మృగరాజు మెచ్చిన కాకి!

జంబూకవనంలో కంటకం, సంకటం అనే రెండు నక్కలు ఉండేవి. కంటకం దొరికిన చిన్న జంతువునల్లా చంపడం, బెదిరించడం చేస్తుండేది. సంకటం మాత్రం ఏ జంతువునూ ఇబ్బంది పెట్టేది కాదు.

Updated : 23 Jan 2024 06:19 IST

జంబూకవనంలో కంటకం, సంకటం అనే రెండు నక్కలు ఉండేవి. కంటకం దొరికిన చిన్న జంతువునల్లా చంపడం, బెదిరించడం చేస్తుండేది. సంకటం మాత్రం ఏ జంతువునూ ఇబ్బంది పెట్టేది కాదు. చిన్న జీవులను చంపడం మహా పాపం అనుకునేది. పులో, సింహమో తిని వదిలేసిన మాంసంతో కడుపు నింపుకునేది. అది కూడా దొరకకుంటే పస్తులుండేది. ఈ రెండింటిని గమనించిన కాకి, వీటిలో మార్పు తేవాలి అనుకుంది.

ఒకరోజు సంకటాన్ని కలిసి.... ‘ఓ సంకటం... నిన్ను చూస్తే జాలి కలుగుతోంది. నక్క జాతిలో పుట్టి ఇలా అతి మంచితనం పనికి రాదు. నువ్వు మాంసాహారివి. చిన్న జంతువులను ఆకలి కోసం చంపి తినడం ఆటవిక న్యాయం. అతిగా చంపడం, మరీ పిల్లలను చంపడం, తల్లి కాబోతున్న వాటిని చంపడం పాపం. అంతేకానీ ఎవరో ఏదో అనుకుంటారని అసలు వేటకు పోకుండా దొరికిన మాంసం తినడం, దొరకకపోతే కడుపు మాడ్చుకోవడం ఏంటి. నువ్వు మారాలి... లేకుంటే నీ బతుకు దుర్భరం అవుతుంది’ అంటూ హితబోధ చేసింది కాకి. ‘ఇకపై నీవు చెప్పినట్టే చేస్తాను’ అంది సంకటం. ‘హమ్మయ్యా..! సంకటం మారింది. ఇక కంటకాన్ని మార్చాలి’ అనుకుందది.
ఒకరోజు అప్పుడే బయటకు వచ్చి ఆడుకుంటున్న చిన్న కుందేలు పిల్లను చంపి తింటోంది కంటకం. అక్కడికి వచ్చిన కాకి ‘దీనికి ఇప్పుడే మంచి చెప్పాలి’ అనుకుంది. ‘కంటకం మావా.. ఇది నీకు న్యాయంగా ఉందా. కుందేలుకు లేకలేక పుట్టిన పిల్ల అది. అయినా ఉదయాన్నే మృగరాజు వదిలిన లేడిని మొత్తం తిన్నావుగా! మళ్లీ ఈ చిన్న కుందేలు పిల్లను ఎలా చంపాలనిపించింది. ఇప్పుడు ఆ తల్లి కుందేలు ఎంత ఏడుస్తుందో! రేపు నీకు పిల్లలు పుట్టి, అవి కూడా ఇలా చిన్నప్పుడే చనిపోతే అప్పుడు తెలుస్తుంది.. నీకు తల్లి బాధ ఏమిటో. ఒకటి కాదు, రెండు కాదు ఇలా ముక్కుపచ్చలారని చాలా చిన్న పిల్లలను చంపావు. ఇలా చేస్తే కానీ నీ ఆకలి తీరదా’ అని నిలదీసింది కాకి.
‘నేను ఎవరినీ చంపకూడదు అనుకుంటాను. కానీ అవి ఎదురుపడగానే నా మనసు మారిపోతుంది’ అని సమాధానం ఇచ్చింది కంటకం. ‘నువ్వు మారాలి. లేకపోతే ఏదైనా చిన్న జంతువు.. నీ మీద మృగరాజుకు ఫిర్యాదు చేయొచ్చు. ఆ తరువాత నీ ఇష్టం. అయినా మన అడవిలో పులి, సింహం, చిరుత కొట్టి పడేసిన పెద్ద జంతువుల మాంసం చాలానే దొరుకుతోంది కదా! మళ్లీ ఈ చిన్న చిన్న జంతువులను చంపాలా?’ అంది కాకి. అప్పటికే ఆక్కడికి వచ్చిన కోయిల కూడా కాకిని సమర్థించింది. దాంతో కంటకం.. ‘నిజమే! తప్పు తెలుసుకున్నాను. ఇకపై చిన్న జంతువులనే కాదు, అసలు ఏ జంతువునూ చంపను. దొరికిన మాంసం తింటాను’ అంది. ‘హమ్మయ్యా...! నేను అనుకున్నట్టుగా సంకటం, కంటకాన్ని మార్చగలిగాను అనుకుంది కాకి.
ఒకరోజు ఈ విషయం తెలిసిన మృగరాజు జంతువులు, పక్షులను సమావేశపరిచింది. ‘మంచి పని చేసిన కాకిని సన్మానించాలని అనుకుంటున్నాను. వెంటనే ఏర్పాట్లు చేయండి’ అని ఆదేశించింది. కాకి సన్మానానికి సన్నాహాలు పూర్తయ్యాయి. మృగరాజు కాకి చేసిన పనిని పొగిడి, దాన్ని సన్మానించబోయింది. ‘మృగరాజా... ఈ సన్మానానికి కాకికి అర్హత లేదు’ అంది లేడి. అదేమిటి అంది మృగరాజు. ‘అవును మృగరాజా! కాకి మనసు మంచిదే. రెండు నక్కలను మార్చాలని అనుకోవడం చాలా పెద్ద పని. కానీ వాటిలో ఆ మార్పు వచ్చిందా, లేదా అన్నది అది మళ్లీ పరిశీలించలేదు. కాకి చెప్పినట్టుగా కంటకం పూర్తిగా మారిపోయింది. కానీ సంకటం ఇప్పుడు మరో పాత కంటకంలా మారింది! కనిపించిన ప్రతి చిన్న జంతువునల్లా చంపుతోంది. మొదటిసారి చిన్న జంతువును చంపి తినడంతో వాటి రుచి మరిగింది. దాంతో విచక్షణరహితంగా చిన్న జంతువులను చంపడం, బెదిరించడం మొదలుపెట్టింది. కాకి మార్పు తేవాలనుకుంటే, వారు వీరు, వీరు వారయ్యారు అంతే. మాకు ఒకప్పటి కంటకం కంటే కూడా ఇప్పటి సంకటం వల్లనే చెడు ఎక్కువ జరుగుతోంది. కనుక మీరే సంకటాన్ని పిలిచి బుద్ధి చెప్పాలి’ అని చెప్పింది.
కాసేపు ఆలోచించిన తర్వాత... ‘దీనిలో కాకి చేసిన తప్పేమీ లేదు. సంకటం మారుతుందని, దాని జీవితం బాగు పడుతుందని తలచింది అంతే. ఇప్పుడే సంకటాన్ని పిలిచి బుద్ధి చెబుతాను. మీకేం ఫరవాలేదు’ అంది సింహం. ఓ మంచి పనికి సంకల్పించిన కాకిని తర్వాత సన్మానించింది. అంతా దూరంగా ఉండి విన్న సంకటం.. ‘నన్ను క్షమించండి. ఇకపై నేను నా హద్దుల్లో ఉంటాను’ అని అంది. ‘హమ్మయ్యా.. బతికిపోయాం’ అనుకున్నాయి చిన్న జంతువులన్నీ.

కూచిమంచి నాగేంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు