వ్యవసాయ పాఠం..!

పూర్వం రత్నగిరిని పద్మనాభుడనే రాజు పాలించేవాడు. ఆయన తన రాజ్యంలోని ప్రజలందరూ విద్యావంతులు కావాలని కోరుకునేవాడు. అందుకోసం ఆ ప్రాంతంలోని పలు చోట్ల గురుకులాలు ఏర్పాటు చేశాడు. రాజధానికి పొలిమేరలో సదానందుని గురుకులం ఉంది.

Updated : 10 Jan 2024 06:50 IST

పూర్వం రత్నగిరిని పద్మనాభుడనే రాజు పాలించేవాడు. ఆయన తన రాజ్యంలోని ప్రజలందరూ విద్యావంతులు కావాలని కోరుకునేవాడు. అందుకోసం ఆ ప్రాంతంలోని పలు చోట్ల గురుకులాలు ఏర్పాటు చేశాడు. రాజధానికి పొలిమేరలో సదానందుని గురుకులం ఉంది. అక్కడ రకరకాల శాస్త్రాలు చదివినవారు రాజధానికి వచ్చి, మహారాజు పెట్టిన పరీక్షల్లో నెగ్గి ఉద్యోగాల్లో చేరేవారు. ఒకసారి రాజ్యంలోని కొన్ని గ్రామాల రైతులు రాజును కలవడానికి కోటకు వచ్చారు. ‘రకరకాల కారణాలతో పంట దిగుబడి తగ్గిపోతుంది. కానీ, మా బాధను పన్నులు వసూలు చేసే అధికారులు ఎవరూ అర్థం చేసుకోవడంలేదు. ఎప్పటిలాగే పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు’ అని వారి గోడు చెప్పుకున్నారు. రైతుల మాటలు విన్న రాజు ‘మీ పరిస్థితి నాకు అర్థమైంది. నేను మంత్రివర్యులతో చర్చించి, తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటాను’ అని జవాబిచ్చి వాళ్లను పంపించాడు.

ఆ తర్వాత మంత్రిని పిలిచి.. ‘అసలు రాజ్యంలో ఏం జరుగుతోంది? మన ఆకలి తీర్చే రైతును ఇలా బాధపెట్టడం మంచిది కాదు కదా..!’ అన్నాడు మహారాజు. దాంతో ‘మనకు వచ్చే ఆదాయం మొత్తం వ్యవసాయం మీద వేసే పన్నుల నుంచే.. అందువల్లనే అధికారులు రైతులను ఒత్తిడి చేసి ఉంటారు. మరో విషయం ఏంటంటే.. ఎక్కువ నష్టం రాకుండా వ్యవసాయం ఎలా చేయాలని రైతులకు చెప్పే వాళ్లు ఎవరూ లేరు. అందుకే వాళ్లు ఎక్కువగా నష్టపోతున్నారు. రకరకాల శాస్త్రాలు చదివినవారు కొలువుల్లో చేరుతున్నారు. కానీ.. వ్యవసాయంలోని సాధకబాధకాలపై వారికి అవగాహన ఉన్నట్లు కనిపించడంలేదు’ అని అన్నాడు మంత్రి.

ఎలాగైనా ఈ సమస్యకు వీలైనంత తొందరగా పరిష్కారం చేయాలనుకున్న రాజు.. మంత్రితో సహా సదానందుల వారి గురుకులానికి చేరుకున్నాడు. రాజ్యంలోని రైతుల పరిస్థితిని ఆయనకు వివరించాడు. ‘విద్యార్థులు ఏ శాస్త్రం చదివినా, వ్యవసాయంపై కనీస అవగాహన ఉండేటట్లు విద్యాభ్యాసం జరిగితే బాగుంటుంది. లేకపోతే.. రానున్న రోజుల్లో పిల్లలకు వ్యవసాయం గురించి అసలు ఏ విషయాలు తెలియకుండా పోతాయి. దానికి సంబంధించిన అభివృద్ధి ఏమీ జరగదు. అది మరింత నష్టానికి దారి తీస్తుంది’ అని చెప్పాడు.

ఆ మాటలు విన్న సదానందుడు.. ‘తప్పకుండా మీరు చెప్పినట్లుగా ఇక మీదట నడుచుకుంటాను. గురుకులానికి వచ్చే వారికి వ్యవసాయంపై అవగాహన కలిగేలా చేస్తాను. అవసరమైతే.. వారిని ప్రత్యక్షంగా పొలాల్లోకి తీసుకెళ్లి దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను’ అని మహారాజుకు మాటిచ్చాడు. అనంతరం అతడు ‘మీరు ఎందుకు అంతలా రైతుల మీద సానుభూతి చూపిస్తున్నారు’ అని అడిగాడు. ‘రాజ్యానికి రైతు రక్షకుడు కూడా! మా పూర్వీకులు ముందు రైతులు.. ఆ తర్వాత యుద్ధ సమయాల్లో అవసరమై సైన్యంలో చేరారు. నమ్మకంగా పనిచేస్తూ సైన్యంలో పెద్ద పదవులు పొందారు. ఒక తరంలో రాజుకు వారసులు లేకపోవడంతో, దాడికి వచ్చిన పొరుగు రాజులను జయించి ప్రజల మెప్పు పొందారు. వారి కోరిక మేరకు రాజ్యాధికారాన్ని చేపట్టారు. రైతేరాజు అన్న నానుడిని నిజం చేశారు. అందుకే.. రైతు సంక్షేమమే రాజ్య సంక్షేమమని నా అభిప్రాయం’ అని బదులిచ్చాడు రాజు. గతాన్ని మరిచిపోక రైతు క్షేమమే ముఖ్యంగా భావిస్తున్న రాజును మనస్ఫూర్తిగా అభినందించి, ఆశీర్వదించి పంపాడు సదానందుడు. ఇక అప్పటి నుంచి తన వద్దకు వచ్చే విద్యార్థులకు ఆయన వివిధ శాస్త్రాలతో పాటుగా వ్యవసాయంపై కూడా అవగాహన కల్పించసాగాడు. ఆ విద్యార్థులు అనుకున్నట్లుగానే గురుకులంలో నేర్చుకున్న పాఠాలతో వ్యవసాయంలో నష్టాల్ని తగ్గించడానికి రైతులకు సహకారం అందించసాగారు.

డా.గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని