గాలిపటమా పద పద!

ఆకాశ్‌, రాజు ఇద్దరూ ఏడో తరగతి చదువుతున్నారు. వీళ్లిద్దరి ఇళ్లు కూడా ఒకే కాలనీలో ఉండటంతో కలిసే వస్తూ.. వెళ్తూ ఉంటారు. ఎప్పటిలాగే ఒకరోజు స్కూల్‌ నుంచి ఇంటికి వస్తూ.. కబుర్లు చెప్పుకోసాగారు. ‘రాజూ! నేను ఈసారి పెద్ద గాలిపటం కొనుక్కుంటున్నాను.

Updated : 14 Jan 2024 00:13 IST

కాశ్‌, రాజు ఇద్దరూ ఏడో తరగతి చదువుతున్నారు. వీళ్లిద్దరి ఇళ్లు కూడా ఒకే కాలనీలో ఉండటంతో కలిసే వస్తూ.. వెళ్తూ ఉంటారు. ఎప్పటిలాగే ఒకరోజు స్కూల్‌ నుంచి ఇంటికి వస్తూ.. కబుర్లు చెప్పుకోసాగారు. ‘రాజూ! నేను ఈసారి పెద్ద గాలిపటం కొనుక్కుంటున్నాను. సెలవులు ఇస్తే ఇక గాలిపటమా పద పద.. అని పాడుకుంటూ ఆడుకోవడమే’ అని ఉత్సాహంగా చెప్పాడు ఆకాశ్‌. ‘అవునా.. ఎప్పుడు కొనుక్కుంటావు? నాకు కూడా గాలిపటం ఎగరేయడం అంటే చాలా ఇష్టం. కొనిపెట్టమని అమ్మని ఆడుగుతాను’ అన్నాడు రాజు. ‘దానికి కూడా అమ్మని అడగాలా?’ అంటూ నవ్వాడు ఆకాశ్‌. అది చూసిన రాజుకు కాస్త కోపం వచ్చింది.. ‘అమ్మను అడిగితే తప్పేముంది. ఏమీ వద్దనదులే’ అని బదులిచ్చాడు. ఇంతలో ఆకాశ్‌ ఇల్లు రావడంతో బై అని చెబుతూ లోపలికి వెళ్లిపోయాడు. రాజు ముందుకు నడుస్తూ.. ‘ఆకాశ్‌కు వాళ్ల నాన్న పాకెట్‌ మనీ ఎక్కువగా ఇస్తారు. ఆ డబ్బులు ఏం చేశావని మళ్లీ అడగరు. అందుకే తనకు నచ్చినట్లు ఖర్చు చేస్తాడు’ అని మనసులో అనుకుంటూ ఉండగానే ఇల్లు వచ్చేసింది.

లోపలికి వెళ్లగానే మావయ్య కనిపించడంతో రాజు ఆనందంతో.. ‘హాయ్‌! మావయ్యా.. ఎప్పుడొచ్చావు?’ అని అడిగాడు. ‘ఓ గంట అయింది రాజూ.. ముందు వెళ్లి కాళ్లు, చేతులు కడుక్కొని రా. తీరిగ్గా కబుర్లు చెప్పుకుందాం’ అన్నాడాయన. సరేనంటూ లోపలికి పరుగులు తీసి, నిమిషాల్లో మళ్లీ వచ్చి మావయ్య ముందు కూర్చున్నాడా బాబు. ఇంతలో అమ్మ వచ్చి.. పకోడీలు తినండంటూ టిఫిన్‌ ప్లేట్లు అందించింది. అప్పుడు రాజు ‘మావయ్యా.. నాకు ఈసారి గాలిపటం బాగా పైకి ఎగరేయడం నేర్పించవా!’ అని పకోడీ తింటూ అడిగాడు. ‘అలాగేలే తప్పకుండా నేర్పుతాను’ అని నవ్వుతూ బదులిచ్చాడు మావయ్య. ‘అసలు గాలిపటం ఎలా ఎగురుతుంది మావయ్య?’ అని ఆశ్చర్యంగా అడిగాడు రాజు. ‘గాలిపటానికి దారం కడతాం కదా.. అదే గాలిపటం ఎగరడానికి ప్రధాన కారణం. దారం దాని పై భాగంలో తక్కువ, కింది భాగంలో ఎక్కువ ఒత్తిడి ఉండేలా చేస్తుంది. దాంతో గాలిపటం గాలి ఎక్కువగా వీచే దిశగా ఎగురుతుంది’ అని చెప్పాడు మావయ్య. ‘అలాగా.. ఇంకో సందేహం’ అంటూ.. ‘ఇంతకీ గాలిపటం, గాలి కంటే తేలిగ్గా ఉంటుందా, బరువుగా ఉంటుందా?’ అని అడిగాడా అబ్బాయి. గాలిపటాన్ని సాధారణంగా గాలి కంటే బరువుగానే తయారుచేస్తారు. అయితే కొన్ని రకాలు తేలిగ్గా కూడా ఉంటాయి. వాటిని హెలికైట్‌ అంటారు. వీటి తయారీలో హీలియం బెలూన్‌ ఉపయోగిస్తారు. కాబట్టి, గాలి లేకపోయినా ఎగరగలవు’ అని వివరించాడు మావయ్య. ‘అవునా!’ అని ఆశ్చర్యంగా అన్నాడు రాజు.

‘గాలిపటాలు ఎగురుతుంటే ఆనందమే కానీ, ఈ మాంజాల వల్ల ప్రమాదం కూడా ఉంది’ అంది రాజు వాళ్లమ్మ. ‘అవును.. ముఖ్యంగా చైనా మాంజా అస్సలు వాడకూడదు. గాజుపెంకుల పొడి, రసాయనాలు కలిపి తయారయ్యే ఆ మాంజా వల్ల పర్యావరణానికి, ఆరోగ్యానికి చాలా ప్రమాదం’ అన్నాడు మావయ్య. ‘అయితే నేను ఎలాంటి ప్రమాదానికి కారణం కానిదే కొనుక్కుంటాను’ అన్నాడు రాజు. ‘నీకో విషయం తెలుసా.. సంక్రాంతికి అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ పతంగుల పండుగ జరుగుతుంది. పోటీలు కూడా నిర్వహిస్తారు. అందులో పాల్గొనడానికి దేశవిదేశాల నుంచి చాలా మంది వస్తారు. గరుడ పక్షి, చేప, విమానం.. ఇలా చాలా ఆకారాలలో గాలిపటాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి’ అని మావయ్య చెబుతుంటే రాజు ఆసక్తిగా విన్నాడు. ‘భలే ఉంది మావయ్యా..! ఇప్పుడు మనం బజారుకు వెళ్లి గాలిపటం కొనుక్కుందామా?’ అని అడిగాడు రాజు. ‘అలాగే పద’ అంటూ.. బాబుని తీసుకొని బయలుదేరాడాయన. నడుస్తూ నడుస్తూ.. ‘గాలిపటాలు ఎగరేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మేడలు, రోడ్ల మీద కాకుండా మైదానాలలో మాత్రమే ఎగరేయాలి’ అని జాగ్రత్తలు చెప్పాడు మావయ్య. ఇంతలో గాలిపటాల దుకాణం రానే వచ్చింది.. రాజుకు నచ్చిన గులాబి, ఆకుపచ్చ రంగుల గాలిపటాలు రెండు కొనిపెట్టాడాయన. ఇంటికి తిరిగి వస్తుండగా ‘గాలిపటం ఎగరేయడంలో గొప్ప సందేశం ఉంది. దారాన్ని చేతికి చుట్టుకుంటూ.. వదులుతూ దాన్ని నేర్పుగా ఎలా ఆకాశంలోకి ఎగరేస్తామో.. క్రమశిక్షణ, విచక్షణతో.. మనసును నేర్పుగా మంచి వైపు మళ్లిస్తూ జీవితంలో పైకి ఎదగాలి’ అన్నాడు మావయ్య. ఇంతలో ఇల్లు రాగానే.. ‘నాకు చాలా మంచి విషయాలు చెప్పావు మావయ్య’ అంటూ లోపలికి వెళ్లి అమ్మకు తన గాలిపటాలు చూపించాడు రాజు.

జె.శ్యామల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని