కలవరం కాదు.. కల.. వరమైంది!

చింటూ మంచి పిల్లాడే! కానీ కాస్త ఆకతాయి. ఎవరు మంచి చెప్పినా వినడు. అస్సలు పట్టించుకోడు. ముఖ్యంగా అతనిలో ఒక చెడ్డ గుణం ఉంది.

Updated : 04 Jan 2024 05:39 IST

చింటూ మంచి పిల్లాడే! కానీ కాస్త ఆకతాయి. ఎవరు మంచి చెప్పినా వినడు. అస్సలు పట్టించుకోడు. ముఖ్యంగా అతనిలో ఒక చెడ్డ గుణం ఉంది. అది ఏమిటంటే తన ఇంట్లో ఉన్న లైట్లు, ఫ్యాన్లను అవసరానికి మించి వాడి పాడు చేయడమే! అలాగే కుళాయి కూడా పూర్తిగా విప్పేసి నీళ్లను వృథా చేస్తుంటాడు. వాళ్ల అమ్మానాన్నలు, అక్కాఅన్నయ్యలు అలా విద్యుత్తు, నీరు వృథా చేయకూడదనీ, పొదుపుగా వాడుకోవాలనీ ఎన్ని సార్లు చెప్పినా తన అలవాట్లను మార్చుకునేవాడు కాదు. పైగా వాళ్లతో వాదించేవాడు.
ఒకసారి చింటూ తన గదిలో చదువుకోవడానికి అన్ని లైట్లు వేశాడు. కాసేపు చదువుకొని వాటిని అలాగే వదిలి వెళ్లబోయాడు. ఇంతలో ఒక లైటు విచారంగా మొహం పెట్టి... ‘నేస్తమా! నువ్వు నా వెలుతురులో చదువుకున్నావు. బాగుంది. కానీ నీ అవసరం తీరిన వెంటనే నన్ను ఆపేయాలి కదా! ప్లీజ్‌ ఫ్రెండ్‌! విద్యుత్తు వృథా చేయకు. భవిష్యత్తులో నేను నీలాంటి ఎంతోమంది పిల్లలకు ఉపయోగపడాలి’ అని దీనంగా వేడుకుంది. అది విని చింటూ హేళనగా నవ్వాడు. ‘నువ్వెలా పోతే నాకేం’ అని దాని మాటలు ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఆ లైటు చాలా బాధ పడింది. 
అలాగే చింటూ మరోసారి ఫ్యాన్‌ విషయంలోనూ, నీళ్లను వాడుకొని కుళాయిని కట్టకుండా వదిలేసి దాని విషయంలోనూ అలాగే ప్రవర్తించాడు. అవి రెండూ తమను వృథా చేయొద్దని ఎంత మొరపెట్టుకున్నా సరే, అతను వాటి మాటలను పట్టించుకోలేదు. పైగా, ‘నేను మిమ్మల్ని ఇలాగే ఉపయోగించుకొని వదిలేస్తాను. మీరు నన్నేం చేయగలరు?’ అని మొండిగా జవాబు చెప్పాడు. పాపం అవి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాయి.
కొన్ని రోజుల తర్వాత చింటూకు వార్షిక పరీక్షలు మొదలయ్యాయి. ఎంతో కష్టపడి బాగా చదివి పరీక్షలన్నీ చక్కగా రాస్తున్నాడు. ఇక ఆ రోజుతో తన పరీక్షలు అయిపోతాయి. సెలవులకు సంతోషంగా తను  తాతగారింటికి వెళ్లిపోవచ్చు, అనుకొని హాయిగా నిద్ర పోయాడు. నెమ్మదిగా తెల్లవారింది. త్వరగా లేచి తయారై పరీక్ష కేంద్రానికి వెళ్లాడు.
తను పరీక్ష రాస్తున్న గదిలో సరిగ్గా వెలుతురు రాదని అక్కడ ఉన్న లైట్లు వేసేవారు. సరిగ్గా పరీక్ష మొదలవగానే తనకు కాస్త దూరంలో ఉన్న లైట్లు కాస్తా ఆరిపోయాయి. చింటూకేం చేయాలో తోచలేదు. అక్కడ మాస్టారుకు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. పైగా, ‘అందరూ బాగానే రాస్తున్నారు కదా! ఎవరికీ రాని సమస్య నీకు ఒక్కడికే వచ్చిందా? వెళ్లు’ అని గట్టిగా అరిచారు. దాంతో చింటూ అయోమయంలో పడిపోయాడు. ఒక పక్క పరీక్ష సమయం మించి పోసాగింది. తొందరగా కరెంటు రావాలని దేవుణ్ని ప్రార్థించాడు కానీ ఫలితం లేదు. కనీకనిపించని వెలుతురులోనే ఎలాగో పరీక్ష అయ్యిందనిపించాడు.
ఎండలు ఎక్కువ ఉండటంతో చింటూకు బాగా దాహం వేసింది. పరీక్ష కేంద్రం నుంచి బయటికి వచ్చాక.. నల్లా దగ్గరికి వెళ్లి, కుళాయి తిప్పాడు. దాంట్లోంచి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. నోరు దాహంతో పిడచకట్టుకు పోయింది. ‘అయ్యో, భగవంతుడా ఎంత కష్టం వచ్చింది’ అని చాలా బాధ పడ్డాడు. ఈ రోజు లైటు లేకపోవడంతో పరీక్ష బాగా రాయలేకపోయాడు చింటు. తాగడానికి నీళ్లు దొరక్క.. చాలా ఇబ్బందిపడ్డాడు. పరీక్ష ఫలితాల్లో తన నంబర్‌ లేదని అన్నయ్య చెప్పేసరికి ఒక్కసారిగా విలవిల్లాడిపోయాడు.
తన భవిష్యత్తు అంధకారమైనట్టు భావించాడు. చింటూ కళ్ల వెంబడి నీళ్లు కారసాగాయి. క్రమంగా తన తప్పు తెలుసుకున్నాడు. తను ఎన్నో సార్లు నీటినీ, విద్యుత్తునూ వృథా చేశాడు. కానీ ఇప్పుడు వాటి విలువ తెలుసుకున్నాడు. ‘నేను మళ్లీ ఎప్పుడూ అలాంటి పొరపాటు చేయను. మిమ్మల్ని వృథా చేయను’ అని గట్టిగా ఏడవసాగాడు.
ఇంతలో అమ్మ వచ్చి... ‘చింటూ... ఏదైనా పీడకల వచ్చిందా? లే బాబూ.. ఈ రోజు నీకు చివరి పరీక్ష కదా! లేచి త్వరగా తయారై వెళ్లు’ అని చెప్పింది. అదంతా కలే అయినా, అప్పటి నుంచీ చింటూలో మార్పు వచ్చింది. ఆ తర్వాత  ఎప్పుడూ నీటినీ, విద్యుత్తునీ వృథా చేయలేదు.  

నంద త్రినాథరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు