అపకారికి ఉపకారం!

‘నాకు చావంటే చాలా భయం’ అంది కోడి. ‘మృత్యువు అంటే ఎవరికి మాత్రం భయం ఉండదు?’ అంది మేక. ‘నాకు నన్ను చంపడమంటే చచ్చేంత భయం’ అంది గేదె. ‘కానీ మనం ఏం చేయగలం? నోరులేని జీవులం. మనల్ని వాడుకున్నంత వాడుకొని లాభం పొంది ఈ మనుషులు మనల్ని జాలి లేకుండా చంపేస్తారు’ అంది కోడి బాధగా.

Updated : 15 Dec 2023 01:20 IST

‘నాకు చావంటే చాలా భయం’ అంది కోడి. ‘మృత్యువు అంటే ఎవరికి మాత్రం భయం ఉండదు?’ అంది మేక. ‘నాకు నన్ను చంపడమంటే చచ్చేంత భయం’ అంది గేదె. ‘కానీ మనం ఏం చేయగలం? నోరులేని జీవులం. మనల్ని వాడుకున్నంత వాడుకొని లాభం పొంది ఈ మనుషులు మనల్ని జాలి లేకుండా చంపేస్తారు’ అంది కోడి బాధగా.

‘అందరూ అలా ఉండరు. మనుషుల్లో కొంతమంది మంచి వాళ్లు కూడా ఉంటారు. కానీ మన యజమాని రత్తయ్య లాగా ఎవరూ ఉండరు’ అంది మేక. ‘అవునవును’ అని అన్నాయి కోడి, గేదె ఒకేసారి.

ఆ మూడూ రత్తయ్య పెంపుడు జంతువులు. అవి అనుకున్నట్లే అతడిలో ఏ మాత్రం జాలీ, దయా లేవు. ఎప్పుడూ వాటికి సరిగ్గా తిండి కూడా పెట్టేవాడు కాదు. గేదె, మేకల్ని నిర్ధాక్షిణ్యంగా బాదేవాడు. మేక, కోడి, గేదె మూడూ మంచి నేస్తాలు. ఒకటంటే మరోదానికి ప్రాణం.

‘నువ్వు ఇంకా గుడ్లు పెడుతున్నావా?’ అని ఒకరోజు మేక, కోడిని అడిగింది. ‘ఇంకెక్కడ పెడతాను గుడ్లు? నేను ముసలిదాన్ని అయిపోయాను’ అంది బాధగా. ‘అదీ... అలా చెప్పు’ అంది మేక తాపీగా. ‘ఏం జరిగింది?’ అని అడిగాయి కోడి, గేదె కంగారుగా.

‘ఇంకా ఏం జరగాలి? రాత్రి రత్తయ్య ఎవరితోనో ఫోన్లో చెబుతున్నాడు. వచ్చే ఆదివారం నిన్ను చంపేస్తాడట’ అంది మేక. ‘అవునా? నువ్వు సరిగ్గా విన్నావా? నన్నే చంపుతానన్నాడా? లేక నిన్నా?’ అని అడిగింది కోడి, ఆందోళన చెందుతూ. ‘చంపేస్తా అని చెప్పడం విన్నాను కానీ, నిన్నో నన్నో సరిగ్గా అర్థం కాలేదు’ అని మెల్లగా అంది మేక. దాంతో కాస్త ఊరట చెందింది కోడి. ఆదివారం వచ్చింది. రత్తయ్య ఇంటికి బంధువులు వచ్చారు. అతడు చాలా హడావుడిగా అటూ ఇటూ తిరిగేస్తూ అందరికీ పనులు పురమాయించేస్తున్నాడు.

‘రత్తయ్యా! మాకు విందులో కోడీ... మేకాలాంటివి  లేవా?’ అని వచ్చిన వాళ్లల్లో ఎవరో అడిగారు. ‘ఎందుకు లేవు? ఉన్నాయి’ బదులిచ్చాడతను. అంతే! ఆ పక్కనే షెడ్‌లో ఉన్న కోడి, మేక ఆ మాటలు వింటూనే కంగారు పడిపోయాయి. ‘అయితే ఈ రోజు మన ఇద్దరికీ మూడిందన్న మాట’ అనుకొని ఒకదాని ముఖం మరోటి చూసుకున్నాయి బాధగా.

నేస్తాలు దూరం అవుతున్నందుకు, గేదె కన్నీటి పర్యంతమైంది. ఇంతలో రత్తయ్య కత్తి పట్టుకొని షెడ్‌ వైపు రావడం చూశాయవి. అంతే వాటి పై ప్రాణాలు పైనే పోయాయి. ‘దేవుడా ఈ రోజుతో మాకు ఈ భూమ్మీద నూకలు చెల్లిపోయాయి’ అనుకొని గజగజా వణికి పోయాయి. రత్తయ్య వేగంగా షెడ్‌ దగ్గరికి వచ్చి కత్తితో ఆ పక్కనే ఉన్న అరిటాకులు కోసుకొని వెళ్లిపోయాడు. దాంతో కోడీ.. మేకా.. ‘హమ్మయ్యా!’ అనుకున్నాయి. అయితే రత్తయ్య అప్పటికి వాటిని కోసి వండే సమయం లేనందున.. బయటి నుంచి చికెన్‌, మటన్‌ తెప్పించి బంధువులకు విందు ఏర్పాటు చేశాడు.

అలా ఆ రోజు వాటికి ఎలాగో గండం తప్పింది. కానీ ఈసారి మాత్రం గేదెకు ప్రమాదం వచ్చిపడింది. అది కూడా ఒట్టిపోయి చాలా రోజులైంది. మేత దండగని గేదెను కసాయివాడికి అమ్మాలనుకున్నాడు రత్తయ్య. బేరం కూడా కుదిరిపోయింది.

అయితే గేదెను తీసుకెళ్లడానికి వచ్చిన వ్యక్తి ఎంత బాదినా అంగుళం కూడా కదల్లేదది. దాంతో రత్తయ్య ‘సర్లే.. నేనే దాన్ని నీ దగ్గరికి తీసుకొస్తాలే, నువ్వెళ్లు’ అని చెప్పి పంపించేశాడు. ఆ వ్యక్తి వెళ్లిపోయాడు.

మర్నాడు రత్తయ్య గేదెను తీసుకొని బయలుదేరాడు. అతడు తన యజమాని కనుక గేదె మారాం చేయలేదు. బుద్ధిగా కదిలింది. తన నేస్తాలు శాశ్వతంగా దూరం అవుతున్నారనే బాధ దానికి ఉన్నప్పటికీ అది చేసేదేం లేదు. దేవునిపై భారం వేసి కదిలింది. రత్తయ్య ఉంటున్న రామాపురానికి, కసాయివాడు ఉంటున్న కృష్ణాపురానికి మధ్యలో ఒక చిన్న ఏరు ప్రవహిస్తోంది. గేదెను తీసుకొని ఏరు మధ్యవరకు వెళ్లాక, ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగిపోయింది.

ఊహించని పరిణామానికి విస్తుపోయాడు రత్తయ్య. ఏం చేయాలో అతనికి తోచలేదు. ఈత రాక నీటిలో కొట్టుకొని పోసాగాడు. ప్రాణ భయంతో ‘రక్షించండి... రక్షించండి’ అని గట్టిగా కేకలు పెడుతున్నాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. మృత్యుభయంతో అతని గుండె దడదడా కొట్టుకుంది.

గేదె ఎలాగైనా తన యజమానిని రక్షించాలనుకుంది. నీటిలో ఈదుకుంటూ వెళ్లి రత్తయ్య పక్కగా నిలిచింది. అతడు గేదెను పట్టుకొని దాని పైకెక్కాడు. అది ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి చేరింది. రత్తయ్య ప్రాణాల్ని కాపాడింది. గేదెను కసాయి వాడికి అమ్మేసి, వదిలించుకోవాలని చూసినా.. అది విశ్వాసంతో అతన్ని కాపాడింది. దాంతో రత్తయ్య కళ్లు కృతజ్ఞతతో చెమర్చాయి. ‘నిన్నెప్పటికీ విడువను’ అంటూ గేదెతో సహా తన ఇంటి వైపు దారి తీశాడు అతడు. అపకారికి ఉపకారం చేసిన ఆ గేదెనే కాదు, ఆ తర్వాత తన దగ్గరున్న మూగజీవాల్నీ ఎప్పుడూ హింసించలేదు, ప్రాణం తీపి తెలిసివచ్చిన రత్తయ్య.

నంద త్రినాథ రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు