ఉడుతా ఉడుతా ఊచ్‌.. స్వేచ్ఛ దొరికిందోచ్‌!

అది ఒక అందమైన పార్కు. ఒక ఆదివారం దానిలో పిల్లలంతా చక్కగా ఆడుకుంటున్నారు. ఉయ్యాల ఊగుతున్న చిన్నారి లల్లీకి, ఎక్కడ నుంచో చిన్నగా కిచ కిచమని శబ్దం వినిపించింది. వెంటనే ఊగటం ఆపి మరీ.. చెవులు రిక్కించి వింది. మళ్లీ పక్కనే ఉన్న పొదలో నుంచి అలికిడి వినిపించింది.

Updated : 20 Dec 2023 05:24 IST

ది ఒక అందమైన పార్కు. ఒక ఆదివారం దానిలో పిల్లలంతా చక్కగా ఆడుకుంటున్నారు. ఉయ్యాల ఊగుతున్న చిన్నారి లల్లీకి, ఎక్కడ నుంచో చిన్నగా కిచ కిచమని శబ్దం వినిపించింది. వెంటనే ఊగటం ఆపి మరీ.. చెవులు రిక్కించి వింది. మళ్లీ పక్కనే ఉన్న పొదలో నుంచి అలికిడి వినిపించింది.

‘బుజ్జీ! ఇలా రా! ఇక్కడ పొదలో నుంచి ఏదో శబ్దం వస్తోంది.. చూద్దాం!’ అని పిలిచింది లల్లీ. ‘అవునా.. అయితే పద’ అంది బుజ్జి. ఇద్దరూ కలిసి మొక్కలు కొంచెం పక్కకు జరిపి చూశారు. అక్కడ ఓ ఉడుత కూర్చొని ఉంది. వీళ్లను చూసి కూడా అది కదలడం లేదు. ‘హుష్‌... హుష్‌...’ అని అదిలించారు. అయినా అది అలాగే ఉంది.

‘బుజ్జీ! ఉడుత ఎందుకని కదలడం లేదు! దానికి ఆరోగ్యం బాగా లేదంటావా?’ అంది లల్లీ. ‘అవునేమో! పట్టుకుని చూద్దాం ఉండు’ అంటూ కిందకు వంగింది బుజ్జి. ఉడుత బెదురుగా చూస్తోంది, కానీ కదలడం లేదు.  దాన్ని చేతిలోకి తీసుకుని చూశారిద్దరూ. పాపం! దీని కాలికి గాయమై, రక్తం కారుతోంది.

‘మనం దీన్ని ఇంటికి తీసుకెళ్దాం. మా నాన్నకు చెప్పి, ఆసుపత్రిలో చూపిద్దాం. పద బుజ్జీ’ అంది లల్లీ. ‘ఇది నా పెంపుడు ఉడుత. నాతో పాటు పార్కుకు తీసుకొచ్చాను. బోనులో నుంచి తీయగానే అది తప్పించుకునే ప్రయత్నం చేసింది. అప్పుడే దాని కాలు చువ్వల్లో పడి గాయమైంది. బయటకు తీసి గాయాన్ని చూస్తుంటే నా చేతుల్లో నుంచి తుర్రున పారిపోయింది. నా ఉడుతను నాకు ఇచ్చేయండి’ అని అప్పుడే అక్కడకు వచ్చిన గోపి అన్నాడు.

‘గోపీ! నువ్వు తప్పు చేస్తున్నావు. మూగజీవులను హింసించకూడదు. నువ్వు ఉడుతను బంధించి బాధపెట్టావు. అది బోనులో ఉండలేక పారిపోయే ప్రయత్నం చేసింది’ అని కోపంగా అంది లల్లీ. ‘అదంతా నాకు తెలియదు. కానీ నా ఉడుతను నాకు ఇచ్చేయి’ అంటూ లాక్కోబోయాడు గోపి. ‘ఒకసారి ఉడుత స్థానంలో నిన్ను బోనులో బంధిస్తే ఎలా ఉంటుందో ఆలోచించు’ అంది లల్లీ. ‘మీరిద్దరూ గొడవ పడకండి. ముందు ఉడుత ఆరోగ్యం సంగతి చూద్దాం. లల్లీ వాళ్ల ఇల్లు ఇక్కడకు దగ్గర కాబట్టి వాళ్ల నాన్న గారి దగ్గరకు వెళ్దాం పదండి’ అంది బుజ్జి. గోపి ఏం చేయలేక వాళ్లతో పాటు వెళ్లాడు.

లల్లీ వాళ్ల నాన్న ఉడుతను పశువుల ఆస్పత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్‌ దాని కాలును శుభ్రం చేసి, మందు రాసి కట్టు కట్టారు. ‘రెండు రోజులు దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి’ అన్నారు. ‘గోపీ! ఉడుతకు బాగయ్యే దాకా నా దగ్గరే ఉంటుంది’ అంది లల్లీ. అప్పటికే ఉడుతకు డాక్టర్‌ చేసిన చికిత్స, లల్లీ దాని మీద చూపిస్తున్న ప్రేమను గోపి గమనిస్తున్నాడు. దీంతో.. ‘సరే లల్లీ! అలాగే’ అన్నాడు.

ఉడుతను లల్లీ ఇంటికి తీసుకెళ్లింది. రెండు రోజులు డాక్టర్‌ చెప్పిన విధంగా దానికి మందు రాస్తూ కట్టు మార్చింది. మూడో రోజు లల్లీ ఉదయం లేచేసరికి కిచకిచ మంటూ సవ్వడి చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్న ఉడుత కనిపించింది. ‘బుజ్జి ఉడుతా! నీకు నొప్పి తగ్గిపోయిందా!’ అని చేతుల్లోకి తీసుకుని ముద్దు చేసింది లల్లీ. అది మురిపెంగా ఆమె చేతుల్లో ఒదిగిపోయింది. ‘నీ ఫ్రెండ్‌కు బాగైపోయిందా లల్లీ! ఇక దాన్ని గోపి వాళ్ల ఇంటి దగ్గర వదిలేద్దామా?’ అన్నాడు వాళ్ల నాన్న. ‘అలాగే నాన్నా! కానీ ఇది మళ్లీ బోనులో బంధీ అవుతుంది కదా!’ అని బాధగా అందా చిన్నారి.

‘లల్లీ! ఉడుతకు బాగైందా!’ అంటూ అప్పుడే అక్కడకు వచ్చాడు గోపి. ‘ఏంటి.. ఇంత పొద్దున్నే ఇక్కడకు వచ్చావు. నీ ఉడుత కోసమా?’ అన్నాడు లల్లీ వాళ్ల నాన్న. ‘అవును అంకుల్‌! దాని కోసమే వచ్చాను’ అన్నాడు. ఆ మాటలకు లల్లీ దిగాలుగా చూసింది. ‘నువ్వు అలా బాధ పడకు లల్లీ.. నాతో పాటు నువ్వు సాయంత్రం పార్కుకు వస్తావా? దీన్ని స్వేచ్ఛగా వదిలేద్దాం’ అన్నాడు గోపి. 

‘అదేంటి? ఇక నువ్వు దీన్ని బోనులో పెట్టవా’ అని ఆశ్చర్యంగా అడిగింది లల్లీ. ‘పెట్టను. నేను చేసిన తప్పు నాకు తెలిసొచ్చింది. మూగజీవులను బాధ పెట్టకూడదు. ప్రేమను పంచాలి. స్వేచ్ఛగా తిరగనివ్వాలి. నాకు ఇన్నాళ్లు మా అమ్మాన్నాలు చెప్పినా తెలియలేదు. కానీ నువ్వు నన్ను బోనులో ఉన్నట్లు ఊహించుకోమని అన్నావు కదా, అప్పుడు నా పొరపాటు అర్థమైంది’ అన్నాడు గోపి.

‘హమ్మయ్యా! ఇక లల్లీ బాధ తీరిపోయింది’ అంటూ నవ్వాడు వాళ్ల నాన్న. ‘లల్లీ! స్కూల్‌కు సమయం అవుతోంది. నేను ఇంటికి వెళ్తున్నాను. సాయంత్రం పార్కుకు వెళ్దాం’ అంటూ పరిగెత్తాడు గోపి. లల్లీ ఆనందంగా ఉడుతను దగ్గరకు తీసుకుని తల మీద నిమిరింది.

కె.వి.సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని