రాక్షసుడి గురక!

పూర్వం కాకులకొండకు దిగువన రాయపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊరి నుంచి పట్టణానికి ఏదైనా పని మీద వెళ్లాలంటే కొండ చుట్టూ తిరిగి పదిమైళ్లు వెళ్లాలి.

Published : 25 Dec 2023 00:03 IST

పూర్వం కాకులకొండకు దిగువన రాయపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊరి నుంచి పట్టణానికి ఏదైనా పని మీద వెళ్లాలంటే కొండ చుట్టూ తిరిగి పదిమైళ్లు వెళ్లాలి. అది గ్రామస్థులకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకరోజు రత్నయ్య అనే బక్కరైతు పట్టణానికి వెళ్లాడు. అక్కడ పని పూర్తి చేసుకుని తిరిగి గ్రామానికి బయలుదేరేసరికి బాగా పొద్దుపోయింది. బిక్కుబిక్కుమంటూ అడవిగుండా నడక సాగించాడు. కొండ దగ్గరికి వచ్చేసరికి మరీ చీకటి పడిపోయింది.

అంత చీకట్లో కొండ చుట్టుకుని వెళ్లి, గ్రామం చేరడం మంచిది కాదు. రాత్రిళ్లు క్రూరమృగాల సంచారం కూడా ఎక్కువే. అందుకని రాత్రికి కొండకు దిగువన ఉన్న పెద్దబండ మీదకు వెళ్లి పడుకున్నాడు. అర్ధరాత్రి కొండ గుహ నుంచి పెద్ద శబ్దం రావడం ప్రారంభమైంది. ఆ ధ్వనికి రత్నయ్యకు నిద్రాభంగమైంది. వెంటనే లేచి కూర్చున్నాడు. ఎంతకీ శబ్దం ఆగలేదు. రానురాను ఆ ధ్వని పెరిగిందే తప్ప తగ్గలేదు. తెల్లవారేదాకా రత్నయ్య అలాగే బండ మీద కూర్చుని కాలం గడిపాడు.

ఉదయమైన తర్వాత ఇక గ్రామానికి బయలుదేరుదామని రత్నయ్య బండ పై నుంచి దిగాడు. అప్పుడే కొండ గుహలో నుంచి ఒక మహాకాయుడు బయటకు వచ్చాడు. వాణ్ని చూడగానే రత్నయ్యకు పై ప్రాణాలు పైనే పోయాయి. వాడొక బ్రహ్మరాక్షసుడు. వాడికి రత్నయ్య ఒక ఎముకల గూడులా కనిపించాడు. అందుకే రత్నయ్యను తినాలన్న ఆలోచన వాడికి కలగలేదు.

‘ఎవరు నువ్వు ఇక్కడేం పని?’ అంటూ రాక్షసుడు హూంకరించాడు. భయపడడం వల్ల లాభం లేదనుకున్నాడు రత్నయ్య. ధైర్యాన్ని కూడగట్టుకుని... ‘అయ్యా! తమరెవరో తెలుసుకోవచ్చా! ఇంతకుముందెపుడూ ఇక్కడ మీ ఉనికి గురించి ఎవరూ చెప్పుకోగా వినలేదు’ అన్నాడు. ‘చూస్తుంటే తెలియడం లేదా! నేను రాక్షసుణ్ని. నన్ను చూసిన మానవులు సహజంగా గుండె పగిలి చస్తారు. నువ్వు బక్కగా ఉన్నా నీ గుండె మాత్రం బలంగా ఉంది. అందుకే ఇంకా బతికే ఉన్నావు’ అన్నాడు.
‘అది సరేకానీ రాత్రంతా గుహలోనుంచి భయంకరంగా శబ్దం వచ్చిందేంటి?’ అన్నాడు రత్నయ్య. ‘ఓ.. అదా! అందుకే కదా! నేను కుటుంబాన్ని వదిలి వచ్చి, రాత్రిళ్లు ఈ గుహలో నిద్రిస్తోంది. నేను పెట్టే గురక వల్ల నా భార్యాపిల్లలకు నిద్రాభంగం అవుతోందట. అందుకని నేనీ గుహను వెతుక్కుని రాత్రిళ్లు ఇందులో నిద్రపోయి పగలు అడవిలో ఉన్న నా కుటుంబం దగ్గరకు పోతుంటాను’ అన్నాడు.
‘ఆఁ..! అదీ సంగతి. తేరగా దొరికిన జంతువునల్లా తిని, పనీపాటా లేక తొంగుంటే ఒళ్లు వస్తుంది. గురకా వస్తుంది’ అని తొందరపాటులో అనేసి, తర్వాత నాలుక కరుచుకున్నాడు రత్నయ్య. కోపం వచ్చి రాక్షసుడు తనను తినేస్తాడేమో అని  భయపడ్డాడు.
కానీ రాక్షసుడు.. ‘బాబ్బాబూ, నీకు పుణ్యం ఉంటుంది. ఒళ్లు తగ్గే మార్గం ఉంటే చెప్పు. కచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా అయినా నేను నా కుటుంబానికి దగ్గరవుతాను’ అంటూ ప్రాధేయపడ్డాడు. రత్నయ్య కాసేపు ఆలోచించి.. ‘నేను నీకొక పని చెప్తా. అది చేశావంటే నీకు ఒళ్లూ తగ్గుతుంది. గురకా పోతుంది. అదేంటంటే... కొండకు ఇటువైపు నుంచి అటు దిక్కుకు సొరంగం తవ్వు’ అన్నాడు. ‘ఆ పని చేస్తే నా ఒళ్లు తగ్గుతుందా?’ అన్నాడు రాక్షసుడు. ‘తప్పకుండా తగ్గుతుంది. తిండికి తగ్గ పని ఉండాలి ఎవరికైనా. అలా లేనందుల్లే నీకు అంత పెద్ద శరీరమూ, హోరుగాలిలాంటి గురకానూ’ అన్నాడు రత్నయ్య.
‘అయితే నువ్వు చెప్పిన పని చేస్తా. నా చేతికి సరిపోయే గునపం తీసుకురా పో’ అన్నాడు రాక్షసుడు. రత్నయ్య, గ్రామస్థుల సాయంతో రాక్షసుడి చేతికి సరిపోయే పెద్దగునపం తయారు చేయించి తీసుకొచ్చి ఇచ్చాడు. వాడు పొద్దస్తమానం కొండను తవ్వడమే పనిగా పెట్టుకున్నాడు. సరిగ్గా నెల తిరిగేసరికి సొరంగం పూర్తైంది. గ్రామస్థుల ఆనందానికి అంతేలేదు. రాక్షసుడి సంతోషానికీ హద్దుల్లేవు. ఎందుకంటే సగానికిసగం బరువు తగ్గిపోయాడు. శరీరం తేలికగా అనిపించసాగింది. గురక ఎటుపోయిందో తెలియదు. పని చేయడంలో ఇంత సుఖం ఉందా అని మొదటిసారి వాడికి అనిపించింది. రత్నయ్యకు కృతజ్ఞతలు చెప్పి అడవిలో ఉన్న కుటుంబం దగ్గరకు వెళ్లిపోయాడు. ఆరోగ్య రహస్యం చెప్పి రాక్షసుడికి సాయం చేయడమేగాక, తన తెలివితేటలతో గ్రామానికి ఎనలేని మేలు చేసిన రత్నయ్యను గ్రామస్థులు ఎంతగానో మెచ్చుకున్నారు.

డా.గంగిశెట్టి శివకుమార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు