మిత్రుని సలహా...!

కవిటి గ్రామంలో నివసించే కామయ్య, వీరయ్య మంచి మిత్రులు. వీరి పొలాలు కూడా పక్కపక్కనే ఉండటంతో కలిసే వ్యవసాయం చేసేవారు. కానీ, గత రెండేళ్లుగా సకాలంలో వర్షాలు కురవడం లేదు

Updated : 09 Dec 2023 05:09 IST

కవిటి గ్రామంలో నివసించే కామయ్య, వీరయ్య మంచి మిత్రులు. వీరి పొలాలు కూడా పక్కపక్కనే ఉండటంతో కలిసే వ్యవసాయం చేసేవారు. కానీ, గత రెండేళ్లుగా సకాలంలో వర్షాలు కురవడం లేదు. దాంతో సరైన దిగుబడి లేక.. ఇద్దరూ అప్పుల పాలయ్యారు. ఒకరోజు పొలం గట్టున కూర్చొని కుటుంబాన్ని పోషించడానికి ఏం చెయ్యాలా?అని ఆలోచించసాగారు. అదే దారి గుండా పక్క ఊరు నుంచి వచ్చి సరకులు అమ్మే ఓ వ్యాపారి వెళ్తూ ఉన్నాడు. అతన్ని చూడగానే వీరయ్యకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే కామయ్యతో ‘మిత్రమా! ఇప్పుడు మన పరిస్థితి అస్సలు బాగోలేదు. అప్పు చేసి పెట్టుబడి పెట్టినా, ఫలితం లేకుండా పోయింది. అందుకే నేనో నిర్ణయానికి వచ్చాను. మనిద్దరం కలిసి పట్టణంలో నిత్యావసర వస్తువులు తెచ్చి మన గ్రామంలో అమ్ముదాం. అప్పుడు మన కుటుంబ పోషణ సజావుగా సాగుతుంది’ అన్నాడు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, వ్యవసాయం కోసం చేసిన అప్పే తీర్చలేకపోతున్నాం. మరి వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలి కదా?’ సందేహం వెలిబుచ్చాడు కామయ్య. ‘మన పంట పొలాల్లో కొంత భాగాన్ని అమ్మేద్దాం. అప్పులు తీరగా మిగిలిన మొత్తంతో వ్యాపారం ప్రారంభిద్దాం’ అని బదులిచ్చాడు వీరయ్య.

ఆ తర్వాత ఇద్దరు మిత్రులు అనుకున్నట్లుగానే కొంత భూమిని అమ్మి, గ్రామంలో వీధి వీధీ తిరిగి సరకులు అమ్మడం మొదలుపెట్టారు. వ్యాపారం బాగానే సాగుతూ.. లాభాల బాట పట్టింది. వీరయ్య, కామయ్య వారి కుటుంబాలతో ఆనందంగా ఉన్నారు. ఒకరోజు కామయ్య ‘ఇక గ్రామంలో దుకాణం తెరిచి అందులోనే సరకులు అమ్ముదాం. రోజూ వీధులు తిరగడం చాలా కష్టంగా ఉంది’ అని వీరయ్యతో అన్నాడు. ‘ఇంకా మన వ్యాపారం మొగ్గ దశలోనే ఉంది. మరింత కష్టపడి ముందుకు నడిపిస్తే మనకు సరైన పెట్టుబడి లభిస్తుంది. అప్పుడు దుకాణం పెట్టుకుని చక్కగా నడుపుకోవచ్చు. ఇప్పుడే అంత తొందరపాటు వద్దు’ అని చెప్పాడతను. కానీ కామయ్య నేను వీధి వీధీ తిరిగి వ్యాపారం చేయలేను. నా మిగిలిన పొలం అమ్మేసి గ్రామంలోనే దుకాణం పెట్టుకుంటాను’ అన్నాడు. ‘పొలం అమ్మాలనే ఆలోచన మానుకో. వ్యవసాయ భూమి చాలా అవసరం. వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు పంట పండించుకోవచ్చు. నువ్వు సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటే కొంతకాలం వేచి ఉండు’ అని స్నేహితుడికి సలహా ఇచ్చాడు వీరయ్య. అదేమీ పట్టించుకోకుండా కామయ్య.. పొలం అమ్మేసి, దుకాణం పెట్టుకున్నాడు. వీరయ్య మాత్రం ఎప్పటిలా గ్రామంలో తిరుగుతూ సరకులు అమ్ముకోసాగాడు.

 కొత్తగా ఏర్పాటు చేసిన కామయ్య వ్యాపారం, మొదట్లో బాగా నడిచింది. డబ్బులు ఎక్కువగా వస్తుండటంతో చాలా ఆనందపడ్డాడు. విలాసాలను అలవాటు చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత దుకాణం ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. అదే ఏడాదిలో వర్షాలు బాగా పడటంతో మిగిలిన పొలంలో పంట వేసి మంచి దిగుబడి పొందాడు వీరయ్య. ఖాళీ సమయంలో వ్యాపారం కూడా కొనసాగించాడు. నష్టాల్లో ఉన్న కామయ్య తన స్నేహితుడిని కలవడానికి ఇబ్బందిపడ్డాడు. కానీ విషయం తెలుసుకున్న వీరయ్య అతని దగ్గరకు వెళ్లి.. ‘మిత్రమా..! వ్యాపారం సరిగాలేదని బాధపడకు. మనం ఏ పని చేసినా.. దానికి సంబంధించిన అన్ని విషయాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలి. వ్యాపారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కాస్త అశ్రద్ధ చేసినా, మొదట్లో వచ్చిన ఫలితాలకే వ్యాపారం మీద ఒక నిర్ణయానికి వచ్చినా.. ఇలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను కాస్త సాయం చేస్తాను.. మళ్లీ వ్యాపారం మొదలుపెట్టు’ అని చెప్పి పట్టణం నుంచి సరకులు తెచ్చి ఇచ్చాడు. స్నేహితుడి సాయంతో మళ్లీ వ్యాపారం ప్రారంభించి, మొదటిసారిలా కాకుండా ఇప్పుడు కామయ్య చక్కగా వ్యాపారంపై దృష్టి పెట్టాడు. అనవసరపు ఖర్చులు చేయకుండా జాగ్రత్తపడ్డాడు. రెండేళ్లలో వ్యాపారాన్ని లాభాల్లోకి తెచ్చాడు. తను అమ్మిన భూమిని కూడా తిరిగి కొనుక్కున్నాడు. దీనికి అంతటికీ కారణమయిన స్నేహితుడికి కామయ్య కృతజ్ఞతలు తెలిపాడు.

 మొర్రి గోపి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు