వారసుడొచ్చాడు!

కాతేరులో ఉంటున్న రాఘవరావుది బొమ్మల వ్యాపారం. మట్టితో అందమైన బొమ్మలు చేసి, వాటికి రంగులు వేసి, సరసమైన ధరలకు అమ్ముతూ ఉంటాడు. అందంగా ఉండే అతని చేతి బొమ్మలకు గిరాకీ ఎక్కువ. ఆ ఊరి వాళ్లే కాకుండా పక్క పల్లెల నుంచి కూడా ఈ బొమ్మలు కొనడానికి వస్తుంటారు. అతని చేతిలో రూపుదిద్దుకున్న రాధాకృష్ణుల బొమ్మలు ప్రత్యేకంగా ఉండేవి.  రాఘవరావు భార్య సావిత్రి చాలా మంచిది. ‘ఏవండీ మనకు పిల్లలు లేరు కదా! ఎవరైనా ఒక అబ్బాయిని పెంచుకుందాం.

Published : 18 Dec 2023 00:30 IST

కాతేరులో ఉంటున్న రాఘవరావుది బొమ్మల వ్యాపారం. మట్టితో అందమైన బొమ్మలు చేసి, వాటికి రంగులు వేసి, సరసమైన ధరలకు అమ్ముతూ ఉంటాడు. అందంగా ఉండే అతని చేతి బొమ్మలకు గిరాకీ ఎక్కువ. ఆ ఊరి వాళ్లే కాకుండా పక్క పల్లెల నుంచి కూడా ఈ బొమ్మలు కొనడానికి వస్తుంటారు. అతని చేతిలో రూపుదిద్దుకున్న రాధాకృష్ణుల బొమ్మలు ప్రత్యేకంగా ఉండేవి. 

రాఘవరావు భార్య సావిత్రి చాలా మంచిది. ‘ఏవండీ మనకు పిల్లలు లేరు కదా! ఎవరైనా ఒక అబ్బాయిని పెంచుకుందాం. వాడికి బొమ్మలు తయారు చేయడం నేర్పించండి. మీ తర్వాత కూడా ఈ బొమ్మలు ఇలాగే దొరకాలి’ అనేది. కానీ అతడు మాత్రం ‘పిచ్చిదానా! ఇది ఒకరు నేర్పితే వచ్చే విద్య కాదు. పుట్టుకతోనే రావాలి’ అనేవాడు.  

కానీ ఈ విషయంలో సావిత్రికి చాలా బెంగగా ఉండేది. ఇలాగైనా ఒక పిల్లవాణ్ని పెంచుకోవచ్చు అని ఆమె ఆలోచన. ఒకరోజు అతని స్నేహితుడు శంకరం వచ్చాడు. ‘ఏం చెల్లెమ్మా!.. ఎలా ఉన్నాడు మావాడు’ అన్నాడు. ‘ఏముంది అన్నయ్య గారూ, ఆయనకీ వయసు అయిపోతుంది. మాకా పిల్లలు లేరు. ఎవరినైనా పెంచుకుందాం అంటే వినడం లేదు’ అంది. ‘సరే.. నేను చెప్పి చూస్తా’ అన్నాడతను.

‘రాఘవా! నీ తర్వాత.. నీ విద్యకైనా ఓ వారసుడు కావాలి కదా..! నా మాట విని ఓ పిల్లవాణ్ని చేరదీసి, ఈ బొమ్మలు చేయడం నేర్పు’ అన్నాడు శంకరం. ‘నీకు తెలియదు శంకరం.. ఇంత బాగా బొమ్మలు చేయడం వేరే వారికి సాధ్యం కాదు. దాని వల్ల నా పేరు చెడిపోతుంది’ అని మూర్ఖంగా జవాబిచ్చాడు రాఘవరావు. ‘నేను ఓ మాట అడుగుతా.. సమాధానం చెప్పు, మీ నాన్న పేరేంటి?’ అని ప్రశ్నించాడతను. ఒక్క నిమిషం ఆలోచించి.. ‘రామయ్య!’ అని బదులిచ్చాడు రాఘవరావు. ‘మీ తాత పేరు?’ అడిగాడు మళ్లీ.. ‘భీమయ్య!’ అన్నాడతను. ఈసారి ‘మీ తాత వాళ్ల నాన్న పేరు ఏంటి?’ అడిగాడు శంకరం.  

ఎంత ఆలోచించినా ఆ పేరు గుర్తుకు రాలేదు. ‘సావిత్రీ.. మా తాత వాళ్ల నాన్న పేరు మర్చిపోయాను’ భార్యతో అన్నాడు రాఘవరావు. ‘ఆయన పేరు, మీ పేరు ఒకటే కదా!’
అందామె. ‘చూశావా.. మీ తాతగారి నాన్న పేరే నీకు గుర్తులేదు. అటువంటిది... నీ తర్వాత బొమ్మల గురించి, నీ గురించి ఎవరికి తెలుస్తుంది! ఒక వారసుడుంటే అతనితోపాటే, నీ పేరూ గుర్తుంటుందని తెలుసుకో!’ అన్నాడు శంకరం.

‘సరే కానీ.. మంచి కుర్రాడు దొరకాలిగా!.. అయినా వాడు నాకు నచ్చితేనే నేర్పగలను’ అన్నాడు రాఘవరావు. ‘ఓ అబ్బాయిని నేను పంపుతా. నీ దగ్గర మట్టి తేవడానికి, బొమ్మలు సర్దడానికి ఉపయోగించుకో! ఇప్పుడే నువ్వేమీ వాడికి నేర్పొద్దు. నీకు బాగా నచ్చాడు అన్నప్పుడే నీ విద్య నేర్పు. సరేనా!’ అన్నాడు శంకరం. ఈ ప్రతిపాదనకు అయిష్టంగానే ఒప్పుకున్నాడు రాఘవరావు. సావిత్రి కూడా చాలా సంతోషించింది. అనుకున్నట్లుగానే శ్రీనివాసు అనే కుర్రాడిని స్నేహితుడి దగ్గర చేర్చాడు శంకరం. ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు. రాఘవరావు దగ్గర చాలా ఒద్దికగా పని మొదలుపెట్టాడు. అతడు బొమ్మలు చేయడం, శ్రీను చాలా శ్రద్ధగా చూసేవాడు. నువ్వు కూడా బొమ్మలు బాగా చేయగలవు అని సావిత్రి ప్రోత్సహించేది. ఆయన లేని సమయంలో బొమ్మలు చేయడానికి ప్రయత్నించేవాడు.

ఇలా చాలా కాలం గడిచింది. అప్పుడప్పుడు రాఘవరావు తనకు నచ్చితే శ్రీనుకు బొమ్మలు చేయడంలో మెలకువలు చెప్పేవాడు. ఒకరోజు కాతేరు జమీందారు వచ్చి ‘రాఘవరావు.. నేను మేడపాడులో మిత్రుడి ఇంటికి వెళ్తున్నాను. నాకొక రాధాకృష్ణుల బొమ్మ కావాలి’ అన్నారు.

‘అయ్యో.. ఉన్న ఒక్కటీ నిన్ననే అమ్మేశాను. ముందుగా చెబితే చేసుంచే వాణ్ని’ అన్నాడు రాఘవరావు. జమీందారు నిరుత్సాహపడటం చూసిన శ్రీను.. ‘అయ్యా! మన దగ్గర ఒక బొమ్మ ఉంది’ అంటూ ఇంట్లోకి వెళ్లి రాధాకృష్ణుల బొమ్మ తెచ్చి ఇచ్చాడు. ‘ఇది నేను ఎప్పుడు చేశాను’ అనుకున్నాడు రాఘవరావు. ‘చాలా బాగుంది’ అంటూ దానికి డబ్బు చెల్లించి తీసుకున్నాడు జమీందారు.

ఆయన వెళ్లిన తరువాత.. ‘సావిత్రీ... ఈ బొమ్మ నేను ఎప్పుడు చేశాను!’ అన్నాడు రాఘవరావు. ‘అది మీరు చేసింది కాదండీ.. శ్రీను తయారుచేశాడు’ అని చెప్పిందామె. ‘చాలా బాగా చేశాడు. నేను కూడా కనిపెట్టలేకపోయాను’ అన్నాడు రాఘవరావు. ‘చూశారా.. మీరు చెప్పిన కొన్ని మెలకువలతోనే ఇంత బాగా బొమ్మ చేశాడు. మీరే నేర్పితే ఎలా ఉంటుందో ఆలోచించండి. విద్య దాచుకోవడం కాదండీ! మరొకరికి పంచితేనే బాగుంటుంది’ అంది సావిత్రి. ‘సరిగా నేర్చుకోక నా పేరు చెడగొడతాడని భయపడి నేర్పలేదు కానీ, ఇంత మంచిగా చేస్తే, ఎందుకు నేర్పను’ అంటూ శ్రీనుని దగ్గరికి తీసుకున్నాడు రాఘవరావు.

‘వాడు మా దూరపు బంధువు కొడుకు. ఇప్పుడు అమ్మానాన్న లేరు. అందుకే నీ దగ్గరికి చేర్చాను’ అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన శంకరం. ‘ఇక వాడి గురించి భయం లేదు అన్నయ్యా..! వాడు మా వారసుడు’ అని సంతోషంగా అంది సావిత్రి.

కూచిమంచి నాగేంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని