ప్రతి పక్షికీ ఓ జామచెట్టు!

తపతీ నదీ తీరంలో ఒక అందమైన వనం ఉండేది. అందులో రంగురంగుల పూల మొక్కలతో పాటుగా చాలా పండ్ల చెట్లు కూడా ఉండేవి. ఆ అడవి ఎల్లప్పుడూ రకరకాల పక్షులు, చిన్నచిన్న జంతువులతో కళకళలాడుతూ ఉండేది

Published : 28 Dec 2023 01:53 IST

తపతీ నదీ తీరంలో ఒక అందమైన వనం ఉండేది. అందులో రంగురంగుల పూల మొక్కలతో పాటుగా చాలా పండ్ల చెట్లు కూడా ఉండేవి. ఆ అడవి ఎల్లప్పుడూ రకరకాల పక్షులు, చిన్నచిన్న జంతువులతో కళకళలాడుతూ ఉండేది. కానీ అందులో జామచెట్టు మాత్రం ఒకటే ఉండేది. దానికి కాసిన కాయలు చాలా రుచిగా ఉండేవి. వాటినే తింటూ.. చిలుకలు, ఉడుతలు హాయిగా జీవిస్తుండేవి.

ఒకరోజు అనుకోకుండా ఆ వనంలోకి ఎక్కడి నుంచో కనకం అనే ఒక కోతి వచ్చింది. అది రావడం రావడమే.. ఆ జామచెట్టు మీద కూర్చుంది. జామకాయలను పక్షుల కంటే ముందుగానే కోసుకొని, వాటిని పక్కనే ఉన్న చెట్టు తొర్రలో దాచుకునేది. అది రెండుమూడు రోజులకు ఒకసారి వచ్చి అలాగే కాయలు కోసుకుంటూ ఉండేది. కావాల్సినన్ని తినేసి, మిగిలిన వాటిని ఆ అడవి పక్షులకు తెలియకుండా దూరంగా తీసుకెళ్లి, ఒక్కోసారి ఒక్కోచోట నేలలో పాతి పెట్టేది.

 ఇదంతా గమనిస్తున్న చిలుకలు, ఉడుతలన్నీ కలిసి ‘కనకం.. నీకు తినడానికి కావాల్సినన్ని పండ్లు మాత్రమే కోసుకొని తిను. అంతేకానీ వాటిని మట్టిపాలు చేయడం సమంజసం కాదు’ అన్నాయి. దాంతో అది కోపంగా ‘నా ఇష్టం.. నేను ఎప్పుడైనా చెట్టు పండ్లను కోసుకుంటాను. నాకు చెప్పడానికి మీరెవరు?’ అని జవాబిచ్చింది.

 ఆ తర్వాత చిలుకలు, ఉడుతలు అన్నీ కలిసి చర్చించుకున్నాయి. ‘ఇక ఈ కోతితో మాట్లాడి లాభం లేదు. మనం ఎలాగూ దాన్ని ఎదిరించలేం. కాబట్టి.. ఆహారం కోసం మరో కొత్త ప్రదేశాన్ని వెతుక్కోవాల్సిందే’ అని మాట్లాడుకున్నాయి.
అదే సమావేశంలో ఉన్న ఒక ఉడుత.. ‘మనం మన అడవిని వదిలి వెళ్లడం ఏంటి? ఈ ఆలోచన సరైంది కాదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పోనుపోనూ కనకంలో కచ్చితంగా మార్పు వస్తుంది. అంత వరకు దొరికిన పండ్లతో ఆకలి తీర్చుకుందాం. అంతే కానీ.. ఇక్కడి నుంచి మాత్రం బయటికి వెళ్లొద్దు’ అంది. దాని మాటలకు సరేనన్నాయి ఆ జీవులన్నీ.
అలా కొన్ని రోజుల తర్వాత ఒక వారం పాటు జోరున వర్షం కురవడంతో, జామచెట్టు పండ్లన్నీ రాలిపోయాయి. దాంతో కొన్ని రోజుల వరకు కనకానికి ఆహారం బాగానే దొరికింది. ఆ తర్వాత చెట్టు కాయడం ఆగిపోవడంతో దానికి తిండి కరవైంది. వర్షంలో తడుస్తూ అక్కడే ఉండిపోయింది కానీ, వేరే చోటుకు మాత్రం వెళ్లలేదది. ‘ఇప్పుడెలా.. మరో వారం గడిచినా కూడా ఈ చెట్టుకు కాయలు కాసేలా లేవు’ అని ఆలోచించుకుంటూ చెట్టుకొమ్మ మీద కూర్చొని ఉందా కోతి. దాని బాధను చూసిన ఒక చిలుక, అది తినడానికి తెచ్చుకున్న నేరేడు పండ్లను కోతికి ఇచ్చేసింది.
ఇదంతా చూసిన మిగతా జీవులు ‘నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? దాని బుద్ధి తెలిసి కూడా నువ్వు తెచ్చుకున్న ఆహారాన్ని కనకానికి ఎందుకు ఇస్తున్నావు?’ అని అన్నాయి. ‘ఆ కోతి మన ఆకలి గురించి ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిందని మనమూ అలాగే చేస్తే.. దానికీ మనకూ తేడా ఏముంది? ఆకలితో ఉన్నవారికి మనకు తోచిన సహాయం చేయాలి. అలాగే ఆహారం ఎక్కువగా ఉంది కదా అని వృథా చేయకూడదు’ అని చెప్పింది చిలుక.
దాని మాటలకు కనకం చలించిపోయింది. ‘నా తప్పు తెలుసుకున్నాను. నన్ను క్షమించండి! నా ప్రవర్తనతో, మాటలతో మిమ్మల్ని చాలా బాధపెట్టాను’ అందది. ‘ఇప్పటికైనా మంచిగా మారావు కదా! ఇలాగే ఉండు’ అన్నాయి ఆ జీవులన్నీ.
‘ఒక విధంగా నువ్వు చేసిన పని కూడా అడవికి మంచే చేసింది’ అంది చిలుక. ‘అదెలా?’ అని ప్రశ్నించింది కోతి. మేము జామపండ్లు తినేటప్పుడు గింజలన్నీ ఈ చెట్టు కిందే రాలేవి. నీడ ఎక్కువగా ఉండటంతో అవి మొలకెత్తేవి కాదు. కానీ నువ్వు జామకాయలు వేరే చోటుకు తీసుకెళ్లి పాతావు కదా! ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి’ అని బదులిచ్చింది చిలుక. ‘అయితే.. రాబోయే రోజుల్లో ప్రతి పక్షికి ఓ జామచెట్టన్న మాట’ అంది ఉడుత నవ్వుతూ..!

కూచిమంచి నాగేంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని