సింహానికి నడక... జంతువులకు విందు!

గిరికోన అడవిని పాలించే మృగరాజు ఉదయాన్నే ఎక్కడికో బయలుదేరింది. దానికి ముందు ఎలుగుబంటి, కోతిని పిలిచి  ఏదో చెప్పింది. అవి రెండూ సరేనంటూ వెళ్లిపోయాయి. అది మాత్రం ఒంటరిగా ముందుకు నడిచింది. ఓ పక్క మంచు, చల్లగాలి!

Updated : 22 Dec 2023 04:51 IST

గిరికోన అడవిని పాలించే మృగరాజు ఉదయాన్నే ఎక్కడికో బయలుదేరింది. దానికి ముందు ఎలుగుబంటి, కోతిని పిలిచి  ఏదో చెప్పింది. అవి రెండూ సరేనంటూ వెళ్లిపోయాయి. అది మాత్రం ఒంటరిగా ముందుకు నడిచింది. ఓ పక్క మంచు, చల్లగాలి! ఆ సమయంలో కొండ వైపు వెళ్తున్న మృగరాజును చూసి... ‘రాజా.. ఉదయాన్నే చలిలో ఎక్కడికి పయనం’ అంది ఏనుగు.

‘ఏం.. చెబితేనే కానీ తోడు రావా’ అంది మృగరాజు. ‘ఎందుకు రాను ప్రభూ!’ అంటూ వెంటనే బయలుదేరిందది. ఆ రెండూ అడవిలో వెళ్తుంటే పక్షులన్నీ అటూ ఇటూ ఎగురుతున్నాయి. దారిలో కనిపించిన జంతువులను దాని సైగలతో రమ్మని పిలుస్తోంది ఏనుగు.

వాటికి ఎదురుగా వచ్చిన లేడి ‘ఏనుగు మావా ఎక్కడకు?’ అంది. ‘చెబితేనే వస్తావా?’ అని ప్రశ్నించిందది. ‘ఎంత మాట.. ఇదిగో వస్తున్నా’ అంటూ వాటిని అనుసరించింది లేడి. అలా దారిలో కుందేలు, దుప్పి, నక్క, తోడేలు కూడా మృగరాజుతో పాటుగా వెళ్లాయి.

ఇంకాస్త దూరం నడిచాక..‘ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్తున్నారు’ అంది తోడేలు, కుందేలుతో. ‘నాకేం తెలుసు.. లేడి రమ్మంటే వస్తున్నా’ అందది. ‘ఓ లేడి బావా.. ఉదయాన్నే ఎక్కడికి ఈ ప్రయాణం?’ అంది తోడేలు. ‘నాకేం తెలుసు ఏనుగు పిలిస్తే వెళుతున్నా’ అని బదులిచ్చిందది. మృగరాజు పక్కనే ఉండడంతో ఏనుగును అడిగే సాహసం చేయలేకపోయింది తోడేలు.

‘పొద్దు పొద్దున్నే ఇంత ముద్ద కూడా తినకుండా ఎక్కడికన్నా.. ఆకలితో కడుపు కాలిపోతోంది’ అంది నక్క మెల్లగా. ‘అందరికీ అలాగే ఉంది.. నోరుమూసుకుని రా!’ అంది తోడేలు. అలా మాట్లాడుతూనే.. అన్నీ కలిసి.. కొండ దగ్గరకు చేరాయి. అప్పటికే అక్కడ వైద్యం చేసే ఎలుగుబంటి, కోతి.. మృగరాజు కోసం వేచిచూస్తున్నాయి.

‘ఇప్పుడెలా ఉంది మృగరాజా..!’ అంది ఎలుగుబంటి. ‘కొంత పర్వాలేదు’ అంది సింహం. ‘అసలేం జరిగింది’ ఒత్తిడి తట్టుకోలేక అడిగింది ఏనుగు. ‘ఏం లేదు మావా. మృగరాజు నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు మాంసం తింటూనే ఉంది. రాత్రేమో గుహ దగ్గర అల్లరి చేస్తోందని అడవి పందిని వేటాడి తినేసింది. అది, ఇది కలిసి మృగరాజుకు అజీర్తి పట్టుకుంది. దానికి విరుగుడుగా కాస్త దూరం నడిస్తే సర్దుకుంటుందని ఎలుగుబంటి చెప్పింది. అందుకనే గుహ దగ్గర నుంచి ఇలా కొండ దాకా నడిచి వచ్చింది. ఇక ఇక్కడి నుంచి గుహ దాకా నడిస్తే పూర్తిగా అరిగి, కడుపు నొప్పి తగ్గుతుందట’ అంది కోతి.

‘వామ్మో... మేం ఉదయం నుంచీ ఏమి తినలేదే.. ఇక కాసేపు పోతే ఆహారం కూడా దొరకదు. ముందే చెబితే మా ఏర్పాట్లేవో మేం చేసుకుని వచ్చే వాళ్లం కదా!’ అంది నక్క. ‘నాకు తెలుసు.. ఒక్కరోజు కూడా మీరు మృగరాజైన నా కోసం ఉపవాసం ఉండలేరని, అందుకనే ఎలుగు, కోతికి చెప్పి విందు ఏర్పాటు చేశాను. కొండ ఆవలికి నడవండి’ అంది మృగరాజు.  

‘విందు అనగానే.. జంతువులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. హమ్మయ్యా! నడిచి వస్తే వచ్చాం కానీ, కమ్మని విందు ఆరగించి పోదాం’ అంటూ అవన్నీ కొండ వైపు నడిచాయి. ‘మామా.. ఇక్కడ విందు చేసి మళ్లీ మన ఇంటికి నడిచేసరికి తిన్నది అరిగిపోతుంది. ఇక రాత్రికి నిద్ర పట్టదుగా! అప్పుడేం చేద్దాం..’ అంది కుందేలు నక్కతో.

‘అరరే.. నిజమే.. ఎందుకైనా మంచిది నువ్వు నా పక్కనే, నాకు అందుబాటులో ఉండు’ అంది నక్క నవ్వుతూ. ‘అయ్య బాబోయ్‌..!’ అంటూ దూరంగా జరిగిందది.  

జంతువులన్నీ విందు స్థానానికి చేరుకున్నాయి. అవి కలిసి ఆహారం తింటుండగా మృగరాజు... ‘చూశారా.. అందరం కలిసి ఉంటే ఎంత బాగుంటుందో. అవసరం మేరకే వేటాడాలి. లేకుంటే జంతువుల సంఖ్య తగ్గిపోతుంది. నాకొచ్చినట్టుగా అజీర్తి వస్తుంది. కనుక ఇక నుంచి అనవసర వేటను మానండి. నేను కూడా అలాగే చేస్తాను. శాకాహార జీవులు కూడా మితంగానే తినాలి. లేకపోతే అడవిలో పచ్చదనం తగ్గిపోతుంది’ అంది సింహం. ‘నిజమే రాజా..! అన్నీ కలిసి ఉంటేనే ఆనందం. భయం భయంగా బతుకు వ్యర్థం’ అంది లేడి. జంతువులన్నీ సరే అనడంతో విందుభోజనం ఘనంగా ముగిసింది.

కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు