ఇంతకీ ఇది ఏ పక్షి గుడ్డు?!

వేదాయపాలెం గ్రామంలో గోపన్న అనే ఒక బాలుడు ఉన్నాడు. అతను చాలా మంచివాడు, అమాయకుడు కూడా. పెద్దవాళ్లతో గౌరవంగా ఉండేవాడు. ఎవరు ఏ పని చెప్పినా చేసి పెట్టేవాడు. అందుకే ఆ ఊర్లో వాళ్లందరికీ గోపన్న అంటే చాలా ఇష్టం. ఆ అబ్బాయి ఒకరోజు పొలానికి వెళ్లి తిరిగొస్తుండగా దారిలో ఓ గుడ్డు కనిపించింది.  

Updated : 08 Dec 2023 05:37 IST

వేదాయపాలెం గ్రామంలో గోపన్న అనే ఒక బాలుడు ఉన్నాడు. అతను చాలా మంచివాడు, అమాయకుడు కూడా. పెద్దవాళ్లతో గౌరవంగా ఉండేవాడు. ఎవరు ఏ పని చెప్పినా చేసి పెట్టేవాడు. అందుకే ఆ ఊర్లో వాళ్లందరికీ గోపన్న అంటే చాలా ఇష్టం. ఆ అబ్బాయి ఒకరోజు పొలానికి వెళ్లి తిరిగొస్తుండగా దారిలో ఓ గుడ్డు కనిపించింది. దాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని.. ‘ఇదేంటి? కోడి గుడ్డు కంటే చిన్నగా భలేగా ఉంది’ అనుకున్నాడు. కాసేపు అలానే ఆలోచించి నెమ్మదిగా నడవసాగాడు. వెళ్తూవెళ్తూ ఉండగా అతనికి దారిలో ఆ ఊర్లోనే ఉండే రైతు సోమన్న ఎదురుపడ్డాడు. అతన్ని ఆపి ‘సోమన్నా.. నాకు పొలం నుంచి వస్తుండగా.. ఇదిగో ఈ గుడ్డు దొరికింది. దీన్ని అసలు ఏం చేయాలి’ అని అడిగాడా అబ్బాయి. ‘ఇలా దొరికిన వస్తువులను వెంటనే ఉపయోగించుకోవాలి. ఇంటికి తీసుకెళ్లి కూర చేసుకొని తినేసేయ్‌’ అని వెటకారంగా జవాబిచ్చాడు సోమన్న. అలాగా.. అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు గోపన్న.

ఇంకాస్త ముందుకు వచ్చాక అతనికి కిరాణా కొట్టు రత్నాకరం కనిపించాడు. ఆయనకు కూడా జరిగిన విషయాన్ని వివరించి ఏం చేయమంటారని అడిగాడు గోపన్న. అతను గుడ్డు వంక చూస్తూ.. ‘ఇది కోడిగుడ్డులా అనిపిస్తోంది. తీసుకెళ్లి పొదిగించావంటే.. కొన్నాళ్లకు ఓ కోడిపిల్ల అవుతుంది. అది పెద్దయ్యాక మళ్లీ గుడ్లు పెడుతుంది. వాటి నుంచీ పిల్లలు వస్తాయి. అప్పుడు బోలెడు కోళ్లు అవుతాయి. మంచిగా కోళ్ల వ్యాపారం చేసుకోవచ్చు’ అని సలహా ఇచ్చాడు రత్నాకరం. ‘ఏంటి ఇంత చిన్న గుడ్డులో అంతుందా?’ అని ఆశ్చర్యంగా అడిగాడు గోపన్న. మరి గుడ్డు అంటే మాటలా అనుకుంటూ.. ముందుకు సాగాడు రత్నాకరం.

అలా నడుచుకుంటూ ఊరిలోకి రాగానే ఆ గ్రామ పాఠశాలలో చదువు చెప్పే మాస్టారు ఎదురయ్యారు. ‘మాస్టారూ.. నాకు దారిలో ఇది దొరికింది. ఎవరిని అడిగినా దీన్ని ఏం చేయాలో సరిగ్గా చెప్పడం లేదు. మీరైనా చెప్పండి, అసలు ఏం చేయాలో’ అని గుడ్డును చూపిస్తూ అడిగాడు గోపన్న. ‘దీన్ని చూస్తుంటే ఏదో పక్షి గుడ్డులా ఉంది. పాపం ఈ గుడ్డు పోగొట్టుకున్న పక్షి ఎంత బాధపడుతుందో. నాకు తెలిసి నీకు ఇది దొరికిన చోటే ఏ చెట్టు మీదో ఆ పక్షి గూడు ఉండి ఉంటుంది. వీలైనంత తొందరగా వెళ్లి ఈ గుడ్డును ఆ గూటికి చేర్చు’ అని చెప్పారా మాస్టారు. ఆయన చెప్పింది నిజమే.. ఆ పక్షి ఎంత కంగారు పడుతుందో అని మనసులోనే అనుకుంటూ.. తనకు గుడ్డు దొరికిన చోటుకు వెళ్లాడు గోపన్న. అక్కడున్న చెట్లన్నీ గమనించగా.. నేరేడు చెట్టు మీద ఒక కాకి గూడు కనిపించింది. అయితే ఇది కాకి గుడ్డు అయి ఉంటుంది.. అనుకుంటూ జాగ్రత్తగా చెట్టెక్కి చూశాడతను. ఆ గూటిలో తన దగ్గరున్న లాంటివే మరో రెండు గుడ్లు ఉన్నాయి. నెమ్మదిగా దాన్ని ఆ గూట్లో పెట్టాడు గోపన్న. అప్పుడే వస్తున్న కాకి ఇదంతా చూసింది. గోపన్న చెట్టు దిగాక గూటి దగ్గరికి వెళ్లి చూసింది. పోయిందనుకున్న గుడ్డు తిరిగి గూటికి చేరడంతో కావ్‌.. కావ్‌.. అంటూ ఆనందంగా అరిచిందది.

ఎలాగైనా అతనికి కృతజ్ఞతలు తెలపాలనుకుంది. కాకి వెంటనే ఎగురుకుంటూ వెళ్లి.. తనకు ఎప్పుడో దొరికిన ఓ బంగారు నాణేన్ని గోపన్న ముందు వేసి, అతనివైపు కృతజ్ఞతగా చూసింది. అది తీసుకొని వెళ్లి మాస్టారుకు చూపించాడతను. ‘నోరులేని పక్షి కూడా సాయం చేసిన వారికి ఉపకారం చేయాలనుకుంది. మనం కూడా సాయం చేసిన వారికి ఎప్పుడూ విధేయులుగా ఉండాలి’ అని చెప్పారు మాస్టారు. ఇక ఆనందంగా ఇంటికి వెళ్లాడు గోపన్న.

 కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని