కోడిగుడ్డు.. బహుమతి తెచ్చింది!

ఉదయగిరి రాజ్యాన్ని పాలించే మహారాజుకు పోటీలు నిర్వహించడం అంటే చాలా ఇష్టం. అలా ఒకసారి సరదాగా ఓ విచిత్రమైన పోటీ పెట్టడానికి నిర్ణయించుకున్నాడు. అదేంటంటే.. రాజమందిరం మీది నుంచి కోడిగుడ్డును కిందకి విసరాలి కానీ, అది పగలకూడదు.

Updated : 13 Dec 2023 03:32 IST

దయగిరి రాజ్యాన్ని పాలించే మహారాజుకు పోటీలు నిర్వహించడం అంటే చాలా ఇష్టం. అలా ఒకసారి సరదాగా ఓ విచిత్రమైన పోటీ పెట్టడానికి నిర్ణయించుకున్నాడు. అదేంటంటే.. రాజమందిరం మీది నుంచి కోడిగుడ్డును కిందకి విసరాలి కానీ, అది పగలకూడదు. ఇదే విషయం మంత్రితో చెప్పి, రాజ్యంలోని ప్రజలందరికీ తెలిసేలా దండోరా వేయించాడు. అలాగే ఈ పోటీలో నెగ్గిన వారికి విలువైన బహుమతి ఇస్తానని కూడా చెప్పాడు. ఇది విన్న చాలామంది యువకులు.. ‘ఈ పోటీ చాలా సులభంగా గెలవొచ్చు.. మేడ కింద పచ్చగడ్డి పరిచి, పైనుంచి గుడ్డు విసిరితే అది పగలదు’ అని చర్చించుకున్నారు. వెంటనే పొలాల్లోకి వెళ్లి పచ్చగడ్డిని మోపులుగా కట్టుకొని రాజమందిరానికి చేరుకున్నారు. ముందుగా అనుకున్నట్లుగానే కింద మొత్తం గడ్డిని పరిచి.. మేడ పైనుంచి నెమ్మదిగా గుడ్డును జారవిడిచారు. కానీ, అది పగిలిపోవడంతో నిరాశగా వెనుదిరిగారు ఆ యువకులు.

ఆ తర్వాత కొంతమంది యువతులు కూడా అక్కడికి చేరుకున్నారు. ‘ఇసుకను రాశులుగా పోసి, మేడ పైనుంచి దాని మీద గుడ్డు వేస్తే.. పగలదు కదా!’ అని ఆలోచించారు. దాన్ని ఆచరణలో పెడుతూ.. సంచుల నిండా తెచ్చిన ఇసుకను పరిచారు. ఇక మేడ మీద నుంచి గుడ్డును మెల్లగా కిందకు విసిరారు. అంతే, అది పగిలిపోయింది. ఇలా జరిగిందేంటని వాళ్లు కూడా బిక్క ముఖం వేసుకున్నారు. ఈ పోటీ విషయం ఆనోటా ఈనోటా ఆ రాజ్యంలో తివాచీలు తయారుచేసే వాళ్లకు చేరింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, మనం వెంటనే వెళ్లి పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు వాళ్లు. ‘నేల మీద తివాచీలు పరిచి, వాటి మీద గుడ్డు విసిరితే గెలుపు మనదే కదా!’ అని అత్యుత్సాహంతో అక్కడికి వెళ్లారు.. ఆ తివాచీల తయారీదారులు. గెలిచిన బహుమతిని ఎలా ఉపయోగించుకోవాలని చర్చిస్తూ.. తివాచీలను నేల మీద వేశారు. ఆ తర్వాత గుడ్డును కిందకు విసిరారు. అందరిలాగే వీళ్లకు కూడా నిరాశే మిగిలింది. తివాచీల మీద పడిన గుడ్డు, పగిలిపోయింది.

ఆ తర్వాత రాజ్యంలోని చాలామంది ప్రజలు వచ్చి రకరకాలుగా ప్రయత్నించినా.. ఎవరూ ఆ పోటీలో గెలవలేకపోయారు. ఒకవైపేమో సాయంకాలం అవుతోంది. ఈ పోటీలో రాజ్యంలోని ప్రజలెవ్వరూ గెలుపొందలేకపోయారని రాజు ప్రకటించాలని అనుకుంటున్నాడు. అప్పుడే అక్కడికి.. సరస్వతి అనే ఒక ఆవిడ వచ్చింది. ఆమె ఆ రాజ్యంలోనే కోళ్లను పెంచుతుంది. పోటీ విషయం తెలుసుకున్న తను.. ఒక కోడిని వెంట తీసుకొని వచ్చింది. దానికి ప్రతిరోజూ సాయంత్రం గుడ్డు పెట్టడం అలవాటు. దాంతో గబగబా మేడ మీదకు వెళ్లి, అక్కడి నుంచి ఆ కోడిని విసిరింది సరస్వతి. అది రెక్కలు ఆడిస్తూ వెళ్లి నేల మీద వాలింది. సమయం అవ్వడంతో ఎప్పటిలాగే గుడ్డు పెట్టేసిందది. అక్కడున్న జనాలందరూ ఒక్కసారిగా అరుస్తూ.. చప్పట్లు కొట్టారు. భయంతో అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్లిపోయిందా కోడి. ‘ఇప్పుడు ఆమె గెలిచినట్లా?’ అని అనుమానంగా రాజు వైపు చూశారందరు. అప్పుడు మంత్రి.. ‘సరస్వతి ఈ పోటీలో గెలిచింది. ఎందుకంటే.. ఆమె పైనుంచి కోడిని విసిరినప్పుడు, గుడ్డు దాని కడుపులోనే ఉంది. అది పగలకుండా నేల మీద వాలింది. ఆ తర్వాత గుడ్డు పెట్టింది. అంటే ఆమె గెలిచినట్లే కదా!’ అన్నాడు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె సమయస్ఫూర్తిని రాజు మెచ్చుకున్నాడు. ముందుగా చెప్పిన దానికి రెండింతల బహుమతిని సరస్వతికి అందజేశాడు.

ఆర్‌.సి.కృష్ణస్వామిరాజు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని