నాటకం వేస్తున్నాం.. రారండి!

అభిరామ్‌ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతనికి నటన అంటే చాలా ఇష్టం. స్నేహితులు, ఇంట్లో వాళ్ల ముందు డైలాగ్స్‌ చెబుతూ, పెద్ద పెద్ద నటులను అనుకరిస్తూ.. చాలా బాగా నటించేవాడు.

Updated : 24 Dec 2023 07:06 IST

భిరామ్‌ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతనికి నటన అంటే చాలా ఇష్టం. స్నేహితులు, ఇంట్లో వాళ్ల ముందు డైలాగ్స్‌ చెబుతూ, పెద్ద పెద్ద నటులను అనుకరిస్తూ.. చాలా బాగా నటించేవాడు. ఎప్పటికైనా వేదిక మీద నటించాలని తన కోరిక. ఒకరోజు తెలుగు పీరియడ్‌ జరుగుతుండగా.. అటెండర్‌ రామయ్య ఓ కాగితం తీసుకొని తరగతి గదిలోకి వచ్చాడు. అదేమిటా అని పిల్లలంతా ఆసక్తిగా చూస్తున్నారు.

ఆ కాగితాన్ని తీసుకున్న టీచర్‌.. ‘వచ్చే నెల మన పాఠశాల వార్షికోత్సవం నిర్వహించబోతున్నారు. పాటలు, నాటకం, మిమిక్రీ, మ్యాజిక్‌ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని అనుకునే వాళ్లు, మూడు రోజుల్లో పేర్లు నమోదు చేసుకోవాలి’ అని చెప్పారు. నాటకం అని వినగానే.. అభిరామ్‌కు ఆనందం కలిగింది. వెంటనే లేచి ‘టీచర్‌..! నేను నాటకం వేస్తాను’ అన్నాడు.

‘నాటకం అంటే ఒక్కరే వేసేది కాదు అభి. దేనికి సంబంధించిన నాటకం వేయాలి, ఆ స్క్రిప్టు, అందులోని ఏ పాత్ర ఎవరు వేస్తారు... ఇలా ఇవన్నీ చర్చించుకోవాలి. అందుకే మూడు రోజుల సమయం ఇచ్చారు’ అని నవ్వుతూ బదులిచ్చారు టీచర్‌. ఆమె మాటలకు అలాగేనంటూ కూర్చున్నాడు ఆ అబ్బాయి.

ఇంతలోనే భోజన విరామ సమయమైంది. అభి తన స్నేహితులందరితో నాటకం గురించి చర్చించాడు. అందులో అయిదుగురు నటించడానికి అంగీకరించారు. ‘సాంఘిక నాటకాలు చాలా మందే వేస్తారు. మనం పౌరాణికం వేద్దాం’ అని చాలా ఉత్సాహంగా అన్నాడు. ‘పౌరాణికమా?! మన వల్ల అవుతుందా?’ అని కాస్త భయంగా అన్నాడు బాలు. ‘మరేం పర్లేదు.. వచ్చే నెల కదా! పద్యాలు ఏమీ ఉండవు. సంభాషణలు కూడా తేలిగ్గా ఉండేలా రాయించుకుందాం’ అని ధైర్యం చెప్పాడు అభి.
‘ఏ నాటకమైనా సరే కానీ, నేను హీరో పాత్ర మాత్రమే వేస్తాను’ అన్నాడు తేజ. ‘నేనూ అంతే’ అంటూ వంతపాడాడు వేణు. ‘హీరో కాకపోయినా, దుష్ట పాత్రలు మాత్రం నేను వేయను’ అన్నాడు కార్తిక్‌. ‘ఒకటీ, అరా సంభాషణలు ఉండే పాత్రలు అయితే నేను వేయను’ అన్నాడు ప్రసాద్‌.
‘అలా అంటే ఎలా?’ అని అభిరామ్‌ దిగులుగా అంటుండగానే గంట కొట్టారు. అంతా తరగతి గదికి పరిగెత్తారు. ఇంటికెళ్లాక అభిరామ్‌, నాటకం, స్నేహితుల అభిప్రాయాల గురించి నాన్నకు చెప్పాడు. ‘రేపు ఆదివారమేగా, మీ స్నేహితులను మన ఇంటికి రమ్మను. నేను వాళ్లకు అర్థమయ్యేలా చెబుతాను’ అన్నాడు. అభి తన స్నేహితులతో ‘రేపు మీరంతా మా ఇంటికి రండి, తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. భోజనం కూడా మా ఇంట్లోనే’ అని చెప్పాడు. అంతా సరే అన్నారు. మర్నాడు పన్నెండు గంటల కల్లా అంతా వచ్చేశారు. తన స్నేహితులకు తండ్రిని పరిచయం చేశాడు. అందరినీ పేరు పేరునా పలకరిస్తూ, వాళ్ల ఇష్టాలు, అభిరుచులు అడుగుతూ, సరదా కబుర్లు చెబుతూ అభీ వాళ్ల నాన్న.. ‘మనం ఇప్పుడు మాయాబజార్‌ సినిమా చూద్దాం. చాలా బాగుంటుంది’ అన్నారు. అంతా ఉత్సాహంగా తల ఊపారు.
శశిరేఖ పుట్టిన రోజు వేడుకతో మొదలైన సినిమాను అందరూ ఇష్టంగా చూడసాగారు. ప్రతీ సన్నివేశం ఎంతో బాగుంది. ఘటోత్కచుడి పాత్ర వారిని విపరీతంగా ఆకట్టుకుంది. శ్రీకృష్ణుడు సరే సరి, అందరికీ అభిమానపాత్రుడే. చిత్ర, విచిత్ర విద్యల గురువు, నోరే తిరగని శిష్యులు, శకుని.. ఇలా ఒకటేమిటి అన్ని పాత్రలూ వేటికవి మనసు దోచుకున్నాయి. పాటలన్నీ గొప్పగా ఉన్నాయి. ఆశ్చర్యం, ఆనందం, తమాషాలు, నవ్వులే నవ్వులు. సినిమా అయిపోగానే... ‘ఎలా ఉంది?’ అని అడిగారు అభి వాళ్ల నాన్న. ‘చాలా బాగుంది’ అని అంతా ఒకేసారి బదులిచ్చారు. ‘ఏ పాత్ర నచ్చింది?’ అని ఒక్కొక్కరిని అడిగారు. ‘ఘటోత్కచుడు, శశిరేఖ, శకుని... ఇలా అన్ని పాత్రలూ బాగున్నాయి’ అన్నాడు తేజ.. మిగిలిన వాళ్లు కూడా అదే సమాధానం చెప్పారు.
‘చూశారా.. మీరు చెప్పిన పాత్రలు హీరోలు కాదు కదా..! కానీ ఆ పాత్రల ప్రత్యేకత అంతగా ఆకట్టుకుంది. సినిమా అయినా, నాటకమైనా హీరో ఒక్కడే ముఖ్యుడు అనుకోవడం పొరపాటు. మనిషి ఆకారాన్ని బట్టి, వాచకం తీరు మొదలైనవన్నీ దృష్టిలో ఉంచుకుని పాత్ర ఎంపిక ఉంటుంది. పాత్రను బాగా అర్థం చేసుకుని, దానికి తగ్గ హావభావాలతో, ప్రత్యేకమైన శైలితో నటించి ప్రేక్షకులను మెప్పించిన వాడే మంచి నటుడు అవుతాడు. ఇవేవీ ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ హీరో పాత్రే కావాలని, సంభాషణలు బాగా ఎక్కువగా ఉండాలని అనుకుంటే నాటకం వేయడం ఎలా కుదురుతుంది? ఇక దుష్ట పాత్రల సంగతి.. అవి ఉంటేనే కదా మంచికి గుర్తింపు. దుష్ట పాత్రను కూడా సమర్థవంతంగా అభినయిస్తే నటుడిగా మంచి పేరు వస్తుంది. ఆ పాత్రలు వేసి మెప్పించడం ఆషామాషీ కాదు. విదూషకులు కూడా అంతే.. మాటలు, చేతలతో బాగా నవ్వించగలగాలి. మిమ్మల్నందరినీ నేను ఇవాళ బాగా గమనించాను కాబట్టి, మీకు తగినట్లుగా ఉండే నాటకం ఆలోచించి రాసి ఇస్తాను. మీరంతా చెప్పినట్లు విని, బాగా సాధన చేయాలి. సరేనా?!’ అన్నారు అభి వాళ్ల నాన్న. ‘అలాగే.. మీరు చెప్పినట్లే చేస్తాం’ అన్నారు సంతోషంగా.  అభిరామ్‌ స్నేహితులందరినీ చేతులు కలపమని, ఇవాళ నుంచి మనమంతా ఒక జట్టు అన్నాడు.

జె.శ్యామల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని