తప్పు తెలిసింది.. బుద్ధి మారింది!

జ్ఞానరత్నం మూలికావైద్యంలో ఆరితేరిన వాడు. ఆయన దగ్గర వైద్య విద్య నేర్చుకున్న వారెందరో గొప్పగా రాణించారు. కొత్తగా విద్య నేర్చుకోవడానికి సద్గుణుడు, దుర్గుణుడు అనే ఇద్దరు శిష్యులు వచ్చారు. కొన్ని పరీక్షల అనంతరం ఆ విద్య నేర్చుకోవడానికి ఇద్దరూ అర్హులే అని జ్ఞానరత్నం గ్రహించాడు. వారిద్దరికీ తనకు తెలిసిన మూలికా వైద్య విద్యతోపాటు ఎన్నో మెలకువలు నేర్పించాడు.

Updated : 02 Jan 2024 05:17 IST

జ్ఞానరత్నం మూలికావైద్యంలో ఆరితేరిన వాడు. ఆయన దగ్గర వైద్య విద్య నేర్చుకున్న వారెందరో గొప్పగా రాణించారు. కొత్తగా విద్య నేర్చుకోవడానికి సద్గుణుడు, దుర్గుణుడు అనే ఇద్దరు శిష్యులు వచ్చారు. కొన్ని పరీక్షల అనంతరం ఆ విద్య నేర్చుకోవడానికి ఇద్దరూ అర్హులే అని జ్ఞానరత్నం గ్రహించాడు. వారిద్దరికీ తనకు తెలిసిన మూలికా వైద్య విద్యతోపాటు ఎన్నో మెలకువలు నేర్పించాడు.

విద్య ముగిసిన అనంతరం వారిద్దరూ తమ తమ గ్రామాలకు వెళ్లిపోయారు. దుర్గుణుడు తను నేర్చుకున్న వైద్య విద్యను వ్యాపారంగా మార్చుకున్నాడు. వ్యాధులతో తన దగ్గరికి వచ్చే వారి నుంచి ధనం తీసుకొని వైద్యం చేస్తుండేవాడు. ఆదాయం బాగుండి కొద్ది రోజుల్లోనే ధనవంతుడయ్యాడు. సద్గుణుడు కూడా తన వైద్యశాలను తెరిచాడు. అయితే అతడు రోగుల నుంచి ఒక్క నయా పైసా కూడా ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేసేవాడు. అతని వైద్యం అందరికీ పూర్తిగా ఉచితం! దాంతో గ్రామస్థులంతా ఉచితంగా వైద్య సేవలందించే సద్గుణుడి ఇంటి ముందు బారులు తీరేవారు. అదీ కాక సద్గుణుడి హస్తవాసి కూడా చాలా బాగుండటంతో ఎక్కువ మంది రోగులు తన దగ్గరికి వచ్చేవారు. చికిత్స తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి వెళ్లేవారు. దాంతో క్రమక్రమంగా దుర్గుణుడి వ్యాపారం దివాళా తీయసాగింది.

అయితే సద్గుణుడు ఉచితంగా వైద్య సేవలందించడం బాగున్నప్పటికీ అతడు మూలికలు తేవడానికి, వాటిని ఔషధంగా తయారు చేయడానికి మరికొంత ధనం ఖర్చయ్యేది. అయినా సరే అతడు తన దగ్గరికి వచ్చే వారిని వైద్యానికి డబ్బివ్వమని అడిగేవాడు కాదు. ఎంత కష్టమైనా తన సొంత ఖర్చులతో మందులు తయారు చేసి ఇచ్చేవాడు. అది గమనించారు గ్రామస్థులు. వైద్యానికి తమ వద్ద నుంచి ఎంతో కొంత ధనం తీసుకొమ్మని చెప్పేవారు. అందుకు ఒప్పుకునేవాడు కాదు సద్గుణుడు.  

ఇలా కాదని వాళ్లంతా ఆలోచించుకొని సద్గుణుడి ఇంటి ముందు ఒక చిన్న హుండీ ఏర్పాటు చేశారు. వైద్యం చేయించుకున్న వాళ్లు తమకు తోచినంత పైకం ఆ హుండీలో వేయాలి అనుకున్నారు. అందుకు కూడా అంగీకరించలేదు సద్గుణుడు. వైద్యాన్ని వ్యాపారంగా మార్చటం, తనకిష్టం లేదని వారించినా.. వాళ్లు ఊరుకోలేదు. చివరికి గ్రామస్థుల బలవంతంపై అయిష్టంగా ఒప్పుకున్నాడు. దాంతో సద్గుణుడికి కాస్త ధనం వెసులుబాటు అయ్యేది. అలా క్రమక్రమంగా సద్గుణుడి ఆదాయం పెరిగి మంచి పేరుతో పాటు కాస్త ధనం కూడా అతనికి సమకూరింది.
ఆ సంపదను కూడా తన వైద్యాలయాన్ని మరింత పెద్దది చేసి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడానికి సద్గుణుడు ఖర్చు చేసేవాడు. దాంతో దుర్గుణుడి పరిస్థితి రోజురోజుకీ మరింత క్షీణించిపోయింది. అతని దగ్గరకు ఒక్కరు కూడా వెళ్లేవారు కాదు. దాంతో అతనికి ఏం చేయాలో తోచలేదు. తన దుస్థితికి కారణం సద్గుణుడే అని భావించి అసూయతో రగిలిపోయాడు.
ఒక రోజు అర్ధరాత్రి, ఓ కుర్రాడు సద్గుణుడి ఇంటికి వచ్చాడు. చప్పుడు చేయకుండా చాలా లాఘవంగా ఇంటిముందున్న హుండీని దొంగిలించి పారిపోతూ, ఒక్కసారిగా ‘అమ్మా’ అని గట్టిగా అరుస్తూ కింద పడిపోయాడు. ఆ కేకకు ఉలిక్కిపడి లేచి బయటకొచ్చిన సద్గుణుడు తన వాకిట్లో ఆ కుర్రాడిని చూశాడు. అతని నోటి నుంచి నురగలు కూడా రాసాగాయి. అప్పుడే చీకట్లో మిలమిలా మెరుస్తూ జరజరా పోతున్న ఓ తాచుపాము సద్గుణుడికి కనిపించింది.

అతడు ప్రమాదం పసిగట్టి వెంటనే ఆ బాలుణ్ని ఇంట్లోకి తీసుకెళ్లి, తనకు తెలిసిన మెరుగైన మూలికా వైద్యం అందించి  ప్రాణాలు కాపాడాడు. కాసేపటికి స్పృహలోకొచ్చిన పిల్లవాడు ఎవరు, ఎందుకొచ్చాడు మొదలైన వివరాలు ఆరా తీశాడు. ఇంతలో విషయం తెలిసి ఏడుస్తూ వచ్చాడు ఓ వ్యక్తి. వస్తూనే.. ‘బాబూ, ఎంత ఘోరం జరిగిపోయిందీ... సద్గుణా! నేను బుద్ధి గడ్డి తిని నా కొడుకును నీ ఇంటికి దొంగతనానికి పంపించాను. నాకు తగిన శాస్తి జరిగింది’ అని బోరుమన్నాడు.

దాంతో సద్గుణుడు... ‘దుర్గుణా, నీ కొడుకును కాటేసింది మామూలు విషసర్పమే! కానీ నిన్ను కాటేసింది మాత్రం అసూయా సర్పం! దానికి మందు లేదు. ఇప్పటికైనా నువ్వు మారి చూపించు’ అన్నాడు. దాంతో తన తప్పు తెలుసుకున్నాడు దుర్గుణుడు. అప్పటి నుంచి అతడు కూడా తనకు తెలిసిన వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందరికీ అందిస్తూ అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు.  

ఎన్‌.లిఖిత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు