జమీందారుకు సాంబడి సాయం!

నాదర్‌గుల్‌ జమీందారు నారాయణ దత్తు. అతనికి అనేక ఆస్తులతో పాటు నాదర్‌గుల్‌ ప్రధాన కూడలిలో బియ్యం మిల్లు కూడా ఉంది. ఒక రోజు తన నౌకరును గుర్రంగూడ గ్రామానికి పంపి సాంబడ్ని దివాణానికి తీసుకురమ్మని చెప్పాడు. ఆ ఊరు కూడలిలో ఇద్దరు పెద్దవాళ్ళు, కొందరు యువకులు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటున్నారు.

Updated : 25 Jan 2024 05:48 IST

నాదర్‌గుల్‌ జమీందారు నారాయణ దత్తు. అతనికి అనేక ఆస్తులతో పాటు నాదర్‌గుల్‌ ప్రధాన కూడలిలో బియ్యం మిల్లు కూడా ఉంది. ఒక రోజు తన నౌకరును గుర్రంగూడ గ్రామానికి పంపి సాంబడ్ని దివాణానికి తీసుకురమ్మని చెప్పాడు. ఆ ఊరు కూడలిలో ఇద్దరు పెద్దవాళ్ళు, కొందరు యువకులు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ల దగ్గరకు వెళ్లి... ‘నేను నాదర్‌గుల్‌ సంస్థానం జమీందారు నారాయణ దత్తు పంపితే ఇక్కడికి వచ్చాను’ అన్నాడు ఆ నౌకరు.

‘ఏం పని’ అని అడిగాడో పెద్ద మనిషి. ‘ఈ గ్రామంలో సాంబడు అనే యువకుడి ఇల్లు ఎక్కడో కొంచెం చెబుతారా?’ అని అడిగాడు. ‘ఎందుకు, దివాణంలో దొంగతనం గానీ చేశాడా?’ అంటూ... పెద్దగా నవ్వాడు మరో పెద్ద మనిషి. ‘జమీందారుకు ఏవో విలువైనవి ఇచ్చాడట. తిరిగి ఇవ్వడానికి తీసుకురమ్మన్నారు’ అన్నాడు నౌకరు.

‘గుర్రంగూడ సాంబడి గురించేనా నువ్వు అడిగేది? మేము ఓ ముద్ద పెడితే గానీ తినలేనివాడు సాంబడు. వాడి దగ్గర విలువైన సంపదలేమున్నాయి జమీందారుకి ఇవ్వటానికి?’ అని ఆశ్చర్యంగా అన్నాడు ఓ యువకుడు. ‘అవును! కానీ, ఏమిచ్చాడో నాకూ తెలీదు’ అన్నాడు నౌకరు. ‘ఈ ఎడమ సందు చివరలో చింతచెట్టు పక్కన పూరి గుడిసెలో ఉంటాడు’ అని అటువైపుగా చూపిస్తూ అన్నాడు ఓ యువకుడు.

సాంబడు తెలివైన అనాథ యువకుడు. ఆర్థికంగా ఆధారం లేని కష్టజీవి. బాగా పనిచేసి ధనం సంపాదించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అతను చెప్పిన దారిలో వెళ్లి.. సాంబడి ఇంటికి చేరాడు నౌకరు. అతన్ని లోపలికి రమ్మని తాగటానికి కుండలో నీళ్లిచ్చాడు. వచ్చిన విషయం చెప్పాడు నౌకరు. సాంబడు కంగారుగా.. ‘నేను ఇంతవరకు జమీందారుని చూడనే లేదు’ అన్నాడు. ‘నువ్వేమిచ్చావో దివాణానికి వస్తే తెలుస్తుంది’ అన్నాడు నౌకరు.   చిరిగిన దుస్తులతోనే నౌకరుతో దివాణానికి బయలుదేరాడు సాంబడు.

దారిలో కూడలి దగ్గర.. ‘ఏరా.. సాంబా! జమీందారు గారికి వజ్రాలుగానీ ఇచ్చావా.. ఏంటీ!?’ అని హేళనగా అన్నాడొక వ్యక్తి. అందరూ గొల్లున నవ్వారు. దివాణానికి చేరిన సాంబడు జమీందారుకు నమస్కరించి... ‘అయ్యా! నాకు తెలిసి ఎవరికీ అన్యాయం చేయలేదు. ఎవరి సంపదలూ లాక్కోలేదు. నన్నెందుకు పిలిపించారో చెప్పండి?’ అన్నాడు.

‘భయపడకు సాంబా! నువ్వెవరి సంపదలూ గుంజుకోలేదు. నీ సంపదే మాకిచ్చావు!’ అన్నాడు. ‘నా దగ్గర కట్టుకోవటానికే సరైన దుస్తులు లేవు. విలువైన ఆస్తులు, అంతస్తులు నాకెక్కడివి!’ అన్నాడు. సాంబడికి కొత్త దుస్తులు తెప్పించి.. ‘సాంబా! పక్షంరోజుల క్రితం నువ్వు ఉద్యోగం కోసం మా బియ్యం మిల్లుకు వచ్చావు. నిన్ను మిల్లు యజమాని విచారిస్తుండగా విద్యుత్తు హెచ్చుతగ్గుల వల్ల అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను నీ ప్రాణాలు పణంగాపెట్టి కాపాడావు. మంటలు ఆర్పటానికి మావాళ్లకు సహకరించావు. గాయపడిన వారికి ధైర్యం చెప్పి వైద్యశాలకు వెళ్లేవరకు ఉన్నావు. గుర్తుందా?’ అన్నాడు.

‘అవునయ్యా! గుర్తుంది. అది మీ మిల్లు అని తెలియదు’ అన్నాడు సాంబడు. ‘ఆస్తులు, అంతస్తులు లేకపోయినా.. ఆప్యాయత, అనురాగం, అభిమానం, అభినందన, ఆత్మీయమైన గౌరవం కూడా అమూల్యమైన సంపదలే కదా! అవి నీదగ్గర చాలా ఉన్నాయి’ అన్నాడు జమీందారు. అప్పటికి సాంబడికి కాస్త భయం తగ్గింది.

‘సాంబా! నీకు మా బియ్యం మిల్లులో ఉద్యోగంతో పాటు అక్కడే ఉండటానికి, తినటానికి ఏర్పాటు చేశాను’ అన్నాడు. సాంబడికి కొత్తదుస్తులతో పాటు, కడుపు నిండా కమ్మటి భోజనం పెట్టి పంపాడు నారాయణ దత్తు. కొంత కాలానికి అతనే పిల్లని చూసి పెళ్లి కూడా చేశాడు.

పైడిమర్రి రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని