వజ్రాలు దొరికాయోచ్‌!

శాలినీ రాజ్యంలో గంగులు, వీరన్న అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారిద్దరూ దొంగలు. రక్షక భటులకు చిక్కకుండా తప్పించుకునేవారు. ఒకసారి వారు అడవి మార్గం గుండా నడుస్తూ ఉంటే, వారికి ఒక సంచి దొరికింది. అందులో మూడు వజ్రాలున్నాయి. కళ్లు జిగేలుమనిపించే వాటిని చూసి వారు ఎంతో సంతోషించారు. కానీ వాటిని ఎక్కడ అమ్మజూపినా తాము పట్టుబడతామని వారికి అర్థమైంది. అందువల్ల ఒక నెల రోజుల తర్వాత వాటిని ఎక్కడైనా అమ్ముదామని నిర్ణయించుకున్నారు.

Published : 11 Dec 2023 00:23 IST

శాలినీ రాజ్యంలో గంగులు, వీరన్న అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారిద్దరూ దొంగలు. రక్షక భటులకు చిక్కకుండా తప్పించుకునేవారు. ఒకసారి వారు అడవి మార్గం గుండా నడుస్తూ ఉంటే, వారికి ఒక సంచి దొరికింది. అందులో మూడు వజ్రాలున్నాయి. కళ్లు జిగేలుమనిపించే వాటిని చూసి వారు ఎంతో సంతోషించారు. కానీ వాటిని ఎక్కడ అమ్మజూపినా తాము పట్టుబడతామని వారికి అర్థమైంది. అందువల్ల ఒక నెల రోజుల తర్వాత వాటిని ఎక్కడైనా అమ్ముదామని నిర్ణయించుకున్నారు. కానీ అంతవరకు ఆ వజ్రాలను ఎక్కడ దాచాలో వారికి అర్థం కాలేదు. అందుకే తాము ప్రతిదినం సొమ్ము పంచుకున్నట్లే ఆ మూడు వజ్రాలను వారు సమానంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.  

వెంటనే వారు చెరొక వజ్రాన్ని తీసుకున్నారు. మిగిలిన ఆ మూడో వజ్రాన్ని ఎలా పంచుకోవాలో వారికి తెలియలేదు. అప్పుడు గంగులు, వీరన్నతో... ‘ఈ మూడో వజ్రాన్ని ఇక్కడ కనిపిస్తున్న ఆ చెట్టు రంధ్రంలో దాచి పెడదాం. తర్వాత దాన్ని ఈ చెట్టు రంగులోనే ఉన్న ఒక చిన్న రాయితో మూసేద్దాం. అప్పుడు ఎవ్వరికీ అనుమానం రాదు. మళ్లీ మనం నెల రోజుల తర్వాత వచ్చి, ఈ వజ్రాన్ని తీసుకొని పోయి ఎక్కడైనా అమ్మి వేద్దాం. ఆ సొమ్మును సమానంగా పంచుకుందాం! ఏమంటావు?’ అని ప్రశ్నించాడు. వీరన్న అంగీకరించాడు. వారు తాము అనుకున్నట్టే ఆ వజ్రాన్ని చెట్టు రంధ్రంలో దాచి వెళ్లారు.

నిజానికి ఆ వజ్రాలు, వరహాలు అనే వ్యాపారివి. రాజుగారికి తన వజ్రాల సంచి పోయిందని ఆయన ఫిర్యాదు చేశాడు. అది దొరికిన తర్వాత కబురు చేస్తానని రాజు చెప్పాడు. దీంతో వ్యాపారి వెళ్లి పోయాడు. నెలరోజుల తర్వాత గంగులు, వీరన్న వచ్చి చూస్తే ఆ వజ్రం అక్కడ లేదు. చెట్టు రంధ్రం తెరిచి ఉంది. దాంతో వారి ఇద్దరికీ ఒకరిపై మరొకరికి అనుమానం వచ్చింది. వెంటనే వారు ఆ వజ్రాన్ని.. ‘నువ్వు తీశావంటే, నువ్వు తీశావు’ అని పోట్లాడుకోసాగారు. ఇంతలో అక్కడికి రాజభటులు వచ్చి వారిద్దరిని బంధించి రాజాస్థానానికి తీసుకొని వెళ్లారు.

‘ఆ వజ్రాలు ఎక్కడ దొంగతనం చేశారు’ అని రాజు వారిని ప్రశ్నించాడు. వారు ఆ వజ్రాల సంచి తమకు అడవి దారిలో దొరికిందని చెప్పారు. అప్పుడు రాజు.. ఆ దొంగల దగ్గర నుంచి, స్వాధీనం చేసుకున్న ఆ రెండు వజ్రాలను వరహాలుకు చూపించి.. ‘ఇవి నీవేనా?’ అని అడిగారు. ‘ఔను... మహారాజా! కానీ... నేను పోగొట్టుకొన్నవి మూడు వజ్రాలు’ అని సమాధానం ఇచ్చాడు వరహాలు.

అప్పుడు ఆ దొంగలు భయపడి... ‘మూడో వజ్రం సంగతి మాకైతే తెలియదు.. మహాప్రభో!’ అన్నారు. అప్పుడు రాజు.. ‘ఆ మూడో వజ్రం మా దగ్గరే ఉంది’ అని అన్నాడు. ‘మూడో వజ్రం మీ దగ్గరకు ఎలా వచ్చింది’ అని వరహాలు, రాజును అడిగాడు. ‘ఈ దొంగలు.. మూడు వజ్రాలను దొంగిలించడం మంచిదైంది! అదే నాలుగై ఉంటే వీరు మనకు దొరికే వారు కాదు! మా రాజభటులు అడవిలో చెట్లను కొట్టివేయకుండా కాపలాగా తిరుగుతున్నారు. అప్పుడే ఒక వడ్రంగి పిట్ట, ఈ చెట్టు రంధ్రాన్ని తన ముక్కుతో పొడిచింది. వెంటనే ఆ వజ్రం కింద పడింది. మా రాజభటులు ఇది గమనించి, ఆ వజ్రాన్ని తీసుకొని వచ్చి నాకు అప్పగించారు. ఇది దాచిన వారు అక్కడికి వస్తారని, వారిని పట్టుకుంటే ఆ వజ్రం సంగతి తెలుస్తుందని, నేను వారికి చెప్పాను. వారు రహస్యంగా ప్రతి రోజూ ఈ చెట్టును గమనిస్తున్నారు. ఈ విషయం తెలియక, దొంగలు అక్కడికి వచ్చి ఆ వజ్రం గురించి పోట్లాడుకుంటూ పట్టుబడ్డారు’ అని రాజు చెప్పాడు. వరహాలు చాలా సంతోషంగా తన వజ్రాలను తాను తీసుకున్నాడు. రాజు ఆ దొంగలకు వన సంరక్షణను శిక్షగా విధించాడు.

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని