చెప్పి ఒప్పించింది.

చివరికి అయిష్టంగా.. ‘సరే’ అంది సింహం. కోయిల తన గాత్రంతో రాజును ఆహ్లాదపర్చింది. చక్కని గాత్రంతో కోయిల పాటలు పాడినప్పటికీ, ఎందుకో దాని శరీర ఛాయ సింహానికి రోత కలిగించింది. వేడుక ముగిశాక.. ఇంకెప్పుడూ అది తన కళ్లకు కనపడకూడదని, తన ముందు పాడకూడదని ఆదేశించింది సింహం.

ఆ మరుసటిరోజు ఉదయం, కోయిల చెట్టు కొమ్మల్లో కూర్చొని.. ‘కూ.. కూ’ అని రాగాలు తీయడం మొదలు పెట్టింది. ఆ రాగాలకు అక్కడికి దగ్గర్లో గుహలో నిద్రిస్తున్న మృగరాజుకు నిద్రా భంగమైంది. అంతే, పట్టరాని ఆగ్రహంతో కోయిలను బంధించి దానికి మరణ శిక్ష విధించాల్సిందిగా నక్కను ఆదేశించిందది. దాంతో గజగజా వణికి పోయింది కోయిల. ‘రాజా, ఇంత చిన్న పొరపాటుకు, అంత పెద్ద శిక్షా? పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా? మీ వంటి వాళ్లకు ఇది మంచిది కాదు. మీకు నిద్రాభంగం కలిగింది వాస్తవం, అందుకు దానికి శిక్ష పడాల్సిందే! అది మీ శిక్షగా నేను అమలు చేస్తాను’ అని నక్క, సింహాన్ని చూస్తూ అంది.

‘ఏయ్‌ కోయిలా.. నీ కూతలతో మరోసారి మన రాజుకు నిద్రాభంగం కలిగించావంటే.. నీకు మరణ దండన తప్పదు. ఇది మొదటి తప్పుగా భావించి, మృగరాజు నిన్ను క్షమించి వదిలేస్తోంది జాగ్రత్త’ అని హెచ్చరించింది నక్క. దాంతో బతుకు జీవుడా అనుకుంటూ కోయిల తన గూటికి చేరిపోయింది. ఆ రోజు రాత్రి ఆ అడవిలో జోరున వర్షం కురిసింది. తెల్లవారాక, ఆ చల్లని వాతావరణం చూసి, కోయిల ఇక తనను తాను ఆపుకోలేక.. మళ్లీ ‘కూ.. కూ..’ అంటూ రాగాలు తీసింది. దాంతో గుర్రుపెట్టి నిద్ర పోతున్న సింహానికి నిద్రాభంగమై ఆగ్రహంతో గుహ బయటకు వచ్చింది.

అప్పుడు కోయిలను చూసి... ‘ఈ రోజుతో నీకు మూడింది. నువ్వు నా ఆజ్ఞనే ధిక్కరించావు. మంత్రీ, ఈ నల్లని పక్షిని బంధించి, వధించు’ అంది సింహం. ఇంతలోనే ఒక్కసారిగా పే..ద్ద శబ్దం వచ్చింది. సింహం, నక్క, కోకిల ఆందోళనగా అటువైపు చూశాయి.

రాత్రి కుండపోత వర్షానికి గుహ పక్కనే ఉన్న ఒక పెద్ద వృక్షం సింహం నిద్రించిన గుహపై కూలిపోయింది. గుహ మొత్తం దెబ్బతింది. అప్పుడే నక్కకు కోయిలను రక్షించడానికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది.

‘చూశారా రాజా! కోయిల తన రంగు రీత్యా నల్లనిది కావొచ్చు. కానీ దాని గొంతు ఎంతో చక్కనిది. మనం ఎప్పుడూ ఏ ప్రాణినీ తక్కువగా చూడకూడదు. ప్రతి జీవికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. అది మీ ఆజ్ఞను మరిచి, తన జాతి సహజ సిద్ధమైన కూ.. కూ.. రాగాలు ఆలపించి ఉండకపోతే, మీరింకా ఆ నిద్రలోనే ఉండేవారు. అప్పుడు మీ ప్రాణాలకే నష్టం జరిగేది’ అంది నక్క.
ముప్పు తప్పిన సింహం తన తప్పు తెలుసుకుంది. తనకు రోత కలిగించిన కోయిలే ఈరోజు ప్రాణదాతైందని గ్రహించింది. ఆ తర్వాత అది ఏ జంతువు, పక్షినీ తక్కువగా చూడలేదు. చిన్నచిన్న తప్పులకే జంతువులకు కఠిన శిక్షలు విధించలేదు. రాజులో వచ్చిన మార్పునకు జంతువులన్నీ సంతోషించాయి. కోయిలకు ధన్యవాదాలు తెలిపాయి.  

నమ్మి సత్యవతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని