పెద్దపులి.. అడవి పిల్లి!

పులి వేటకు బయలుదేరింది. తన గుహ నుంచి బయటకు వచ్చేటప్పటికి బయట దారిలో ఒక అడవి పిల్లి ఎదురుపడింది. అది పులిని చూసి పారిపోలేదు.

Published : 08 Jan 2024 00:09 IST

పులి వేటకు బయలుదేరింది. తన గుహ నుంచి బయటకు వచ్చేటప్పటికి బయట దారిలో ఒక అడవి పిల్లి ఎదురుపడింది. అది పులిని చూసి పారిపోలేదు. అక్కడే ధైర్యంగా నిలుచుంది. పులికి ఆశ్చర్యమేసింది. తనను చూడగానే భయపడి పారిపోతుందనుకున్న అడవి పిల్లి అక్కడే ధైర్యంగా నిలబడడం చూసి పులి విస్తుపోయింది. ‘నన్ను ఏ జంతువైనా చూస్తే, భయపడి పారిపోతుంది. నువ్వు మాత్రం నా ఎదురే నిలిచావు. నీకు అంత ధైర్యమా?’ అని పులి అడిగింది.

‘నేను మీ ముందుకు వచ్చిందే మీకు ఆహారం కావడానికి’ అని జవాబు ఇచ్చింది అడవిపిల్లి. ‘నాకు ఆహారమవడానికి వచ్చావా? ఎందుకలా!’ అని ప్రశ్నించింది పులి. ‘నా బాధ ఎవరికి చెప్పుకోను. నేను ఎవరికి ఎదురుపడినా, వాళ్లకు మంచి జరగదని, నన్ను అన్ని జంతువులూ తిడుతున్నాయి. నా ముఖం చూస్తే ఏదో కీడు జరుగుతుందని దుమ్మెత్తిపోస్తున్నాయి. అందుకే నాకు జీవితం మీద విరక్తి కలిగింది. చనిపోవాలని అనుకుంటున్నాను. అందుకే మీకు ఆహారమై చనిపోతే బాగుంటుందని మీ ముందుకు వచ్చాను’ అని అంది.

అడవి పిల్లి మాటలు విన్న పులి.. ‘అయ్యో! నువ్వు అనవసరమైన మాటలు మనసులో పెట్టుకొని నీ ప్రాణ త్యాగం చేయడం సరికాదు. నువ్వు నాతో పాటు నా వెంట రా! నేను కూడా నిన్ను చూశాను కదా! నాకు మంచి జరుగుతుందో, చెడు ఎదురవుతుందో... నీకే తెలుస్తుంది. నాతో వస్తావా?’ అని అడిగింది. ‘అలాగే..’ అని పులి వెంట అడవి పిల్లి బయలుదేరింది. కాస్త దూరం వెళ్లగానే పెద్దపులికి దూరంగా అటువైపు వెళుతున్న జింకపిల్ల కనబడింది. వెంటనే పులి దూకుడుగా అటుదిక్కు పరిగెత్తింది. జింక, పులిని గమనించి అక్కడి నుంచి పారిపోయింది. పులి నిరాశ పడింది. పులితో పాటు ఉన్న అడవి పిల్లి... ‘చూశారా! మీకు నోటి వరకూ వచ్చిన ఆహారం దొరక్కుండా పోయింది. అంత నా వల్లే’ అని అంది. ‘అయ్యో! నీ వల్ల కాదు. నేను ఆహారం కనిపించింది అనే తొందరలో వేగంగా శబ్దం చేస్తూ పరుగు పెట్టాను. అది గమనించిన జింక పారిపోయింది. ఇది నా పొరపాటే కానీ నీ వల్ల కాదు’ అని సర్ది చెప్పింది.

పులి, అడవి పిల్లి ఇంకా ముందుకు వెళ్లాయి. పులికి గడ్డి మేస్తూ ఒక అడవి గొర్రె కనబడింది. వెంటనే చప్పుడు చేయకుండా గడ్డిమేస్తున్న అడవి గొర్రె వెనకకు వెళ్లింది. తనకు ఆహారం దొరికింది అనే గర్వంతో పులి తన వెనకగా వస్తున్న అడవి పిల్లి వైపు చూసింది. అప్పుడే పులిని గమనించిన అడవి గొర్రె, తన కొమ్ములతో పులిని పొడిచి, అది తేరుకునే లోపు పారిపోయింది.

అప్పుడు అడవి పిల్లి.. ‘గమనించారా! ఇప్పుడు కూడా మీ నోటి దగ్గరకు వచ్చిన ఆహారం మీకు దొరక్కుండా పోయింది. నావల్ల కాదంటారా?’ అని ప్రశ్నించింది. ‘అదేమీ లేదు. ఇది కూడా నా తప్పిదమే. నేను ఆహారం దొరికింది అని నీకు చెప్పడానికి కాస్త వెనక్కి చూడడంతో, కొండ గొర్రె గమనించి అదే అదునుగా నన్ను పొడిచి పారిపోయింది. అంతేగానీ నీవల్ల కాదు’ అని చెప్పింది. అయినా అడవి పిల్లిలో ఆత్మన్యూనతా భావం పోలేదు. నా వల్లే మీకు ఆహారం దొరకడం లేదని పులితో అంటూనే ఉంది. అడవి పిల్లి కొంచెం ముందుకు వెళ్లింది. పులి కాస్త వెనుకగా పొదల మాటున దాక్కుంది.  

ఇంతలో అడవి పిల్లికి ఒక అడవి పంది ఎదురైంది. అడవి పంది చిరాగ్గా మొహం పెట్టింది. పొదల మాటు నుంచి అడవి పందిని గమనించిన పులి మెల్లగా వెనకవైపు నుంచి వచ్చి, అడవి పందిపై పంజా విసిరి చంపేసింది. ‘ఈ రోజు నాకు బాగా ఇష్టమైన అడవి పంది మాంసం ఆహారంగా దొరికింది. వేటకు వచ్చేటప్పుడు నిన్ను చూడడం వల్ల మంచే జరిగింది కదా నాకు’ అని పెద్దపులి, అడవి పిల్లితో అంది.  

‘అడవి పంది ముందు నన్ను చూసింది కదా! అందుకే అది మీకు ఆహారంగా చేజిక్కింది. నన్ను చూడటం వల్ల దాన్ని దురదృష్టం వెంటాడింది’ అని అంది. అప్పుడు పులి.. ‘నీలో ఉన్న ఆత్మన్యూనత భావం నువ్వు వదిలిపెట్టాలి. ఏది జరిగినా అది నా వల్లే జరుగుతుందని, నా వల్లనే ఇతరులకు కీడు జరుగుతుందని నువ్వు భావించినంత కాలం నిన్ను ఎవరూ మార్చలేరు. నీలో ఉన్న ప్రతికూల దృక్పథం పోవాలి. అప్పుడే నీలోని నిరాశ పోతుంది. నువ్వు ఆశావాద దృక్పథం అలవర్చుకోవాలి. ఇంతకన్నా నేను ఏమి చెప్పలేను’ అని పులి చెప్పి, తాను వేటాడిన అడవి పంది మృత కళేబరాన్ని తీసుకొని వెళ్లిపోయింది. అడవి పిల్లి ఆలోచనలో పడింది. పులి చెప్పినట్లు తనలో ఉన్న ఆత్మన్యూనత భావాన్ని విడిచి పెట్టి, సానుకూల దృక్పథం అలవాటు చేసుకోవాలని నిశ్చయించుకుంది.

మొర్రి గోపి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని