స్నేహం కోసం..!

రామాపురం ఊరి చివర ఒక అడవి ఉంది. అందులో ఉండే చెరువులో తాబేలు నివసిస్తుండేది. దానికి దగ్గర్లోనే గుహలో నక్క కూడా ఉండేది. ప్రతిరోజూ ఆ రెండూ అడవంతా తిరిగేవి.

Updated : 21 Dec 2023 06:00 IST

రామాపురం ఊరి చివర ఒక అడవి ఉంది. అందులో ఉండే చెరువులో తాబేలు నివసిస్తుండేది. దానికి దగ్గర్లోనే గుహలో నక్క కూడా ఉండేది. ప్రతిరోజూ ఆ రెండూ అడవంతా తిరిగేవి. అలా వెళ్లే క్రమంలో రెండూ కలుస్తూ.. ఉండేవి. కొన్ని నెలల తర్వాత వాటి మధ్య మంచి స్నేహం కుదిరింది. బయటికి వెళ్లి వచ్చాక, ఎంచక్కా చెరువు గట్టున కూర్చొని ఆహారం తింటూ.. కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఒకరోజు అలా మాట్లాడుతుండగా.. నక్కతో ‘నువ్వు చాలా తెలివైన దానివని విన్నాను. కానీ ఎప్పుడూ చూడలేదు. నీ బుద్ధిబలం ఏంటో ప్రత్యక్షంగా చూడాలని ఉంది’ అని అంది తాబేలు. దానికి నక్క నవ్వుతూ.. ‘నా తెలివి తేటలు ప్రదర్శించ దగినంత గొప్పవేం కాదులే. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక లక్షణం పుట్టుకతోనే వస్తుంది. అది ఏదో ఒక సమయంలో బయటపడుతుంది. అందరిలాగే నేను కూడా. అంతెందుకు నీది తాపీగా నడిచే తత్వం అని నువ్వు ఎవరికైనా చెప్పావా ఏంటి? నువ్వు నడిస్తే తెలియటం లేదూ.. అలాగే ఎప్పుడో ఒకప్పుడు నా తెలివి గురించి కూడా నీకు తెలుస్తుంది’ అని బదులిచ్చింది.

అవి రెండూ అలా మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడికి ఒక చిరుతపులి వచ్చింది. మాటల్లో పడి దాని రాకను తాబేలు, నక్క గమనించలేదు. దగ్గరగా వచ్చాక చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. హఠాత్తుగా వచ్చిన చిరుతను చూసి ఏం చేయాలో, ఎలా తప్పించుకోవాలో వాటికి తెలియలేదు. ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని.. చెరోవైపు వెళ్లసాగాయి. నక్క వేగంగా పరిగెత్తి తన గుహలో దాక్కుంది. కానీ పాపం తాబేలు మాత్రం మెల్లమెల్లగా చెరువు వైపు నడుస్తూ ఉంది. వేగంగా వెళ్లలేక చిరుత చేతికి చిక్కింది. అప్పుడు తాబేలు డిప్పలోపలికి వెళ్లిపోయింది. దాన్ని తినడానికి పళ్లతో కొరుకుతూ, నేలకేసి కొడుతూ, అటూఇటూ దొర్లిస్తూ.. చిరుత ప్రయత్నం చేసింది. కానీ దాని పైన డిప్ప బలంగా ఉండటంతో తాబేలుని తినడం దానికి సాధ్యం కాలేదు. ఇదంతా చూస్తున్న నక్క.. తన స్నేహితుడిని ఎలాగైనా రక్షించాలనుకుంది. చిరుత దాన్ని అటుఇటూ దొర్లించడం గమనించిన నక్క.. తాబేలును కాపాడటానికి ఇదే మంచి సమయం అని నిర్ణయించుకుంది. వెంటనే దానికి ఓ ఆలోచన వచ్చింది.

గుహలో నుంచి మెల్లగా.. పులిరాజా! అని పిలిచింది నక్క. అప్పుడు ‘ఎవరూ కనిపించడం లేదు.. కానీ, నన్ను పిలుస్తున్నారేంటి? నాతో ఏం పని’ అని ప్రశ్నించిందది. ‘నేను నీకు ఇప్పుడు కనిపించనులే. నా పేరు నక్క. నువ్వు తాబేలును తినాలనుకుంటున్నావు కదా. కానీ నీ వల్ల కావడంలేదు. నన్నేమీ చేయనంటే దాన్ని తినడానికి నీకో ఉపాయం చెబుతాను’ అని బదులిచ్చింది నక్క. దాని మాటలు నమ్మిన చిరుత ‘ఆలస్యం చేయకుండా ఆ ఉపాయమేంటో చెప్పు’ అంది. ‘సోదరా..! తాబేలు డిప్ప చాలా గట్టిగా, మందంగా ఉంటుంది. అంత తొందరగా అది ముక్కలవ్వదు. నేను చెప్పినట్లు చేస్తే నీకు కచ్చితంగా ఫలితం దక్కుతుంది. దాన్ని జాగ్రత్తగా దొర్లించుకుంటూ వెళ్లి, చెరువులో తోసేయ్‌. నీటితో తడిచి దాని పెంకు ఊడిపోతుంది. అప్పుడు నువ్వు సులభంగా దాన్ని తినొచ్చు’ అని చెప్పింది నక్క. చిరుత అది చెప్పిన విధంగానే తాబేలును చెరువు వరకు తీసుకెళ్లి, అందులో తోసేసింది. ఇదే మంచి సమయం అని.. వెంటనే అది ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్లి, దాక్కుంది. దాంతో చిరుత ఆశ్చర్యానికి గురైంది. నోటి వరకు వచ్చిన ఆహారాన్ని తినకుండా చేశావని నక్క మీద ఆగ్రహించింది. ఎప్పుడో ఒకసారి నువ్వు నాకు కనబడతావు కదా అప్పుడు నీ అంతు చూస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది చిరుత. ఈ విధంగా నక్క తెలివితేటలు ప్రత్యక్షంగా చూసిన తాబేలు.. ‘నువ్వు జిత్తులమారివి అంటే ఏమో అనుకున్నాను. కానీ, ఇప్పుడు నీ వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను. దానికి ఎప్పుడూ నీకు కృతజ్ఞతగా ఉంటాను.. ధన్యవాదాలు’ అని మనసులో అనుకుంది.

ఆదిత్య కార్తికేయ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని