మృగరాజు తీర్పు!

ఒక అడవిలో ఎన్నో రకాల క్రూరమృగాలు, సాధుజంతువులతో పాటు కొన్ని రకాల పక్షులు ఉండేవి. అడవికి రాజు సింహం. జంతువులు, పక్షులను ఎంతో ప్రేమగా చూసుకునేది. అంజి అనే కోతి మంత్రిగా ఉండేది.

Published : 27 Dec 2023 00:46 IST

క అడవిలో ఎన్నో రకాల క్రూరమృగాలు, సాధుజంతువులతో పాటు కొన్ని రకాల పక్షులు ఉండేవి. అడవికి రాజు సింహం. జంతువులు, పక్షులను ఎంతో ప్రేమగా చూసుకునేది. అంజి అనే కోతి మంత్రిగా ఉండేది. ఒకసారి ఒక కాకి సింహం దగ్గరకు వచ్చి... ‘మహారాజా! నా రూపం బాగుండదు. నా గొంతు కూడా వినసొంపుగా ఉండదు. నేను ఏ చెట్టు కొమ్మ మీద వాలినా... చిలుక, పావురం, కోకిల నన్ను బాగా ఏడిపిస్తున్నాయి. నేను వేరే చోటుకు వెళ్లిపోదామనుకుంటున్నాను. నాకు అనుమతి ఇవ్వండి’ అని దీనంగా అడిగింది.  

‘కాకి మిత్రమా! రేపటి వరకు ఆగు.. నీ సమస్యకు ఓ పరిష్కారం చూపుతాను’ అని అంది సింహం. మరుసటి రోజు చిలుక, పావురం, కోకిలతో పాటు ఆ కాకిని కూడా రమ్మని కబురుపెట్టింది సింహం. ‘నేస్తాలూ! మన గాడిద మిత్రుడికి బాగా జబ్బు చేసింది. పక్క అడవిలో నా స్నేహితుడైన ఎలుగుబంటి ఉంది. అది ఏ జబ్బుకైనా మంచి చికిత్స చేస్తుంది. గాడిద ప్రాణాలు కాపాడాలంటే మీరు అక్కడకు వెళ్లి, నేను పంపానని చెప్పి గాడిదకు మందు తీసుకురండి. అసలే గాలి బాగా వీస్తోంది.. జాగ్రత్త’ అని చెప్పింది. ఆ విషయం వినగానే ‘వెళ్లి వస్తాను మహారాజా!’ అని కాకి ఎగిరిపోయింది.

చిలుక, పావురం, కోకిల మాత్రం ఒక పక్కగా చేరుకుని.. ‘గాడిదకు జబ్బట. దానికి మందు తెస్తే ఎంత! తేకుంటే ఎంత!’ అని మాట్లాడుకున్నాయి. ‘ఒకవేళ ఆ కాకి మందు తెచ్చినా మనం దారిలోనే లాక్కుందాం’ అనుకున్నాయి. కాకి అక్కడక్కడా విశ్రాంతి తీసుకుంటూ, పక్క అడవికి చేరుకుని ఎలుగుబంటిని కలిసి విషయం చెప్పింది. ‘అలాగా! నువ్వు ఆహారం తీసుకుని విశ్రాంతి తీసుకో.. కొద్దిసేపట్లో నీకు మందు తయారు చేసి ఇస్తాను’ అని పొదలమాటుకు వెళ్లింది. కాసేపటి తర్వాత కొన్ని ఆకులు తెచ్చి, ముద్దగా చేసి ఒక పెద్ద ఆకులో పెట్టి, నారతో కట్టింది. ‘దీన్ని నీ ముక్కుతో పట్టుకుని జాగ్రత్తగా ఎగురుతూ తీసుకెళ్లు... మందు వాడిన ఒక్క రోజులోనే గాడిదకు బాగవుతుంది. మీ రాజుకు నా నమస్కారాలు తెలియజేయి’ అని అంది ఎలుగుబంటి. ‘ఎలుగుబంటి మామా! మందు ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు. వెళ్లి వస్తాను’ అని కాకి బయలుదేరింది. కాకి వచ్చిన దారిలో కాకుండా మరో దారిలో ఎగురుతూ తన అడవికి చేరుకుని, సింహం గుహలోకి వెళ్లింది.

‘ఆ కాకి ఇంతవరకూ రాలేదు, మనం సింహం దగ్గరకు వెళ్లి, గాలి ఎక్కువగా వీచడం వల్ల కొద్ది దూరం వెళ్లి వెనక్కు వచ్చామని చెబుదాం’ అని చిలుక, పావురం, కోకిల అనుకున్నాయి. కాసేపటి తర్వాత నెమ్మదిగా సింహం గుహ దగ్గరకు చేరుకున్నాయి. ‘మహారాజా! మేము కొద్ది దూరం వెళ్లి, గాలి అనుకూలంగా లేక వెనక్కు వచ్చేశాం. పాపం కాకి కూడా ఇంతవరకు రాలేదు’ అని అన్నాయి.

‘కాకి వచ్చింది... మందు తెచ్చింది’ అని చెప్పింది సింహం. ‘అవునా? మాకు కనిపించలేదే’ అన్నాయి అవి. గుహలో నుంచి కాకి వచ్చి సింహం పక్కన నిలబడింది. ‘నేను మందు తీసుకురమ్మని మీకు ఎందుకు చెప్పానో తెలుసా? మన అడవిలోని పక్షులకు కూడా రాజు ఉండాలి కదా! అందుకే పోటీ అని చెప్పకుండా వెళ్లి రమ్మన్నాను. నిజానికి గాడిదకు ఎలాంటి జబ్బూ లేదు. గాడిద గురించి మీరు మాట్లాడుకున్నదంతా అంజి వచ్చి చెప్పింది’ అంది సింహం.

‘అవును.. గాడిద అంటే మీకు అసహ్యం ఎందుకు. అది కూడా జంతువే కదా? కాకులన్నా మీకు గిట్టదు, అవి కూడా పక్షులే కదా!’ అంది అంజి. ‘ఇక మీదట మన అడవిలోని పక్షులకు ఈ కాకి రాజు. మీరు దాన్ని ఎగతాళి చేసినా సాటి నేస్తం జబ్బు బాగు చేయాలన్న ఆశయంతో వెళ్లి మందు తెచ్చింది’ అంది సింహం. ‘మహారాజా! తప్పైంది మన్నించండి. ఇక మీదట కాకులతో సఖ్యంగా ఉంటాం. కాకిని రాజుగా చేసినందుకు ధన్యవాదాలు’ అన్నాయి. ఆ అడవిలోని పక్షులన్నీ వచ్చి సింహం ముందు వాలి.. ‘కాకి రాజుకు జై! కాకి రాజుకు జై!’ అని నినదించాయి. ‘ఇక మీదట పక్షులన్నీ ఐకమత్యంగా ఉండాలి!’ అంది సింహం. అవన్నీ ‘అలాగే మహారాజా!’ అన్నాయి.

యు.విజయశేఖర రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని