చెట్టు నాదే.. పండ్లు నావే..!

రామాపురం గ్రామానికి దగ్గరలో ఒక చిట్టడవి ఉంది. అందులో చిలుక, కాకి, కోతి, కుందేలు వంటి జీవులన్నీ నివసిస్తుండేవి. అందులో నిత్యం అనే ఒక చిలుక ఉండేది.

Updated : 13 Jan 2024 01:01 IST

రామాపురం గ్రామానికి దగ్గరలో ఒక చిట్టడవి ఉంది. అందులో చిలుక, కాకి, కోతి, కుందేలు వంటి జీవులన్నీ నివసిస్తుండేవి. అందులో నిత్యం అనే ఒక చిలుక ఉండేది. దానికి కాస్త తిక్క ఎక్కువ. అది ఉండే జామచెట్టు మీదకు వేరే ఏ పక్షులనూ.. రానిచ్చేది కాదు. ‘ఈ జామచెట్టు ఆకులు పచ్చగా ఉంటాయి. పండ్లు కూడా పచ్చగా ఉంటాయి. నా రంగు కూడా అలాగే ఉంటుంది. పచ్చని రంగు లేని మీకెవ్వరికీ ఈ చెట్టు మీద ఉండే హక్కు లేదు’ అని మూర్ఖంగా మాట్లాడేది. దానితో వాదించి ప్రయోజనం లేదని భావించి మిగతావేవీ ఆ చెట్టుపైకి వెళ్లేవి కాదు. ఒకరోజు అటుగా వస్తున్న కాకిని చూసి.. ‘ఇక్కడికి రావద్దని చెప్పాను కదా. మళ్లీ ఎందుకు వస్తున్నావు?’ అని గట్టిగా అరిచిందా చిలుక. దాని అరుపుకు భయపడిన కాకి.. ‘నా నేస్తం జామపండు కావాలని అడిగింది. అందుకే తీసుకెళ్దామని వచ్చాను’ అని చెట్టు కింద నుంచే సమాధానం చెప్పింది. అయినా సరే వినకుండా.. ‘ఎన్ని సార్లు చెప్పాలి? ఈ చెట్టు నాది.. పండ్లు కూడా నావేనని! వెళ్లిపో’ అందది కోపంగా. ఇక చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్లిపోయిందా కాకి.

కాసేపటి తర్వాత ఒక కోతి ఆ చెట్టు కింద కూర్చొని, పైకి చూసింది. పైన కొమ్మ మీద కూర్చొని జామపండు తింటున్న చిలుకా దాన్ని చూసింది. అప్పుడే ఆ కోతి కిచకిచమంటూ నవ్వింది. కానీ ఆ చిలుక మాత్రం దాన్ని చూసి ముఖం తిప్పుకుంది. ‘ఎవరు నువ్వు? ఇంతసేపైనా ఎందుకు ఇక్కడే ఉన్నావు?’ అని కసురుకుంటూ.. అడిగింది. ‘నా పేరు పుత్తడి. నాకు ఎలాంటి నివాసం లేదు. ఒంటరిగానే అడవంతా తిరుగుతూ ఉంటాను’ అని దీనంగా అంది కోతి. ‘అవునా! ఈ చిట్టడివిలో చాలా చెట్లున్నాయి. ఏదో ఒక చెట్టు చూసుకుని, దాని మీద హాయిగా ఉండు’ అంది చిలుక. ‘అలాగే చేస్తాను. కానీ.. ఈ అడవిలో నిత్యం అనే ఒక చిలుక ఉంటుందట. అది చాలా గొప్పదట. బాగా మాట్లాడుతుందని ఎవరో అనుంటుంటే విన్నా. దాన్ని ఒకసారి కలిసి, ఆ చక్కని మాటలు విని వెళ్దామని ఇలా వచ్చాను. కానీ.. ఓపిక లేక ఇక్కడే కూలబడిపోయాను. నిత్యం ఎక్కడ ఉంటుందో నీకేమైనా తెలిస్తే చెబుతావా?’ అని అడిగింది కోతి. దాని మాటలకు పొంగిపోయిన చిలుక.. ‘నువ్వు వెతికే ఆ నిత్యాన్ని నేనే. తెలియక.. ఇప్పటి వరకు నాతోనే మాట్లాడావు’ అని ఆనందంగా అంది. ‘నిజమా! హమ్మయ్య.. మొత్తానికి నిన్ను చూశాను, నా కోరిక తీరింది.. ఇక వెళ్తాను’ అంటూ ఆ కోతి బయలుదేరబోయింది.

అదేంటి నా మాటలు వినాలని వచ్చి, వినకుండానే వెళ్లిపోతున్నావు?’ అని ఆశ్చర్యంగా అడిగింది చిలుక. ‘గొప్పవాళ్లను చూస్తేనే, మాట్లాడినంత ఫలితం. ఇప్పుడు నాకు చాలా నీరసంగా ఉంది. నీ మాటలు వినడానికి రేపు మళ్లీ వస్తాను’ అని బదులిచ్చింది కోతి. ‘అయితే.. నేను నా చెట్టు నుంచి జామపండు కోసి ఇస్తాను. తింటూ నా మాటలు విను’ అందా నిత్యం. దానికి బదులిస్తూ.. ‘నా అంతట నేనుగా, చెట్టు నుంచి పండు కోసుకుని తినడమే నాకు ఇష్టం. వేరేవాళ్లు ఇచ్చినవి, కింద పడినవి తినను’ అంది కోతి. ‘ అవునా..! అయితే చెట్టు పైకి వచ్చి, నీకు నచ్చిన పండ్లు కోసుకొని తిను. తర్వాత మరో చెట్టు మీదకు వెళ్లిపో.. సరేనా?’ అని చెప్పింది చిలుక. ‘నీ మంచి గుణం తెలిసింది. నీ గొప్పతనం అర్థమైంది. కానీ.. నేను పచ్చగా ఉండను కదా.. నీ చెట్టు మీదకు వచ్చే హక్కు నాకు లేదు’ అని వెటకారంగా అంది కోతి. ‘ఎందుకలా అనుకుంటున్నావు? చెట్లు మనకు నీడనిస్తాయి. పండ్లతో ఆకలి తీరుస్తాయి. వాటికి అలాంటి తేడాలేమి ఉండవు’ అంటూ హితోపదేశం ఇచ్చింది నిత్యం. ‘ఎంత బాగా మాట్లాడావో. నీ మాటలు వింటే మరింత ఆనందంగా అనిపిస్తుంది. అయితే ఈ పండ్లు తినడానికి నా నేస్తాన్ని కూడా పిలవనా?’ అడిగింది పుత్తడి. ‘తప్పకుండా’ అని బదులిచ్చిందది. వెంటనే అది ఎదురుగా మరో చెట్టు మీదున్న కాకిని పిలిచింది. అది మిగతా పక్షులతో కలిసి ఎగురుతూ వచ్చి నిత్యం పక్కనే వాలింది. ఆశ్చర్యంగా చూస్తున్న చిలుకతో.. ‘ఇప్పటి వరకు నువ్వే చెప్పావు కదా.. చెట్లు అందరివని. అందుకే మేమంతా వచ్చాము. నిన్ను పొగిడితే చెట్టు దగ్గరకు రానిస్తావు. లేదంటే లేదా..! అది మంచి పద్ధతి కాదు మార్చుకో’ అని మెల్లగా చెప్పింది కాకి. చేసేదేం లేక ఇష్టం లేకపోయినా సరేనంటూ తలూపిందా చిలుక.

 కె.వి. లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని