ఎలుగుబంటి మాట.. మృగరాజుకు బంగారు బాట!

అనగనగా ఒక అడవి. దానికి రాజుగా సింహం, మంత్రిగా నక్క ఉండేది. మృగరాజుకు నిత్యం అనవసరమైన అనుమానాలు వస్తూ ఉండేవి. వాటికి మంత్రి నక్క ఏదో విధంగా జవాబు ఇచ్చి సందేహాలు నివృత్తి చేసేది. ఒకరోజు మంత్రి నక్క, సింహం దగ్గరికి వచ్చేటప్పటికి దీర్ఘాలోచనలో ఉంది.

Published : 01 Jan 2024 00:28 IST

నగనగా ఒక అడవి. దానికి రాజుగా సింహం, మంత్రిగా నక్క ఉండేది. మృగరాజుకు నిత్యం అనవసరమైన అనుమానాలు వస్తూ ఉండేవి. వాటికి మంత్రి నక్క ఏదో విధంగా జవాబు ఇచ్చి సందేహాలు నివృత్తి చేసేది. ఒకరోజు మంత్రి నక్క, సింహం దగ్గరికి వచ్చేటప్పటికి దీర్ఘాలోచనలో ఉంది. ‘మృగరాజా! ఏమిటి ఈ రోజు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఏమిటీ సమస్య’ అని నక్క అడిగింది.

‘మన అడవిలో ఉన్న జంతువుల్లో అన్నింటికన్నా తెలివైన జంతువు ఏది? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే ఈరోజు మధ్యాహ్నం అడవిలో అన్ని జంతువులను సమావేశానికి హాజరవ్వమని సందేశం పంపు’ అని సింహం అంది. ‘ప్రభూ...! మీకన్నా తెలివైన జంతువు ఈ అడవిలో లేనే లేదు. అందుకోసం మళ్లీ సమావేశం ఎందుకు?’ అని అంది నక్క. ‘నేను చెప్పినట్లు సమావేశం ఏర్పాటు చేయి. అనవసర ప్రసంగం వద్దు’ అని కోప్పడింది మృగరాజు.

ఇక చేసేదేమీ లేక నక్క, కోతిని పిలిచి.. ‘ఈ రోజు మృగరాజు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు అవ్వాలని అన్ని జంతువులకు తెలియజేయి’ అని చెప్పింది. ఆ వానరం అడవి అంతా తిరిగి, సమాచారం జంతువులకు చేరవేసింది. అడవిలో జంతువులన్నీ మృగరాజు దగ్గరకు వచ్చాయి. సమావేశానికి వచ్చిన జంతువులతో సింహం... ‘మన అడవిలో తెలివైన జంతువు ఏదో చెప్పండి’ అని అడిగింది. జంతువులన్నీ మృగరాజు ప్రశ్నకు ఆలోచనలో పడ్డాయి. ఏం చెప్పాలో తెలియక గుసగుసలాడుకున్నాయి.

కొంత సమయం తర్వాత ఒక ముసలి ఎలుగుబంటి ముందుకు వచ్చి.. ‘మృగరాజా! ఈ అడవిలో అన్నింటికన్నా తెలివైన జంతువు మీరే!’ అని చెప్పింది. మిగిలిన జంతువులు కూడా.. ‘అవును... అవును’ అని వంత పాడాయి. మృగరాజు వాటితో.. ‘బాగా ఆలోచించి చెప్పండి. మీకు ఈరోజు అంతా సమయం ఇస్తాను. రేపు మళ్లీ వచ్చి మన అడవిలో ఎవరు తెలివైన జంతువో సరిగ్గా చెప్పండి’ అని సమావేశం ముగించి తన గుహలోకి వెళ్లిపోయింది. జంతువులన్నీ దారి పొడవునా మాట్లాడుకుంటూ తమ నివాసాలకు వచ్చాయి. తిరిగి రెండో రోజు సమావేశానికి అవి హాజరయ్యాయి. సింహం మళ్లీ అదే ప్రశ్న అడిగింది. వచ్చిన జంతువులన్నీ ముక్తకంఠంతో.. ‘మన అడవిలో తెలివైన జంతువు మీరే ప్రభూ’ అని జవాబిచ్చాయి.

‘నిన్న సమాధానం చెప్పిన ముసలి ఎలుగుబంటి ఈరోజు సమావేశానికి హాజరు కాలేదు. ఏమిటి సంగతి?’ అని జంతువులను అడిగింది సింహం. ‘తనకు కాస్త ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల రాలేదు’ అని చెప్పాయి. మృగరాజు మళ్లీ వాటితో... ‘ఈరోజు కూడా నేను అడిగిన ప్రశ్నకు బాగా ఆలోచించి అడవిలో తెలివైన జంతువు ఏదో రేపు జవాబు చెప్పడానికి రండి’ అని చెప్పి వెళ్లిపోయింది. తర్వాత రోజు కూడా సమావేశానికి వచ్చిన జంతువులు... ‘మృగరాజా! మీరే ఈ అడవిలో తెలివైన జంతువు’ అని జవాబు చెప్పడంతో పట్టరాని సంతోషంతో సింహం అందరికీ విందు భోజనం ఏర్పాటు చేసి పంపించింది.  

ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు సింహం, నక్కతో.. ‘మంత్రీ.. మన అడవిలో తెలివైన జంతువు నేను. మరి తెలివి తక్కువ జంతువు ఏది?’ అని అడిగింది. మంత్రి నక్కకు ఏం చెప్పాలో అర్థం కాక... ‘మృగరాజా! ఈ ప్రశ్నకు జవాబు మనం తెలుసుకోవాలంటే అడవిలోని జంతువులన్నింటినీ మరోసారి సమావేశపరచాలి. ఏర్పాట్లు చేయమంటారా?’ అని అడిగింది. ‘ఆలస్యం ఎందుకు? వెంటనే అడవిలోని జంతువులతో సమావేశం ఏర్పాటు చేయించు’ అని సింహం ఆజ్ఞ జారీ చేసింది. వెంటనే మంత్రి నక్క, కోతిని పిలిచి సమావేశం కోసం అడవిలోని జంతువులకు కబురు పంపించింది.

‘ఈసారి మృగరాజు ఎటువంటి ప్రశ్న అడుగుతుందో?’ అనే సందేహంతో అడవిలోని జంతువులు మృగరాజు దగ్గరకు వచ్చాయి. మృగరాజు జంతువులను ఉద్దేశించి.. ‘మన అడవిలో తెలివి తక్కువ జంతువు ఏది?’ అని అడిగింది. సింహం ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో వాటికి అర్థం కాలేదు. దీంతో మౌనంగా ఉండిపోయాయి. మంత్రి నక్క కలగజేసుకొని.. ‘మీరంతా అలా మౌనంగా ఉండిపోతే ఎలా? మీలో ఎవరు తెలివి తక్కువ జంతువో.. మీరే చెప్పండి’ అని అంది. ‘తెలివి తక్కువ జంతువు ఏదో తేల్చండి’ అంటూ మృగరాజు కూడా తొందరపెట్టింది.

అప్పుడు ముసలి ఎలుగుబంటి ముందుకు వచ్చి.. ‘నా ప్రాణానికి ఎటువంటి హానీ జరగదని, నాకు హామీ ఇవ్వండి. నేను జవాబు చెబుతాను’ అని అడిగింది. ‘ఎలుగుబంటీ... నీకేమీ భయం లేదు. నువ్వు తెలివి తక్కువ జంతువు పేరు చెప్పు. నీకు ఎటువంటి ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటా’ అని మృగరాజు హామీ ఇచ్చింది. అప్పుడు ఎలుగుబంటి.. ‘మృగరాజా! ఈ అడవిలో తెలివైన జంతువుగా మిమ్మల్ని భావించి మీకు పట్టం కట్టాం. కానీ మీరు అనవసరమైన అనుమానాలు, పనికిమాలిన ప్రశ్నలకు జవాబులు వెతకడం కోసం జంతువుల సమయాన్ని వృథా చేస్తూ ఇలా సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల మాకు అర్థమైంది ఏమిటంటే... ఈ అడవిలో తెలివి తక్కువ జంతువు ఏదైనా ఉందంటే అది మీరు తప్ప ఇంకెవరూ కాదు’ అని కుండ బద్దలు కొట్టింది.

ఎలుగుబంటి సమాధానం విని మృగరాజు గతుక్కుమంది. మంత్రి నక్క వైపు చూడగా అది కూడా.. ‘అవును మృగరాజా! మీరు అనవసరమైన ప్రశ్నలతో జంతువుల సమయాన్ని వృథా చేయడమే కాకుండా పరిపాలన వ్యవహారాలు పక్కన పెట్టేస్తున్నారు’ అని అంది. మృగరాజు తన తప్పు తెలుసుకుంది. జంతువులను ఉద్దేశించి... ‘ఇకపై ఇటువంటి అనవసర ప్రశ్నలకు జవాబుల కోసం సమావేశాలు ఏర్పాటు చేసి, మీ కాలాన్ని వృథా పరచను. నాలోని లోపాన్ని నాకు తెలిసే విధంగా చేసిన ఎలుగుబంటిని మీ అందరి సమక్షంలో సత్కరించదలిచాను’ అని అంది. ‘మృగరాజా! మీలో మార్పే నాకు గొప్ప సత్కారం. ఇంకేమీ వద్దు’ అని ఎలుగుబంటి సమాధానం ఇచ్చింది.

మొర్రి గోపి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు