రాజు మారాడు... అసలు దొంగ దొరికాడు!

కాంచీపురం రాజ్యాన్ని కాంచనవర్మ అనే రాజు పరిపాలించేవారు. ఆయనకు బంగారు నగలు ధరించడం చాలా ఇష్టం. రోజూ రకరకాలైన హారాలు వేసుకునేవాడు.

Updated : 12 Dec 2023 05:46 IST

కాంచీపురం రాజ్యాన్ని కాంచనవర్మ అనే రాజు పరిపాలించేవారు. ఆయనకు బంగారు నగలు ధరించడం చాలా ఇష్టం. రోజూ రకరకాలైన హారాలు వేసుకునేవాడు. రాజుగారి ఇష్టాన్ని తెలుసుకున్న బంగారు వర్తకులు చిత్ర విచిత్రమైన నగలు తయారు చేసి ఆయనకు ఎక్కువ ధరకు అమ్మేవారు. బంగారు నగల నాణ్యత పరిశీలించడానికి తన ఆస్థానంలోనే భానుడు అనే ఒక ఉద్యోగిని రాజు నియమించుకున్నారు. వర్తకులు తెచ్చే బంగారు నగల నాణ్యతను భానుడు పరిశీలించి చెప్పేవాడు. వాటి నాణ్యతను బట్టి వర్తకులకు కాంచన వర్మ ధనం ఇచ్చేవారు. బంగారు వర్తకులు భానుడిని ప్రలోభాలకు గురిచేసేవారు. రాజుగారికి గల ఆభరణాల పిచ్చిని తమకు ఆదాయ మార్గంగా మలుచుకొన్నారు. నాణ్యతలేని వస్తువులను తయారు చేసి భానుడితో అవి నాణ్యమైనవి అని చెప్పించేవారు. అలా ఎక్కువ ధనం పొందేవారు. అందులో కొంత భానుడికి ఇచ్చేవారు. ఇలా తక్కువ కాలంలోనే భానుడు ధనవంతుడయ్యాడు.

మంత్రి వినమ్రశర్మ మహారాజుతో... ‘మీకు బంగారు ఆభరణాలపై గల మోజు వల్ల మన ధనాగారంలోని చాలా మొత్తాన్ని కేవలం ఆభరణాల కొనుగోలుకే వెచ్చిస్తున్నారు. దీంతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ధనం సరిపోవట్లేదు. ఇకనైనా మీరు బంగారు ఆభరణాలపై గల మోజును వీడి, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టండి’ అని చెప్పాడు. మంత్రి మాటలు, మహారాజుకు రుచించలేదు. ‘ఇటువంటివి మరోసారి నాకు చెప్పవద్దు’ అంటూ ఆగ్రహించాడు.

ఒకరోజు ఒక బంగారు నగల వర్తకుడు పక్క రాజ్యం నుంచి విచ్చేసి ఒక సత్రంలో బస చేశాడు. ఉదయమే రాజు గారి దగ్గరికి బంగారు ఆభరణాలు తీసుకొని వెళ్లాలని అనుకున్నాడు. అయితే నాణ్యతను ఆస్థాన ఉద్యోగి భానుడు పరిశీలిస్తారని తెలిసి, ముందుగా అతన్ని కలవడానికి వారి ఇంటికి వెళ్లాడు. కొత్త వ్యక్తిని చూసిన భానుడు.. ‘ఎవరు మీరు.. ఎందుకు వచ్చారు’ అని అడిగాడు. ‘నేను మహారాజుకు బంగారు నగలను అమ్మడానికి వచ్చాను. చాలా విలువైన బంగారు హారం నా దగ్గర ఉంది. దాని ఖరీదు సుమారు పదివేల వరహాలు ఉంటుంది. మీరు ఒకసారి పరిశీలించి ఆయనకు చెప్పండి’ అన్నాడు.

భానుడు.. ఆ బంగారు హారం పరిశీలించకుండానే... ‘ఇంతకీ దాని ధర పది వేల వరహాల కన్నా ఎక్కువ అని చెబితే నాకేం ఇస్తావు’ అని బేరం మొదలుపెట్టాడు. ‘నా ధర కన్నా అధికంగా వచ్చేదంతా మీకే ఇస్తా!’ అని నగల వ్యాపారి అన్నాడు. ‘అయితే నేను పన్నెండు వేల వరహాలు అని చెబుతాను. మీరు ఇప్పుడే నాకు రెండువేల వరహాలు ఇచ్చేయండి’ అని భానుడు అన్నాడు. ‘నేను ఉదయం సభకు వచ్చేటప్పుడు తీసుకొస్తాను. అవి తీసుకున్నాకే మీరు ధర నిర్ణయించండి’ అని ఒప్పించి వచ్చేశాడతను.
ఉదయమే నగల వర్తకుడు రాజాస్థానానికి వెళ్లాడు. భానుణ్ని కలిసి రెండు వేల వరహాల మూట అందించాడు. రాజుగారికి నగల వ్యాపారి తెచ్చిన బంగారు హారం బాగా నచ్చింది. రాజు భానుణ్ని పిలిచి... ‘ఈ బంగారు హారం నాణ్యత పరిశీలించి ధర నిర్ణయించు’ అని చెప్పారు. అతడు బంగారు హారాన్ని అటూ.. ఇటూ.. తిప్పి చూసి.. ‘నాణ్యత చాలా బాగుంది. దీనికి పన్నెండు వేల వరహాలు ఇవ్వవచ్చు’ అని అన్నాడు.

రాజు, నగల వ్యాపారిని... ‘ఈ ధర నీకు సమ్మతమేనా?’ అని అడిగాడు. ‘మహారాజా! క్షమించండి. ఈ ధర నాకు సమ్మతం కాదు’ అని బదులిచ్చాడతను. అప్పుడు భానుడు కలుగజేసుకొని.. ‘మరో వెయ్యి వరహాలు అదనంగా తీసుకొని ఈ నగను మహారాజు గారికి ఇవ్వు’ అని అన్నాడు. ఆ వ్యాపారి నవ్వుతూ.. ‘మహారాజా! మీ నగల నాణ్యతను పరిశీలించే ఉద్యోగి చాలా తెలివైనవాడు. దీని ధర చాలా చక్కగా చెప్పారు. కానీ ఇతని కన్నా మిన్నగా ఇదే సభలో ఉన్న నగలు తయారు చేసే వ్యక్తి ఒకరు చెప్పగలరు. అతనికి ధర చెప్పడానికి అనుమతి ఇవ్వగలరా?’ అని అడిగాడు.

మహారాజు.. ‘సరే.. అని అనడంతో, నగలు తయారు చేసే వ్యక్తి ముందుకు వచ్చాడు. ‘మహారాజా! ఈ బంగారుహారం ధర వేయి వరహాల కన్నా తక్కువే. నిన్ననే ఈ నగల వ్యాపారి నా దగ్గరకు వచ్చి ఈ హారాన్ని కొనుగోలు చేశాడు’ అని అసలు విషయం చెప్పాడు. మహారాజు భానుడి వైపు కోపంగా చూశారు. అప్పుడు నగల వ్యాపారి.. ‘మహారాజా! నగల నాణ్యత పరిశీలించే మీ ఉద్యోగి భానుడు నా దగ్గర రెండు వేల వరహాలు లంచంగా తీసుకుని, నేను చెప్పమన్న ధర చెప్పాడు. కావాలంటే అతని దగ్గర నేను ఇచ్చిన రెండువేల వరహాల మూట ఉంది. తనిఖీ చేయండి’ అని అన్నాడు.

రాజాజ్ఞతో భటులు భానుణ్ని తనిఖీ చేయగా.. అతని దగ్గర రెండు వేల వరహాల మూట దొరికింది. రాజు, భానుణ్ని చెరసాలలో పెట్టించారు. అతని అవినీతిని బయటపెట్టిన నగల వ్యాపారిని, హారం అసలు ధర చెప్పిన నగలు తయారు చేసే వ్యక్తిని సత్కరించారు. ‘మహారాజా! మీకు గల నగల వ్యామోహాన్ని ఆసరాగా చేసుకుని చాలామంది నగల వర్తకులు నాణ్యతలేని ఆభరణాలను భానుడి సాయంతో మీకు అంటగట్టారు. మీరు ఇకనైనా ఈ నగల వ్యామోహం వీడి, పాలనపై దృష్టి పెట్టాలని మనవి’ అని మంత్రి కోరాడు.

‘నాకు బాగా తెలిసి వచ్చింది. ఇకపై ప్రజా సంక్షేమంపై దృష్టి పెడతాను’ అని రాజు మంత్రితో అన్నాడు. భానుడి అవినీతి బయటపెట్టిన నగల వర్తకుడికి మంత్రి తర్వాత కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. అప్పుడు ఆ నగల వర్తకుడు.. ‘మంత్రివర్యా! ప్రజాసంక్షేమం కోరే కదా.. మీరు రాజులో పరివర్తన తేవడానికి నన్ను భానుడి అవినీతి బయట పెట్టడానికి ఉపయోగించుకున్నారు. అంతా మీ ఉపాయమే. మొత్తానికి రాజ్యానికి మేలు జరిగింది. అదే నాకు సంతోషం’ అంటూ మంత్రికి ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయాడు.

మొర్రి గోపి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని