ముగ్గురు శిష్యులు..!

పల్లవ రాజ్యాన్ని నందుడు పాలించేవాడు. అతని పుట్టిన రోజు వేడుకలకు ముఖ్యమైన వారితో పాటు గురుకులంలోని గురువులను కూడా ఆహ్వానించాడు. సీతాపురంలోని గురుకులం గురువు రామశర్మకు కూడా కబురు అందింది

Updated : 05 Jan 2024 04:41 IST

పల్లవ రాజ్యాన్ని నందుడు పాలించేవాడు. అతని పుట్టిన రోజు వేడుకలకు ముఖ్యమైన వారితో పాటు గురుకులంలోని గురువులను కూడా ఆహ్వానించాడు. సీతాపురంలోని గురుకులం గురువు రామశర్మకు కూడా కబురు అందింది. అతనికి ఆరోగ్యం బాగోక తన దగ్గర ఉన్న ముగ్గురు శిష్యులు సుధాముడు, విజయుడు, గోపాలుడిని పంపించాలనుకున్నాడు. తాను రాలేకపోతున్నానని లేఖ రాసి, దాన్ని వాళ్లకిచ్చి జాగ్రత్తగా కోటకు చేరుకుని రాజుకి అందజేయమని చెప్పాడు. ఇక ముగ్గురూ కోటకు బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లగానే వారికి ముళ్లపొదలో చిక్కుకున్న పిల్లి కనిపించింది. వెంటనే సుధాముడు వెళ్లి.. దాన్ని బయటకు తీశాడు. అప్పటికే దాని కాళ్లకు ముళ్లు గుచ్చుకొని రక్తం కారసాగింది. అది అతని చొక్కాకు కూడా అంటుకుంది. పక్కనే ఉన్న చెట్టు ఆకులు తుంచి.. పిల్లి రెండు కాళ్లకు కట్టులా కట్టి దాన్ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరారు.

అలా వాళ్లు నడుస్తూ ఉండగా.. అటుగా వెళ్తున్న రామయ్య ఎండ్ల బండి ఆపి, ‘ఎవరు మీరు? ఎక్కడికి వెళ్లాలి!’ అని అడిగాడు. ‘పక్క గ్రామం గురుకులం నుంచి వస్తున్నాము.. కోటకు వెళ్లాలి’ అని జవాబిచ్చాడు సుధాముడు. ‘నేను కూరగాయలు తీసుకుని సంతలో అమ్మడానికి వెళ్తున్నాను. అక్కడి నుంచి కోట చాలా దగ్గర.. నాతో పాటు రండి. అక్కడ దింపుతాను’ అన్నాడు రామయ్య. ‘అలాగే తాతయ్య’ అని ముగ్గురూ బండి ఎక్కి కూర్చున్నారు. ఇక రామయ్య వాళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నాడు. మాట్లాడుతుండగానే.. సంత రానే వచ్చింది. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ముగ్గురు. ‘నేను సంతలో కూరగాయలు అమ్మాక.. మళ్లీ వచ్చిన దారిలోనే ఇంటికి వెళ్తాను. ఒకవేళ కనిపిస్తే మళ్లీ బండిలో తీసుకెళ్తాను’ అని చెప్పాడు ఆ పెద్దాయన. ‘అలాగే’ అన్నాడు సుధాముడు. అక్కడి నుంచి నడుస్తూ నడుస్తూ.. ఒకచోట ఆగి పాలు కొని పిల్లికి తాగించారు. అది కృతజ్ఞతగా ‘మ్యావ్‌..మ్యావ్‌’ అని అరిచింది.

 కోటకు చేరుకుని సభలోకి వెళ్లారు ముగ్గురు శిష్యులు. రాజు కూడా సింహాసనం మీద ఉన్నాడు. భటులు కార్యక్రమానికి వచ్చిన వారందరినీ ఆసనాలలో కూర్చోబెడుతున్నారు. కాసేపటికి రాజు వరసగా అందరినీ పలకరిస్తూ ఒక్కొక్కరికీ కానుకలు, పండ్లు ఇవ్వసాగాడు. ముగ్గురు శిష్యుల వంతు వచ్చింది. వాళ్లు లేచి నిలబడి.. ‘మహారాజా! మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మేము సీతాపురంలో గురుకులంలోని రామశర్మగారి శిష్యులం’ అని గురువు రాసిన లేఖ అందించారు. ‘సంతోషం.. ఏంటీ మీ దగ్గర పిల్లి ఉంది. ఇది కూడా గురుకులంలోనిదేనా?’ అని అడిగాడు రాజు. దారిలో జరిగిన విషయాన్ని వివరించాడు విజయుడు. ‘సాటి ప్రాణిని రక్షించారు. మీతో పాటు పిల్లికి కూడా కానుక’ అని రాజు నాలుగు సంచులను ఇచ్చాడు. ‘ధన్యవాదాలు మహారాజా!’ అన్నారు వాళ్లు. సభ ముగియగానే ముగ్గురు శిష్యులు బయలుదేరి సంత వద్దకు వచ్చి చూశారు. రామయ్య తాత కనిపించలేదు.

‘మనం చీకటిపడక ముందే గురుకులం చేరుకోవాలి పదండి’ అన్నాడు సుధాముడు. రామాపురం పొలిమేర దాటేసరికి కాస్త చీకటి పడసాగింది. కొంత దూరం నుంచి ‘అక్కడే ఆగండి!’ అని పెద్ద కేక వినబడింది. వెంటనే సుధాముడు ఒక సంచిలో ఉన్న కానుకలను మరొక దాంట్లో సర్ది ఆ ఖాళీ సంచిలో పిల్లిని ఉంచి, వాటిని తీసుకుని విజయుడిని ఒక చెట్టు చాటుకు వెళ్లమని పంపించాడు. ఓ దొంగ వచ్చి ‘మీ దగ్గర ఏముందో అది ఇవ్వండి.. లేకపోతే ప్రాణాలు తీస్తాను’ అన్నాడు. ‘అయ్యా! ఇప్పుడే ఒక దొంగ నన్ను బాగా కొట్టి మా వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్మును దోచుకెళ్లాడు’ అన్నాడు సుధాముడు. రక్తం మరకలు అంటిన చొక్కాను చూసి అదంతా నిజమే అనుకున్న దొంగ.. ‘ఈ ప్రాంతంలో నేనొక్కడినే దొంగను. మరొకరు ఉండటానికి వీల్లేదు. వాడు ఎటువైపు వెళ్లాడో చెప్పు’ అన్నాడు. ‘అటువైపు వెళ్లాడు’ అన్నాడు గోపాలుడు వేలు చూపిస్తూ.
అతను ఆ వైపుగా వెళ్లిపోవడంతో.. ‘విజయా! దొంగ వెళ్లిపోయాడు రా వెళ్దాం!’ అన్నాడు సుధాముడు. ఇక ముగ్గురు గబగబా గురుకులం చేరుకున్నారు. శిష్యుల కోసమే ఎదురుచూస్తున్న రామశర్మ.. ‘ప్రయాణం సక్రమంగానే జరిగిందా? చేతిలో పిల్లేంటి? ఆ చొక్కాకు రక్తం మరకలేంటి?’ అని ప్రశ్నించాడు. ఉదయం నుంచీ జరిగిందంతా వివరించి.. ‘ఈ పిల్లి వల్ల మేము ప్రాణాలతో బయటపడ్డాము’ అన్నారు ముగ్గురు. ఆ తర్వాత రాజుకు ‘ఒక దొంగ రామాపురం పొలిమేరలో సంచరిస్తున్నాడు’ అని లేఖ పంపాడు రామశర్మ. ‘మీరు ఇచ్చిన సమాచారంతో.. మా భటులు రెండు రోజుల్లో ఆ దొంగను చాకచక్యంగా పట్టుకుని చెరసాలలో వేశారు’ అని రాజు తిరిగి రామశర్మకు లేఖ రాశాడు.                          
 యు. విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని