స్నేహం కోసం..!

నాగులూరులో ఉండే నాగులు గొడుగులు తయారు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మేవాడు. అతని కుమారుడు తనలాగ కష్టపడకుండా.. బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలని కలలు కనేవాడు.

Updated : 06 Jan 2024 05:05 IST

నాగులూరులో ఉండే నాగులు గొడుగులు తయారు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మేవాడు. అతని కుమారుడు తనలాగ కష్టపడకుండా.. బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలని కలలు కనేవాడు. కానీ ఆ పిల్లవాడు రాముకు ఎంత ప్రయత్నించినా చదువు అబ్బలేదు. దాంతో తండ్రి దగ్గర గొడుగులు తయారు చేయడం నేర్చుకున్నాడు. కొద్దికాలంలోనే ఆ పనిలో మంచి ప్రావీణ్యం సాధించాడు. ఆ చుట్టుపక్కల అప్పటికే తండ్రి వ్యాపారం బాగా నడుస్తుంది కాబట్టి, తను దూరప్రాంతానికి వెళ్లి గొడుగులు అమ్మాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని.. రాజధాని దిశగా ప్రయాణం మొదలుపెట్టాడు. కొన్ని ఊర్లు దాటాక పాలకొండ అనే చిన్న పట్టణం చాలా సందడిగా ఉండడం గమనించాడు. అక్కడ ప్రతివారం జరిగే సంతకు ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది జనం వస్తూపోతూ ఉంటారని విన్నాడు. తన వ్యాపారానికి ఆ చోటే అనువైందని భావించాడు.

రాము అక్కడికి వెళ్లేటప్పటికే.. సంత జరుగుతున్నందున తాను తయారు చేసిన గొడుగులు అమ్మడానికి ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు. అదే చెట్టు నీడలో టోపీలు అమ్ముతున్న ఒక వ్యక్తి రామును చూసి చిన్నగా నవ్వాడు. మాటల్లో అతని పేరు రహీం అని, అతనిది ఆ ఊరేనని తెలుసుకున్నాడు. కాసేపయ్యాక రాము.. ‘నాకు ఇక్కడ ఉండటానికి ఏదైనా అద్దె ఇల్లు ఉంటే చూపించవా?’ అని అతడిని అడిగాడు. ‘ఎందుకు? నేనెలాగూ ఇంట్లో ఒక్కడినే ఉంటాను. ఇప్పటి నుంచి నువ్వు నాతో పాటు ఉందువుగానీ’ అని బదులిచ్చాడు రహీం. ముందు కాస్త ఆలోచించినా.. అతని మాటలకు రాము చాలా సంతోషించాడు. అలాగే నీతో పాటు ఉంటానని చెప్పాడు. ఇంతలోనే రహీం.. ‘నువ్వు దూరంగా మరొక చెట్టు నీడన కూర్చుని గొడుగులు అమ్ము. నా దగ్గర కూర్చోవద్దు’ అని రాముతో అన్నాడు. దాంతో చిన్నబోయిన అతను, అక్కడి నుంచి లేచి దూరంగా వెళ్లాడు. ఇక సాయంత్రం అవ్వడంతో సంచి సర్దుకుని వచ్చిన రహీం ‘రా! మనింటికి వెళ్దాం’ అంటూ రాముని పిలిచాడు. ఇక ఇద్దరూ కలిసి బయలుదేరారు. ముభావంగా ఉన్న రాముతో ‘నిన్ను నా దగ్గర కూర్చోవద్దని అన్నందుకు బాధపడుతున్నావా? నేను టోపీలు అమ్ముతాను కదా! కొందరు వర్షానికే కాకుండా.. ఎండకు కూడా గొడుగు వాడతారు. నువ్వు నా పక్కనే ఉంటే టోపీ చాలు కదా! అనుకునే అవకాశం ఉంది. అప్పుడు నువ్వు నష్టపోతావు. అందుకే అలా చెప్పాను’ అన్నాడు రహీం. ఆ మాటలకు రాముకు చాలా సంతోషం కలిగింది. ఇంతలోనే ఇంటికి చేరుకున్నారిద్దరూ.

‘వేసవి రాబోతుంది కాబట్టి.. చాలామంది టోపీలు, గొడుగులు కొనుక్కుంటారు’ అని ఆలోచించిన రహీం, ఒకరోజు కూర్చుని ఎప్పుడూ కుట్టే తెల్లని టోపీలే కాకుండా.. రంగురంగుల టోపీలు కుట్టసాగాడు. రామును కూడా ప్రోత్సహించాడు. మిత్రుని సూచన మేరకు రాము ఎప్పుడూ కుట్టే నల్ల గొడుగులతో పాటుగా రంగులవి కూడా తయారుచేశాడు. దాంతో వారి వ్యాపారం చాలా బాగా సాగుతోంది. వీరి విషయం ఆ రాజ్యంలోని రాజు వరకు చేరింది. ఆయన రాము, రహీంలను పిలిచి అంతఃపురంలో ఉండే పరివారానికి టోపీలు, గొడుగులు తయారు చేసుకుని రమ్మని చెప్పాడు. ఆ మిత్రులిద్దరూ చాలా ఆనందించారు. ఒక వారం కష్టపడి వినూత్నంగా టోపీలు చేశాడు రహీం. ఇక రాజధానికి వెళ్దామా అని అడిగాడు రాముని. ‘నువ్వు చేసిన టోపీలు చూశాను.. చాలా బాగున్నాయి. ముత్యాలు, జరీదారాల కుట్టు, దాని మీద పువ్వులు.. కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు. ఇక పిల్లల కోసం నెమలి పింఛాలు, రంగురంగుల పక్షి ఈకలు వాడి చేసిన టోపీలు ఎంత బాగున్నాయో! నాకు కొత్తగా ఏ ఆలోచనలూ రావట్లేదు. నువ్వు వెళ్లి కానుకలతో రా.. నేను రాలేను’ అని నిరాశగా అన్నాడు రాము.

స్నేహితుడిని వదిలి వెళ్లడం ఇష్టంలేని రహీం.. బాగా ఆలోచించి రాముకు ఒక ఉపాయం చెప్పాడు. ఆ ప్రకారం తను చేతితో పట్టుకోకుండా తలకు పట్టీలాగా పెట్టుకునే విధంగా కొన్ని, ఒకే రంగులో కాకుండా రెండుమూడు రంగులతో కొన్ని, బొమ్మలూ పువ్వుల డిజైన్లతో కొన్ని గొడుగులు తయారుచేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి రాజధానికి వెళ్ళారు. ఆ టోపీలు, గొడుగులు చూసిన రాజమందిరంలోని వాళ్లు చాలా సంతోషించారు. తీసుకెళ్లినవన్నీ వాళ్లే కొనేశారు.
కోట నుంచి బోలెడు డబ్బుతో బయటకు వచ్చిన మిత్రులిద్దరూ ఆ పట్టణంలోనే ఒక దుకాణం ఏర్పాటు చేసుకుని, మంచిగా వ్యాపారం చేసుకోసాగారు. రాము తల్లిదండ్రులు కూడా వచ్చారు. రహీం వల్ల రాము వ్యాపారంలో మంచి స్థానంలో ఉన్నందుకు, రాము వల్ల రహీంకు అమ్మానాన్నలు లేని లోటు తీరినందుకు ఇద్దరూ ఆనందపడ్డారు. నిజమైన స్నేహితులు దొరికితే జీవితమే మారిపోతుందనడానికి నిదర్శనంగా నిలిచారు.

 గుడిపూడి రాధికారాణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని