ఎన్నెన్నో వర్ణాలు.. అన్నింటా అందాలు!

చిన్నారి స్నేహ రోజూ దుస్తులు వేసుకునే సమయంలో పేచీ పెడుతుంది. నాకు ఎరుపు రంగు వద్దు, తెలుపు అసలు వద్దు, నీలం రంగు చిరాకుగా అనిపిస్తుంది... అంటూ అన్ని దుస్తులకు వంక పెడుతుంది. ‘స్నేహా! అలా పేచీ పెట్టకూడదు.

Updated : 18 Jan 2024 04:43 IST

చిన్నారి స్నేహ రోజూ దుస్తులు వేసుకునే సమయంలో పేచీ పెడుతుంది. నాకు ఎరుపు రంగు వద్దు, తెలుపు అసలు వద్దు, నీలం రంగు చిరాకుగా అనిపిస్తుంది... అంటూ అన్ని దుస్తులకు వంక పెడుతుంది. ‘స్నేహా! అలా పేచీ పెట్టకూడదు. అన్ని రంగుల దుస్తులు వేసుకోవాలి’ అని కూతురిని బుజ్జగిస్తూ అంది సీత.

‘అమ్మా! నాకు వేరేవి ఏవీ వద్దు. కేవలం గులాబీ రంగు మాత్రమే నచ్చుతుంది. నేను అవే వేసుకుంటాను’ అని మొండిగా అంది స్నేహ. ‘ఎంత నచ్చితే మాత్రం... రోజూ అవే వేసుకుంటావా? అలా మిగిలిన వాటిని వదిలేస్తే ఎలా?’ లాలనగా అంది సీత. వాళ్లిద్దరి గొడవ పత్రిక చదువుతున్న స్నేహ వాళ్ల తాతయ్య చెవిలో పడింది.

స్నేహ ఉదయం స్కూల్‌కు వెళ్లేటప్పుడు యూనిఫాం వేసుకుంటుంది కాబట్టి గొడవ ఉండదు. కానీ సాయంత్రం ఇంటికి వచ్చాక, సెలవు రోజుల్లో దుస్తుల రంగుల విషయంలో పేచీ పెట్టడం ఆయన వింటుంటారు. స్నేహ ఒక్కోసారి ఒక్కో రంగు దుస్తులు పట్టుకుంటుంది. అవే రోజూ కావాలని పేచీ పెడుతుంది. అవి ఉతకలేదు, ఆరలేదు అని చెప్పినా వినకుండా అవే కావాలని గొడవ చేస్తుంది.

మరుసటి రోజు స్నేహ స్కూల్‌ నుంచి వచ్చేసరికి వాళ్ల తాతయ్య ఒక రంగుల చక్రం తెచ్చి హాల్లో పెట్టారు. ‘తాతయ్యా! ఏమిటిది?’ అని ఎంతో ఆసక్తిగా ఆయన దగ్గరకు వచ్చి అడిగింది స్నేహ. ‘ఇది రంగుల చక్రం. నువ్వు ఈ చక్రం గుండ్రంగా తిప్పి వదిలేయ్‌. అది ఆగినప్పుడు నేను ఆ రంగు ప్రాముఖ్యం నీకు చెబుతాను’ అన్నారు తాతయ్య.

‘ఓహ్‌! భలే భలే తాతయ్యా..’ అంటూ చక్రం తిప్పి వదిలేసింది స్నేహ. అది ఎరుపు రంగు దగ్గర ఆగిపోయింది. ‘ఎరుపు ఎంతో అందమైన రంగు. మనకు ఇష్టమైనవి ఎన్నో ఎరుపు రంగులో ఉంటాయి. ఆపిల్స్‌, చెర్రీలు, స్ట్రా బెర్రీస్‌, టమోటాలు ఇలా..! మనం ఎరుపు దుస్తుల్లో అందంగా ఉంటాం’ అని చెప్పాడు తాతయ్య.

స్నేహ ఆశ్చర్యంగా చూస్తూ చక్రం మళ్లీ తిప్పింది. అది తిరుగుతూ తిరుగుతూ పసుపు రంగు దగ్గర ఆగిపోయింది.   ‘పసుపు ఎంతో ప్రకాశవంతమైన రంగు. మామిడి పండ్లు, అరటి పండ్లు, నిమ్మకాయ, పొద్దు తిరుగుడు పువ్వులు... పసుపు రంగులో ఉంటాయి. శుభానికి గుర్తుగా మనం దీన్ని చెప్పుకుంటాం’ అని నవ్వుతూ అన్నాడు తాతయ్య.

స్నేహ అలా చూస్తూ మళ్లీ చక్రం తిప్పింది. అది ఆకుపచ్చ రంగు దగ్గర ఆగిపోయింది. ‘ఆకుపచ్చ ఆహ్లాదకరమైన వర్ణం. ఆకులు, గడ్డి, బెండకాయలు, పచ్చి మిర్చి మొదలైన అనేక కూరగాయలు ఈ రంగులో ఉంటాయి. ఈ వర్ణం స్నేహానికి, ఎదుగుదలకు సంకేతం’ అన్నాడు తాతయ్య.

స్నేహ ఆశ్చర్యంగా చూస్తూ... తిరిగి చక్రం తిప్పింది. అది నారింజ రంగు దగ్గర ఆగిపోయింది. ‘నారింజ వర్ణం వెచ్చని అందమైన రంగు. ఇది ఆనందానికి, త్యాగానికి ప్రతీక. సంధ్యా సమయాల్లో సూర్యుడు, నారింజ పండ్లు, కమలాలు ఈ రంగులోనే ఉంటాయి’ అన్నాడు తాతయ్య.

ఆ మాటలు పూర్తికాగానే స్నేహ ఉత్సాహంగా మళ్లీ చక్రం తిప్పింది. అది తెలుపు రంగు దగ్గర ఆగింది. ‘తెలుపు శాంతికి, మంచితనానికి నిర్వచనం. పాలు, కోడి గుడ్డు, ఆకాశంలో మబ్బులు, మన నోట్లో ఉండే పళ్లు.. ఇలా చాలా రకాలు తెలుపు రంగులో మనల్ని ఆకట్టుకుంటాయి’ అన్నాడు తాతయ్య.

స్నేహ మళ్లీ చక్రం తిప్పింది. అది నీలం రంగు దగ్గర ఆగింది. ‘నీలం వర్ణం అద్భుతమైన రంగు. ఆకాశం, సముద్రం నీలం రంగులోనే ఉంటాయి. ద్రాక్షపండ్లు, వంకాయలు కూడా అదే వర్ణంలో ఉంటాయి’ అన్నాడు తాతయ్య. స్నేహ మళ్లీ చక్రం వేగంగా తిప్పింది. అది నలుపు రంగు దగ్గర ఆగింది.

‘నలుపు వర్ణం... గొప్ప రంగు. మనకు అక్షరాలు నేర్పే తరగతి గదిలో ఉండే బ్లాక్‌ బోర్డు, అక్షరాలు దిద్దే పలక, మన వెంట్రుకలు నలుపు వర్ణంలో ఉంటాయి’ అన్నాడు తాతయ్య. ‘తాతయ్యా! అన్ని రంగులకూ ప్రత్యేకత ఉంది. అంటే అన్ని రంగులూ గొప్పవేనా?’ ఆసక్తిగా అడిగింది స్నేహ. ‘అవును స్నేహా! వేటి ప్రత్యేకత వాటిదే.. నువ్వు ప్రతీ రోజూ మీ అమ్మను ఈ రంగు దుస్తులు వద్దు, ఆ రంగు దుస్తులు వద్దు అని విసిగిస్తున్నావు. అది తప్పు, అలా చేయకూడదు. నిన్ను అన్ని రంగుల దుస్తుల్లో చూసుకోవాలని మీ అమ్మ ఆశగా అనుకుంటుంది. నువ్వు అది అర్థం చేసుకోవాలి’ అన్నాడు తాతయ్య.

‘అంటే ఏ రంగు దుస్తులు వేసుకుంటే వాటి లక్షణాలు నాకు వస్తాయా?’ అంది స్నేహ. ‘అవును... నిన్ను చూసే వాళ్లకు, అవి వేసుకున్న నీకు కూడా మనసులో అలాగే అనిపిస్తుంది’ అన్నాడు తాతయ్య. ‘ఓ.. అలానా.. అయితే ఇక నేను అమ్మ చెప్పినట్లు వింటాను తాతయ్యా!’ అని నవ్వుతూ అంది స్నేహ. అప్పటి నుంచి స్నేహ మరెన్నడూ వాళ్ల అమ్మను దుస్తుల విషయంలో విసిగించడం వాళ్ల తాతయ్య చూడలేదు.

కేవీ సుమలత


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని