చొప్పకట్ట చేసిన మేలు!

చేమంతిపురంలో రామయ్య అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు దినసరి కూలీగా పనిచేసేవాడు. ఎప్పటిలాగే ఒకరోజు ఏదైనా పని దొరుకుతుందేమోనని పొరుగూరు నరసింహపురానికి  బయలుదేరాడు.

Updated : 30 Dec 2023 07:11 IST

చేమంతిపురంలో రామయ్య అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు దినసరి కూలీగా పనిచేసేవాడు. ఎప్పటిలాగే ఒకరోజు ఏదైనా పని దొరుకుతుందేమోనని పొరుగూరు నరసింహపురానికి  బయలుదేరాడు. వెళ్తుండగా అతనికి దారిలో.. ఎవరో కట్టి వదిలేసిన చొప్పకట్ట కనిపించింది. అతనికి జంతువులంటే చాలా ప్రేమ. ‘ఇది తీసుకొని వెళ్తే ఏవైనా జంతువులు కనిపిస్తే వాటికి వేయొచ్చు’ అనుకొని ఆ కట్టను చేతిలో పట్టుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. అలా నడుస్తూ ఉండగా.. ఒకచోట ఆవు, దూడ కనిపించాయి. తన దగ్గర ఉన్న ఆ చొప్పగడ్డిని వాటికి వేశాడు. అక్కడే ఉన్న వాటి యజమాని.. ‘వీటికి మేత వేయడానికి చాలాసేపటి నుంచి గడ్డి కోసం చూస్తున్నాను. కానీ ఎక్కడా కనిపించలేదు. అడగకుండా వాటికి మేత వేసినందుకు మీకు కృతజ్ఞతలు’ అన్నాడు. ఆ తర్వాత ఆవు పాలను తీసి రామయ్యకు తాగమని ఇచ్చాడు.  అప్పుడు అతను ‘అయ్యో..! నేను ఈ పాలు తాగలేనండీ.. ఇప్పుడే భోజనం చేసి బయలుదేరాను’ అన్నాడు. ఆ మాటలు విన్న ఆ యజమాని.. ‘అయితే పాలు ఈ సీసాలో పోసి ఇస్తున్నాను. మీకు ఆకలి వేసినప్పుడు తాగండి’ అని పాల సీసా రామయ్య చేతికి అందించాడు. ఇక అతడు మళ్లీ నడక ప్రారంభించాడు. కొంత దూరం వెళ్లగానే అక్కడ ఓ వ్యక్తి ఎదురయ్యి.. ‘ఇక్కడ ఆవు పాలు ఎక్కడ దొరుకుతాయి. మా బిడ్డకు వెంటనే కావాలి’ అన్నాడు. క్షణం ఆలోచించకుండా రామయ్య.. తన దగ్గర ఉన్న పాలను ఇచ్చేశాడు. అతడు ఆ సీసా తీసుకొని, రామయ్య వద్దంటున్నా వినకుండా కొంత డబ్బు జేబులో పెట్టి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఇంకాస్త ముందుకు వెళ్లాక.. ఒక వృద్ధుడు కింద పడిపోయి ఉన్నాడు. అతన్ని చూసిన రామయ్య వెంటనే లేపడానికి ప్రయత్నం చేశాడు. అతనికి బాగా అనారోగ్యంగా ఉండటంతో ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. తన దగ్గర ఉన్న డబ్బులతో వైద్యం చేయించాడు. విషయం తెలుసుకున్న ఆ వృద్ధుడి కొడుకులు కాసేపటికి అక్కడికి చేరుకున్నారు. తమ తండ్రిని కాపాడినందుకు రామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. తను ఖర్చు చేసిన దానికి రెండింతల డబ్బు ఇవ్వబోయారు. కానీ అతడు వైద్యానికి ఖర్చు చేసినంత డబ్బు మాత్రమే తీసుకుని, మళ్లీ నడవడం ప్రారంభించాడు. దారిలో అతనికి కొన్ని గాజు పెంకులు, ముళ్లు కనిపించాయి. వెంటనే అవన్నీ ఏరి పక్కన పడేశాడు. అక్కడికి కొంచెం దూరంలో ఏదో సమావేశం జరుగుతుంది. ఏంటా అని దగ్గరికి వెళ్లాడతను. ఆ గ్రామ పెద్ద.. ‘మేము బాటసారుల కోసం రేపటి నుంచి అన్నదాన సత్రం ప్రారంభిస్తున్నాము. అందులో పని చేయడానికి ఒకే ఒక్క కొలువు ఖాళీగా ఉంది. దాని కోసమే పోటీ నిర్వహిస్తున్నాము’ అని చెప్పాడు. అది విన్న రామయ్య ‘ఇది ఎలాగో నాకు రాదు’ అంటూ వెనుదిరిగాడు. అది గమనించిన గ్రామ పెద్ద, రామయ్యని పిలిచి ‘ఇందాకే నీ గురించి మా మనుషులు చెప్పారు. దారిలో నువ్వు చేసిన సాయం గురించి వివరించారు. అంతేకాకుండా ఎవరికీ హాని జరగకూడదని అడ్డంగా ఉన్న గాజు పెంకులు, ముళ్లను అక్కడి నుంచి తీసేశావు. సమాజం మీద మమకారం ఉన్న నీలాంటి వ్యక్తి కోసమే వెతుకుతున్నాం. మా సత్రంలో నువ్వు పని చేస్తావా?’ అని అడిగాడు. అప్పుడు రామయ్య ఆనందంతో ‘పిలిచి మరీ.. కొలువు ఇస్తానంటే అంతకన్నా నాకు కావాల్సిందేముంది. దాని కోసమే నేను చెప్పులు అరిగేలా తిరుగుతున్నాను. తప్పకుండా మీ అన్నదాన సత్రంలో పని చేస్తాను’ అని బదులిచ్చాడు. ‘అయితే రేపు ఉదయమే వచ్చి ఉద్యోగంలో చేరిపో’ అన్నాడు గ్రామాధికారి. రామయ్య అతనికి ధన్యవాదాలు తెలిపి.. సంతోషంగా మరుసటిరోజే కొలువులో చేరిపోయాడు.

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు