మృగరాజు సందేశం..!

పుణ్యగిరి అటవీ ప్రాంతంలో రకరకాల జంతువులు చాలా స్వేచ్ఛగా జీవించేవి. వాటికి కావాల్సిన ఆహారం అంతా అక్కడే దొరుకుతుండటంతో బయటికి వెళ్లేవి కాదవి. అలా రానురాను జంతువులన్నింటికీ బద్ధకం పెరిగిపోయింది. ఆహారం కోసం కొన్ని పెద్ద జంతువులు చిన్న జీవుల మీద ఆధారపడటం మొదలుపెట్టాయి.

Published : 21 Jan 2024 00:02 IST

పుణ్యగిరి అటవీ ప్రాంతంలో రకరకాల జంతువులు చాలా స్వేచ్ఛగా జీవించేవి. వాటికి కావాల్సిన ఆహారం అంతా అక్కడే దొరుకుతుండటంతో బయటికి వెళ్లేవి కాదవి. అలా రానురాను జంతువులన్నింటికీ బద్ధకం పెరిగిపోయింది. ఆహారం కోసం కొన్ని పెద్ద జంతువులు చిన్న జీవుల మీద ఆధారపడటం మొదలుపెట్టాయి. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా.. మృగరాజు సింహానికి తెలిసింది. దారి తప్పుతున్న అడవి జీవుల్లో ఎలాగైనా మార్పు తీసుకురావాలని నిర్ణయించుకుందది. మరుసటి రోజు సాయంత్రం సమావేశం నిర్వహించాలనుకుంది. అన్ని జీవులు అడవిలోని చెరువు దగ్గర జరిగే సమావేశానికి హాజరు కావాలని కాకి ద్వారా కబురు పంపించింది.

చెప్పినట్లుగా సమావేశానికి కుందేలు, కోతి, ఉడుత ఇలా.. జంతువులన్నీ ఒక్కొక్కటిగా రాసాగాయి. మృగరాజు అసలు ఎందుకు సమావేశం ఏర్పాటు చేసిందో తెలియక అవన్నీ గుసగుసలాడుకుంటున్నాయి. ఇంతలోనే అక్కడికి సింహం వచ్చింది. ఇక కాసేపటి తర్వాత సమావేశం ప్రారంభమైంది. మిగిలిన పక్షులు, జంతువులు ఇంకా వస్తూనే ఉన్నాయి. వచ్చినవి వచ్చినట్లు కబుర్లు చెప్పుకోసాయి. మృగరాజు చెప్పేది ఏమాత్రం వినిపించుకోలేదు. అది గమనించిన సింహం.. ఒక్కసారిగా గర్జించింది. ‘మీరంతా గతి తప్పుతున్నారు. క్రమశిక్షణ లేకపోతే మనుగడ సాగించడం కష్టం. నేను చెప్పేది మీకు వినబడాలంటే నిశ్శబ్దంగా ఉండాలి. సమావేశంలో ఎలా ఉండాలో కూడా మీకు తెలియట్లేదు. పద్ధతి లేకుండా ఒక్కొక్కరు ఒక్కో చోట నిలబడ్డారు. అంతా ఒక వరస క్రమంలో నిలబడండి’ అని గట్టిగా మందలించింది. దాంతో అన్నీ దగ్గరగా నిలబడి శ్రద్ధగా సింహం చెప్పిన మాటలు వినసాగాయి. కానీ.. కొన్ని జంతువులు మాత్రం ఏదైనా జరిగితే, అప్పుడు చూసుకోవచ్చులే’ అని నిర్లక్ష్యంగా ఉన్నాయి.

వాటిని ఎలాగైనా దారిలోకి తీసుకురావాలకున్న మృగరాజు.. ఒక రాయి తెమ్మని కోతికి చెప్పింది. అది పరుగున వెళ్లి.. చెరువుగట్టు మీదున్న రాయిని తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు సింహం.. ‘అందరూ నా వైపు చూడండి’ అని చెప్పి ఆ రాయిని పైకి విసిరింది. కొన్ని క్షణాల్లో అది కింద పడింది. రెండోసారి ఆ రాయిని చెరువు పక్కన ఉన్న బురదలోకి విసిరింది. బురద కొద్దిగా బయటకి చిమ్మింది. అది అందులోనే ఉండిపోయింది. కోతి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ రాయిని పట్టుకొచ్చింది. ఈసారి కూడా అదే రాయిని తీసుకొని, చెరువులోకి విసిరింది సింహం. అప్పుడు అందులోని నీళ్లన్నీ గుండ్రంగా అలలుగా కదిలాయి. తర్వాత అన్ని జీవులను చూస్తూ.. ‘మూడు సందర్భాలను గమనించారు కదా.. మీకు ఏం అర్థమైంది?’ అని ప్రశ్నించింది సింహం. ఒక్కొక్కటి ఒక్కో రకమైన సమాధానం చెప్పాయి. ఆ జవాబులతో సంతృప్తి చెందని సింహం.. ‘మొదటగా నేను విసిరినప్పుడు అది నేల మీద పడింది. అప్పుడు అక్కడ ఎలాంటి చలనమూ లేదు. అలాగే ఎన్ని మంచిమాటలు చెప్పినా, మీలో కూడా కొన్ని జీవులు పెడచెవిన పెడుతున్నాయి. అసలు ఆలోచించడమే మానేశాయి. ఏమాత్రం కూడా కష్టపడటానికి ఇష్టపడటం లేదు. ఆహారం కోసం, ఇతర జీవుల మీద ఆధారపడుతున్నాయి. రెండోసారి బురదలోకి విసిరినప్పుడు కూడా.. చలనం లేదు. కానీ బురద మాత్రం చిమ్మింది. ఇలాగే మీలో ఇంకొన్ని జంతువుల ఆలోచన.. ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు చూద్దాంలే అన్నట్లు ఉంది! మూడోసారి నీళ్లలోకి రాయి విసిరాను. అప్పుడు మాత్రం నీళ్లన్నీ కదిలాయి. ఒక్కసారిగా శబ్దం వచ్చింది. మనం ఎప్పుడూ ఇలా.. నీళ్లలాగే స్పందించి, అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే మన ఉనికి ప్రశ్నార్థకమవుతుంది’ అని వివరించింది. ఆ మాటలు విన్న అడవిలోని జీవులన్నీ మృగరాజును క్షమించమని కోరాయి. ఇక నుంచి బద్ధకాన్ని వీడి, ఎవరి ఆహారం వాళ్లే వెతుక్కుంటామని మాటిచ్చాయి. పద్ధతిగా ఉంటామని తెలిపాయి.  

కాశీ విశ్వనాథం పట్రాయుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని