మూడో తరగతి పిల్లలు!

మూడో తరగతి పిల్లలందరూ మాలతి టీచర్‌ రావడంతో లేచి నిలబడి.. ‘గుడ్‌ మార్నింగ్‌ టీచర్‌’ అన్నారు. ‘గుడ్‌ మార్నింగ్‌ పిల్లలూ! ఈ రోజు మనం ఒక కొత్త ఆట ఆడుకుందాం’ అన్నారు టీచర్‌. ఆట అనగానే పిల్లలందరి ముఖాలు అరవిరిసిన పూవుల్లా వికసించాయి. టీచర్‌ వచ్చేటప్పుడు తనతో ఒక డబ్బా తీసుకువచ్చారు. ‘సీతా! ఇలా రా... ఇందులో నుంచి ఒక వస్తువు తీసి పట్టుకుని ఎలా అనిపిస్తుందో చెప్పు’ అన్నారు టీచర్‌.  

Published : 26 Dec 2023 00:08 IST

మూడో తరగతి పిల్లలందరూ మాలతి టీచర్‌ రావడంతో లేచి నిలబడి.. ‘గుడ్‌ మార్నింగ్‌ టీచర్‌’ అన్నారు. ‘గుడ్‌ మార్నింగ్‌ పిల్లలూ! ఈ రోజు మనం ఒక కొత్త ఆట ఆడుకుందాం’ అన్నారు టీచర్‌. ఆట అనగానే పిల్లలందరి ముఖాలు అరవిరిసిన పూవుల్లా వికసించాయి. టీచర్‌ వచ్చేటప్పుడు తనతో ఒక డబ్బా తీసుకువచ్చారు. ‘సీతా! ఇలా రా... ఇందులో నుంచి ఒక వస్తువు తీసి పట్టుకుని ఎలా అనిపిస్తుందో చెప్పు’ అన్నారు టీచర్‌.  

సీత లేచి నిలబడింది కానీ ముందుకు కదలలేదు. ఆ పక్కనే కూర్చున్న దివ్య లేచి వచ్చింది. ‘నేను తీస్తాను మేడం’ అంటూ పెట్టెలో నుంచి టెడ్డీబేర్‌ బొమ్మను తీసింది. ‘ఇది చాలా మృదువుగా అనిపిస్తోంది మేడం’ అంది దివ్య. ‘అవును అలా మృదువుగా అనిపించే మరో వస్తువు పేరు చెప్పు’ సీత వైపు చూస్తూ అన్నారు టీచర్‌.

‘మేడం! బాగా చిన్నపిల్లలు కప్పుకునే దుప్పటి ఇలాగే ఉంటుంది’ కాసేపు ఆలోచించి అంది దివ్య. ‘అవును దివ్యా! నువ్వు సరిగ్గా చెప్పావు’ అంది టీచర్‌. ‘రవీ! ఇప్పుడు నువ్వు రా’ అని పిలిచారు టీచర్‌. డబ్బాలో నుంచి మరో వస్తువు తీశాడు రవి. ‘ఇది రాయి మేడం! గట్టిగా ఉంది’ అన్నాడు. ‘అవును రవీ! అలా గట్టిగా ఉన్న వస్తువుల పేరు చెప్పు’ అన్నారు టీచర్‌. ‘క్రికెట్‌ బాల్‌’ అన్నాడు రవి. ‘అవును... నువ్వు సరిగ్గా చెప్పావు రవీ’ అన్నారు టీచర్‌.

‘సీతా! ఇలా వచ్చి నువ్వో వస్తువు తీసి, అది ముట్టుకుంటే నీకు ఎలా అనిపిస్తుందో చెప్పు’ అన్నారు టీచర్‌. సీత మళ్లీ లేచి నిలబడి మొహమాటపడుతూ ఆగిపోయింది.

‘తను వాచ్‌మెన్‌ కూతురు. వాళ్లు పేదవారు, వాళ్ల ఇంట్లో ఏమీ ఉండవు మేడం. నేను వస్తాను’ అంటూ చిట్టి లేచి వచ్చింది. ‘ఇది చలువరాయి మేడం. ఇది సున్నితంగా జారుతున్నట్లు అనిపిస్తుంది మేడం’ అంది. అలాంటివి నీకు తెలిసినవి చెప్పు చిట్టీ.. అని సీత వైపు చూస్తూ అన్నారు టీచర్‌. ఒక క్షణం ఆలోచించి.. ‘గులక రాళ్లు, గోలీలు’ అంది చిట్టి.  

‘సరిగ్గా చెప్పావు చిట్టీ. ఇప్పుడు నువ్వు రా సిరీ’ అని పిలిచారు టీచర్‌. ‘ఇది కర్ర మేడం. ముట్టుకుంటే గరుకుగా ఉంది’ అంటూ మరో వస్తువు తీసింది సిరి. ‘అవును సిరీ... కర్ర నిర్మాణం గరుకుగా ఉంటుంది. ఇలాంటి వస్తువులు నీకు ఏం తెలుసు?’ అన్నారు టీచర్‌. ‘బూజు దులిపే చీపురు గరుకుగా ఇలాగే ఉంటుంది మేడం’ అంది సీత కూర్చున్న చోటు నుంచే.

‘సరిగ్గా చెప్పావు సీతా. కర్ర, బూజు దులిపే చీపురు గరుకు నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు బుజ్జి నువ్వు’ అన్నారు టీచర్‌. ‘మేడం! ఇది దూది ఉండ. చాలా మెత్తగా ఉంది’ అంది బుజ్జి. ‘అవును బుజ్జీ దూది నిర్మాణం మెత్తగానే ఉంటుంది. అలాంటిది మరోటి చెప్పు’ అన్నారు టీచర్‌. ‘పీచు మిఠాయి’ అని తడుముకోకుండా వెంటనే లేచి నిలబడి చెప్పింది సీత. ‘నువ్వు సరిగ్గా చెప్పావు సీతా! ఇప్పుడు ఇక్కడకు నువ్వు రావాలి’ అని పిలిచారు టీచర్‌. సీత సంశయిస్తూ అక్కడే నిలబడింది.

చిన్నూ లేచి వచ్చి డబ్బాలో నుంచి అరటి పండు తొక్క తీశాడు. ‘మేడం! అరటి పండు తొక్క జారుతున్నట్లుగా ఉంది. అచ్చు సబ్బు బిళ్లలా’ అన్నాడు చిన్నూ. ‘అవును చిన్నూ!’ అన్నారు టీచర్‌. ‘ఇప్పుడు మళ్లీ డబ్బాలో వస్తువు తీయడానికి ఎవరు వస్తారు?’ అన్నారు టీచర్‌. లల్లి వచ్చి డబ్బాలో నుంచి ఒక స్పాంజ్‌ తీసింది. ‘మేడం! ఇది భలే మెత్తగా ఉంది. అచ్చు నేను ఆడుకునే మట్టిలాగా ఉంది’ అంది లల్లి.

‘అవును లల్లీ! నువ్వు సరిగ్గా చెప్పావు’ అన్నారు టీచర్‌. ‘మేడం! మా కోడి పిల్లను ముట్టుకుంటే కూడా మెత్తగానే ఉంటుంది’ అంది సీత. అక్కడున్న పిల్లలందరూ ఒక్కసారే ఘొల్లున నవ్వారు. ‘పిల్లలూ! మీరంతా సీతను హేళన చేస్తున్నారు. కానీ సీత చెప్పిన జవాబు సరైనదే. మీరంతా ఒకటే! బీద, గొప్ప తారతమ్యం ఉండకూడదు. మీకు తెలిసిన ఉదాహరణలు మీరు చెప్పారు. సీతకు తెలిసినవి సీత చెప్పింది’ అన్నారు టీచర్‌. సీత ముఖం వెలిగిపోయింది. పిల్లలందరూ తప్పు చేసినట్లు తలలు దించుకున్నారు.

‘సీతా! చివరగా మరొకటి మిగిలి ఉంది. ఇప్పటికైనా నువ్వు వచ్చి తీయి’ అంది టీచర్‌. సీత గబా గబా వచ్చి డబ్బాలో నుంచి ఒక చిన్న గిన్నె బయటకు తీసింది. ‘మేడం! ఇందులో పంచదార ఉంది. ఇది గరుకుగా, నేను ఆడుకునే ఇసుక లాగా ఉంది’ అంది సీత.

‘అవును సీతా! పంచదార, ఇసుక గరుకు నిర్మాణాన్ని కలిగి ఉంటాయి’ అంది టీచర్‌. ‘మేడం! ఇక నుంచి సీతను వాచ్‌మెన్‌ కూతురుగా కాకుండా మాలో ఒకరిగా చూస్తాం. మా తప్పు తెలుసుకున్నాం’ అని పిల్లలంతా ఒకటిగా అన్నారు. సీత ముఖంలో నవ్వు చూసిన టీచర్‌ అనందపడ్డారు.

కేవీ.సుమలత


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని