ఇంతకీ వికారి మారిందా?

అనగనగా ఒక పెద్ద అడవి. అందులో కుందేలు, జింక, నక్క, తోడేలు వంటి జీవులతో పాటుగా సింహాలు, పులులు కూడా ఉండేవి. ఒకరోజు పొదల్లో కూర్చొని క్యారెట్‌ తింటున్న కుందేలు, అటుగా వస్తున్న వికారి అనే నక్కను చూసి ఆశ్చర్య పోయింది. అది పేరుకు తగ్గట్టుగానే జిత్తులమారిది.

Updated : 23 Dec 2023 04:25 IST

అనగనగా ఒక పెద్ద అడవి. అందులో కుందేలు, జింక, నక్క, తోడేలు వంటి జీవులతో పాటుగా సింహాలు, పులులు కూడా ఉండేవి. ఒకరోజు పొదల్లో కూర్చొని క్యారెట్‌ తింటున్న కుందేలు, అటుగా వస్తున్న వికారి అనే నక్కను చూసి ఆశ్చర్య పోయింది. అది పేరుకు తగ్గట్టుగానే జిత్తులమారిది. మిగతా జంతువుల మధ్య ఎప్పుడూ గొడవలు పెట్టాలని చూసేది. అందుకే మృగరాజు గతంలో దాన్ని అడవి నుంచి బహిష్కరించింది. కానీ మళ్లీ అది వస్తుండటంతో భయపడిన కుందేలు.. ఒక్క పరుగులో దూరంగా ఉన్న జింక వద్దకు వెళ్లి విషయం చెప్పింది. ‘అమ్మో అది వచ్చిందంటే.. మళ్లీ మన మధ్య చిచ్చు పెడుతుంది. ఈ వికారి సంగతి వెంటనే మృగరాజుకు చెబుదాం పద’ అని కంగారుగా అంది జింక. రెండూ కలిసి మృగరాజు వద్దకు బయలుదేరాయి. వాటికి దారిలో ఎదురైన ఎలుగుబంటి ‘ఏమైంది? ఎందుకలా పరుగులు పెడుతున్నారు?’ అని ప్రశ్నించింది. జింక జరిగిన విషయాన్ని వివరించడంతో.. ‘పదండి నేను కూడా మీతో పాటు వస్తాను’ అంటూ బయలుదేరిందది. అలా వెళ్తుండగా.. దారి మధ్యలో కలిసిన ఏనుగు ఇతర చిన్నచిన్న జీవులన్నీ మృగరాజు వద్దకు చేరుకున్నాయి.

ఈ జంతువులన్నీ వెళ్లేసరికే.. వికారి మృగరాజు వద్ద ఉంది. సింహంతో పాటుగా మిగతా జీవులన్నీ దాన్ని కోపంగా చూస్తున్నాయి. అప్పుడు మంత్రి కోతి ‘వికారీ.. మళ్లీ ఎందుకు నువ్వు ఈ అడవిలోకి వచ్చావు? నీ రాకతో జీవులన్నీ భయాందోళనకు గురవుతున్నాయి. ఆ విషయం చెప్పడానికే అవన్నీ కలిసి మృగరాజు దగ్గరకు వచ్చాయి’ అని అంది. మృగరాజుతో సహా జంతువులన్నీ వికారి సమాధానం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అప్పుడది మృగరాజు వైపు దీనంగా చూస్తూ.. ‘రాజా! ఇప్పుడు నా పేరు వికారి కాదు..విహారి! పేరుతో పాటుగా, నా తీరు కూడా మార్చుకున్నాను. పూర్తిగా మారిపోయి మీ అందరితో కలిసి ఉందామని వచ్చాను’ అని బదులిచ్చింది. దాని వైపు కాసేపు అలాగే చూసిన మృగరాజు.. ‘వికారి మాటలు అంతా విన్నారు కదా! దాన్ని మనలో కలుపుకోవడం మీకు సమ్మతమేనా? మనతో కలసి ఉండనిద్దామా?’ అని అక్కడున్న జంతువులను అడిగింది.

దాంతో అవన్నీ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాయి. కాసేపటి తర్వాత కుందేలు.. ‘మారిన వికారికి మనతో కలిసి ఉండే అవకాశం కల్పిద్దాం. ఇదే మా అందరి అభిప్రాయం మృగరాజా!’ అంది. అంతలోనే అక్కడే చెట్టు మీదున్న సంచారి అనే కాకి.. ‘ఆ వికారి మాటలు నమ్మొద్దు. మళ్లీ మీతో కలుపుకోవద్దు’ అని గట్టిగా అంది. ఒక్కసారిగా జంతువులన్నీ చెట్టు పైకి చూశాయి. అప్పుడది ఎగురుతూ.. ఆ జీవుల మధ్యలోకి వచ్చి ‘పేరు మార్చుకున్నంత మాత్రాన.. తీరు మారదు’ అంది వికారి వైపు చూస్తూ. ‘ఇక్కడున్న జీవులన్నీ వికారిని స్వాగతిస్తున్నాయి.. మీరు ఆ కాకి మాటలు పట్టించుకోవద్దు మృగరాజా!’ అని చెప్పింది కుందేలు. అప్పుడు మృగరాజు ‘వికారిని ఎందుకు ఉండనివ్వాలో ఒక్క కారణం చెప్పండి’ అని అన్ని జీవుల వైపు చూస్తూ అడిగింది. ‘చేసిన తప్పును ఒప్పుకొని, తన తీరు మార్చుకున్నానని చెప్పింది. అంతకన్నా ఇంకేం కావాలి మృగరాజా!’ అని జవాబిచ్చింది కుందేలు. ఇప్పుడు నువ్వు చెప్పు సంచారీ.. ‘వికారిని ఎందుకు తిరస్కరిస్తున్నావో?’ అని అడిగింది మృగరాజు. ‘అది ఇక్కడి నుంచి వెళ్లాక.. హమ్మయ్య అనుకున్నారు. కానీ మృగరాజు నాకు దాన్ని గమనిస్తూ ఉండమని చెప్పింది. దాంతో నేను వికారి ఎటు వెళ్తుందో? ఏం చేస్తుందోనని ప్రతిరోజూ అనుసరిస్తూనే ఉన్నాను. అది పక్క అడవిలోకి వెళ్లింది. దాని బుద్ధిని ఏమాత్రం మార్చుకోకుండా అక్కడ కూడా జంతువుల మధ్య చిచ్చు పెట్టింది. దాంతో అక్కడ కూడా నివాసం కోల్పోయింది. ఇక ఏ దిక్కులేక మళ్లీ ఇక్కడికే వచ్చింది. అది మారిపోయానని చెప్పడం అబద్ధం’ అని చెప్పింది కాకి.

దాని మాటలు విన్న జీవులన్నీ వికారిని కోపంగా చూశాయి. అప్పుడు మృగరాజు.. ‘వికారీ..! నువ్వు మారతావేమోనని ఇక్కడి నుంచి పంపించాను. కొన్నిరోజులు చూసి నేను మళ్లీ తీసుకొద్దామని అనుకున్నాను. కానీ నీ ప్రవర్తనలో ఎలాంటి మార్పులేదు. ఇక ఎప్పటికీ నీకు ఈ అడవిలో స్థానం లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో’ అంది. దాంతో వికారి చేసేదేం లేక అక్కడి నుంచి వెనుదిరిగింది. దాని గురించి తెలుసుకోవడానికి సహకరించిన సంచారికి ఆ అడవిలోని జీవులతో పాటు మృగరాజు కూడా కృతజ్ఞతలు తెలిపింది.

కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని