వైదేహి రాజ్యంలో సంక్రాంతి.. కాంతి!

విశ్వధరుడు మహేంద్రగిరి అడవుల్లో గురుకులం స్థాపించి విద్యాబోధన చేస్తున్నాడు. ఆయన్ను వైదేహి రాజ్య మహారాజైన ధర్మవర్మ.. రాజధాని నగరానికి రమ్మని లేఖ పంపించారు. అది చదివిన గురువు విశ్వధరుడు ఆలోచనలో పడ్డారు. దాన్ని గమనించిన విష్ణుశర్మ ‘గురువు గారూ! మహారాజు పంపిన లేఖ చదివినప్పటి నుంచి అదోలా ఉన్నారు.

Updated : 15 Jan 2024 03:36 IST

విశ్వధరుడు మహేంద్రగిరి అడవుల్లో గురుకులం స్థాపించి విద్యాబోధన చేస్తున్నాడు. ఆయన్ను వైదేహి రాజ్య మహారాజైన ధర్మవర్మ.. రాజధాని నగరానికి రమ్మని లేఖ పంపించారు. అది చదివిన గురువు విశ్వధరుడు ఆలోచనలో పడ్డారు. దాన్ని గమనించిన విష్ణుశర్మ ‘గురువు గారూ! మహారాజు పంపిన లేఖ చదివినప్పటి నుంచి అదోలా ఉన్నారు. అసలు అందులో ఏముంది?’ అని అడిగాడు. ఆ మాటలు విన్న గురువు లేఖను విష్ణుశర్మకు అందించాడు. అది చదివిన తర్వాత.. ‘మీ బదులుగా నేను మహారాజు దగ్గరకు వెళ్తాను. నాకు అనుమతినివ్వండి’ అని కోరాడతను.

శిష్యుడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ.. ‘నాయనా! జాగ్రత్తగా వెళ్లి రా!’ అని చెప్పి కొన్ని సూచనలిచ్చి పంపించాడు గురువు. మరుసటిరోజు ఉదయమే.. విష్ణుశర్మ అడవి మార్గంలో వైదేహి రాజధాని నగరానికి బయలుదేరాడు. మార్గం మధ్యలో ఉండగానే సాయంత్రమైంది. అతనికి ఆ అడవిలో భీకరమైన అరుపు వినబడింది. అక్కడ ఏముందని చూడటానికి అటువైపుగా వెళ్లాడతను. అక్కడే ఉన్న కొండపైన భయంకరంగా ఉన్న రాక్షసుడు.. విష్ణుశర్మను చూసి గట్టిగా అరవసాగాడు. అతడు ఎంత అరిచినా విష్ణుశర్మ మాత్రం అస్సలు భయపడలేదు. అది గమనించిన రాక్షసుడు ఎదురుగా వచ్చి.. ‘ఇంత భయంకరంగా ఉన్నాను నన్ను చూస్తే నీకు ఏమాత్రం భయం వేయడం లేదా? నేను ఉన్న దారిలో అసలు ఏ జీవి కూడా రాదు. కానీ నన్ను చూసి నువ్వు చూడనట్లుగా వెళ్తున్నావు? ఇప్పుడు నువ్వే నాకు ఆహారం’ అన్నాడు.

అప్పుడు విష్ణుశర్మ చిన్నగా నవ్వుతూ.. ‘సూర్యవర్మ! నీ గత చరిత్ర నీకు తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు’ అని అన్నాడు. ‘నా పేరు సూర్యవర్మ కాదు.. కంటకుడు’ అని బదులిచ్చాడు రాక్షసుడు. అవును ఈ జన్మలో నువ్వు కంటకుడివే.. అది నీకు శాపఫలం. పూర్వ జన్మలో నువ్వు సూర్యవర్మ అనే రాజువు. మహేంద్రగిరి అడవిలో వేటకు వచ్చి లేడి రూపంలో సంచరిస్తున్న ఒక ఇక్ష్వాకుడిని వేటాడావు. అతడు బాణం దెబ్బకు విలవిలలాడుతూ నిన్ను రాక్షసుడిగా మార్చేశాడు. అలా నువ్వు రాక్షసుడిగా లోక కంటకుడివి అయ్యావు. ఈ మార్గంలో ప్రయాణం చేసిన అనేక మందిని పొట్టన పెట్టుకుని వారి కుటుంబాలకు శోకం మిగిల్చావు. ఇది ఇలాగే కొనసాగితే.. నువ్వు ప్రతి జన్మలోనూ దుర్మార్గుడిగానే మిగిలిపోతావు. మంచి జన్మ కావాలంటే నువ్వు ఇప్పటి నుంచైనా.. మంచి పనులు చేస్తుండు. పదిమందికి ఉపయోగపడే పనులు చేస్తే చరిత్రలో నీ పేరు నిలిచిపోతుంది’ అని ఆ రాక్షసుడికి హితబోధ చేశాడు విష్ణుశర్మ.

దాంతో రాక్షసుడు ఆలోచనలో పడ్డాడు. గత జన్మకు సంబంధించిన విషయాలను విష్ణుశర్మ వివరించడంతో.. ఆ మాటలు ప్రభావం చూపాయి. ఇక అప్పటి నుంచి మంచిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఇక విష్ణుశర్మకు నమస్కరించి.. ‘ఇప్పటి నుంచి ప్రజలకు మేలు చేసే పనులే చేస్తాను. నా ప్రవర్తనతో ఇకపై ఏ ఒక్కరికీ హాని తలపెట్టను’ అని మాటిచ్చాడు రాక్షసుడు. విష్ణుశర్మను తన భుజాల మీద ఎక్కించుకొని అడవి దాటించాడు. ఇంకాస్త దూరం నడిచాక వైదేహి రాజ్యం చేరుకున్నాడు విష్ణుశర్మ. అనంతరం ధర్మవర్మతో మాట్లాడుతూ.. ‘మహారాజా! ఇకపై వైదేహి రాజ్య ప్రజలకు మహేంద్రగిరి అడవుల్లో ఉన్న రాక్షసుడి వల్ల ఎటువంటి హాని జరగదు. మా గురువుగారి ఆదేశాల ప్రకారం రాక్షసుడిలో మార్పు తీసుకొచ్చాను. మీరు ఏటా నిర్వహించే సంక్రాంతి సంబరాలకు రాక్షసుని వల్ల సమీప గ్రామ ప్రజలు రావడం లేదని, అతన్ని తప్పించడానికి పంపిన వారంతా ప్రాణాలు కోల్పోతున్నారని లేఖలో రాశారు. ఇప్పుడు రాక్షసుడిలో పూర్తిగా మార్పు వచ్చింది. మీ సంబరాలకు ఇక ఎటువంటి అడ్డంకులు ఉండవు’ అని చెప్పాడు. దాంతో మహారాజు ధర్మవర్మ తన రాజ్యంలో సంక్రాంతికి.. కాంతి వచ్చిందని చాలా సంతోషించాడు. అడవి మార్గం నుంచి రాజ్యానికి వచ్చే వారికి ఎలాంటి ప్రమాదం జరగదని అన్ని గ్రామాల్లో దండోరా వేయించి, అందరూ ఈసారి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని చెప్పాడు. ఇంతటి ఆనందానికి కారణమైన విష్ణుశర్మను కానుకలతో సత్కరించాడు ధర్మవర్మ. 

మొర్రి గోపి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు