ముచ్చటగా మూడు పాత్రలు!

చద్రగిరిని జయసింహుడు పాలించేవాడు. అతని మంత్రి మాధవుడు. బాటసారుల కోసం గ్రామ పొలిమేరలో సత్రాలు ఏర్పాటు చేయాలనుకున్నాడు రాజు. వాటి నిర్వహణకు ఒక ముఖ్య అధికారిని నియమించాలని నిర్ణయించుకొని.. మంత్రితో ఒక ప్రకటన చేయించాడు. దాని కోసం ఏర్పాటు చేసిన పోటీలో చివరకు రామయ్య, శివయ్య, భీమయ్య మిగిలారు.

Updated : 19 Dec 2023 04:43 IST

చద్రగిరిని జయసింహుడు పాలించేవాడు. అతని మంత్రి మాధవుడు. బాటసారుల కోసం గ్రామ పొలిమేరలో సత్రాలు ఏర్పాటు చేయాలనుకున్నాడు రాజు. వాటి నిర్వహణకు ఒక ముఖ్య అధికారిని నియమించాలని నిర్ణయించుకొని.. మంత్రితో ఒక ప్రకటన చేయించాడు. దాని కోసం ఏర్పాటు చేసిన పోటీలో చివరకు రామయ్య, శివయ్య, భీమయ్య మిగిలారు. మంత్రి ఆ ముగ్గురినీ ఒక ప్రత్యేక మందిరంలోకి తీసుకెళ్లి.. ‘మీలో విజేత ఎవరో రేపు తెలియజేస్తాను. ఈ రోజు సాయంత్రం వరకు ఇక్కడే ఉండండి. మీకు కావాల్సిన తినుబండారాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేశాను. తిన్నంత తిని, మిగతావి ఇళ్లకు తీసుకువెళ్లవచ్చు. అలాగే ఆ బల్ల మీద ఉన్న మూడు పాత్రల్లో తాగడానికి నీళ్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు తీసుకెళ్లొచ్చు’ అని చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత భీమయ్య అక్కడున్న ఆహారపదార్థాలను తినడం మొదలుపెట్టాడు. ఆ వెంటనే శివయ్య కూడా తినడం ఆరంభించాడు. వాళ్లిద్దరూ.. ‘ఏం రామయ్యా! నీకు ఆకలిగా లేదా? పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి. తిను నువ్వు కూడా!’ అన్నారు. ‘నేను కాసేపయ్యాక తింటాను.. మీరు కానివ్వండి’ అని బదులిచ్చాడతను. ‘బంగారం, వెండి, మట్టితో చేసిన ఈ నీటి పాత్రలు భలేగా ఉన్నాయి. నేను బంగారు పాత్రను తీసుకుంటాను’ అన్నాడు భీమయ్య. ‘నేను వెండి పాత్రను తీసుకుంటాను’ అన్నాడు శివయ్య. ‘ఇక రామయ్యకు మిగిలింది మట్టి పాత్రే. మనకు ఇక్కడ కొలువు వస్తుందన్న నమ్మకం లేదు. రేపు ఈ పాత్రలు అమ్ముకున్నా డబ్బులు వస్తాయి’ అన్నాడు భీమయ్య. ఆ మాటలకు అవునంటూ తలూపాడు శివయ్య. ‘బాగా తిన్నాం కదా.. నిద్ర వస్తోంది’ అంటూ.. అక్కడ ఉన్న మంచాల మీద పడుకున్నారు భీమయ్య, శివయ్య.

అప్పుడు రామయ్య.. ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం తిని, మట్టి పాత్రలోని నీళ్లు తాగాడు. ఆ తరవాత మందిరంలోనే అటూఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఇంతలోనే భీమయ్య, శివయ్య నిద్రలేచారు. ‘ఎలాగో సాయంకాలం అయింది. ఇక పనేముంది.. మిగిలిన పదార్థాలు తీసుకొని, మన ఇళ్లకు వెళ్దాం పదండి’ అన్నాడు భీమయ్య. ముందుగా అనుకున్నట్లుగానే భీమయ్య, శివయ్య బంగారు, వెండి పాత్రలు, తినుబండారాలు తీసుకొని బయలుదేరారు. రామయ్య నీళ్లు ఉన్న మట్టి పాత్రను తల మీద, తినుబండారాలను చేతి సంచిలో పెట్టుకుని మందిరం నుంచి బయటికి వచ్చాడు. కోట దాటి కొద్ది దూరం రాగానే కొందరు యాచకులు ‘అయ్యా! బాగా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి’ అని అడిగారు. వెంటనే తన దగ్గర ఉన్న ఆహారపదార్థాలను పంచిపెట్టి, తాగడానికి నీళ్లు కూడా అందించాడు. ‘అయ్యా ఇంత రుచిగా ఉన్న పదార్థాలు మేము ఎప్పుడూ తినలేదు. మా ఆకలి తీర్చిన మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి’ అని రామయ్యని ఆశీర్వదించారు వాళ్లంతా. ఇక ఖాళీ మట్టిపాత్రను తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడతను.

మరుసటిరోజు ఉదయాన్నే రామయ్య నిద్ర లేచేసరికి.. కోట నుంచి తెచ్చిన మట్టిపాత్ర కాస్తా బంగారు రంగులోకి మారింది. భీమయ్య, శివయ్యలు తీసుకెళ్లిన బంగారు, వెండి పాత్రలేమో.. మట్టి పాత్రలుగా మారాయి. వాటిని తీసుకొని ముగ్గురూ.. కోటకు చేరుకున్నారు. సభ ప్రారంభమయ్యాక ‘మహారాజా! నేను తీసుకువెళ్లిన మట్టి పాత్ర, బంగారు పాత్రలా మారిందని రామయ్య, మేము తీసుకెళ్లినవి మట్టి పాత్రలుగా మారాయి’ అని మిగిలిన ఇద్దరూ వాటిని మంత్రికి అప్పగించారు. ‘మేము కావాలనే ఆ మూడు పాత్రలను ఆ విధంగా తయారు చేయించాము. మీరు ప్రత్యేక మందిరంలో ఉన్నప్పుడు బయట ఉన్న మా అనుచరులు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. మీరు కోట నుంచి బయటకు వచ్చేటప్పుడు యాచకులుగా ఉంది కూడా.. కోటలోని పని వాళ్లే’ అని బదులిచ్చాడు మంత్రి. ఆ మాటలు విన్న భీమయ్య, శివయ్య ఆశ్చర్యపోయారు. వాళ్లు ఆకలిగా ఉందని అడిగినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు భీమయ్య, శివయ్య. ఆకలిదప్పుల విలువ తెలిసిన రామయ్య ఆహారపదార్థాలను ఇక్కడే వారికి పంచిపెట్టాడు. బంగారం, వెండి మీద ఆశ పడకుండా మట్టి పాత్రను స్వీకరించాడు. అందుకే.. రామయ్యే ఈ పోటీలో గెలిచాడు’ అని ప్రకటించాడు మహారాజు. సభలోని వారంతా కరతాళ ధ్వనులతో అతన్ని అభినందించారు.

యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని