వనదేవత వరమిచ్చినా...!

ఒక అడవిలో నక్క, తోడేలు దిగులుగా మర్రిచెట్టు నీడలో కూర్చొని ఉన్నాయి. తోడేలుతో.. ‘అసలు మన జన్మ వృథా..! మనల్ని ఎవరూ నమ్మడం లేదు.

Updated : 26 Jan 2024 06:16 IST

ఒక అడవిలో నక్క, తోడేలు దిగులుగా మర్రిచెట్టు నీడలో కూర్చొని ఉన్నాయి. తోడేలుతో.. ‘అసలు మన జన్మ వృథా..! మనల్ని ఎవరూ నమ్మడం లేదు. జిత్తులమారి అంటూ నన్ను.. నంగనాచి అని నిన్ను.. అడవిలోని జీవులన్నీ ఎద్దేవా చేస్తున్నాయి. మనం ఏ పని చేసినా అందులో తప్పులే వెతుకుతున్నాయి. అందుకే మనం జీవించి ప్రయోజనం లేదు. ఇంకా ఈ అడవిలో తిరిగితే మనకు గౌరవం ఉండదు’ అంది నక్క. ‘అవును! నాకు కూడా అలాగే అనిపిస్తుంది’ అని బాధగా బదులిచ్చింది తోడేలు. ఆ రెండింటి మాటలు విన్న వనదేవత వాటి ముందు ప్రత్యక్షమై.. ‘నా వనంలో జీవిస్తున్న మీరు ఆనందంగా ఉండాలి. కానీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీకు వచ్చిన కష్టం ఏంటో తెలిసింది. అందుకే అడవిలోని జంతువులు, పక్షులకు మీ పట్ల నమ్మకం కలిగే విధంగా ప్రవర్తించడానికి ఈ ఒక్కరోజు మీకు వరం ఇస్తున్నాను. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుని మీరు ఆనందంగా జీవించవచ్చు. గుర్తుపెట్టుకోండి ఈ వరం వల్ల ఈ ఒక్కరోజు మాత్రమే మీ మాటలు అడవి జీవులు నమ్ముతాయి. ఆ మరుసటిరోజు నుంచి ప్రవర్తనే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. జాగ్రత్తగా వినియోగించుకోండి’ అని చెప్పి అదృశ్యమైంది.

ఆ వరం తోడేలు, నక్కకు చాలా ఆనందం కలిగించింది. ‘వనదేవత చెప్పిన ప్రకారం ఈ రోజు జంతువులు, పక్షులు మన మాట వింటాయి కాబట్టి.. ఈ వరంతో ముందుగా మన ఆకలి తీర్చుకుందాం. తర్వాత మిగతా సంగతి ఆలోచిద్దాం’ అని నక్కతో అంది తోడేలు. దానికి అలాగేనంటూ తలాడించింది నక్క. అప్పుడే వాటికి అటుగా వెళ్తున్న జింక కనిపించింది. దాన్ని చూడగానే నక్క, తోడేలు ఆకలి రెట్టింపైంది. దాన్ని ఎలాగైనా తినాలని అనుకున్న నక్క, దగ్గరకు వెళ్లి.. ‘జింక మావా! అదిగో ఆ కొలను దగ్గర చక్కని గడ్డి ఉంది. నాతో వస్తే నీకు చూపిస్తాను’ అని అంది. వన దేవత వరం వల్ల దాని మాటలు నమ్మి అటుగా వెళ్లిందది. అదే అదనుగా నక్క, తోడేలు ఆ జింకను చంపి తిని, వాటి ఆకలి తీర్చుకున్నాయి. ఇంతలో ఆ దారి గుండా ఒక ఎలుగుబంటి వస్తుంది. అది గమనించిన నక్క.. ‘అదిగో ఆ ఎలుగుబంటి వల్లే.. మనం చేసిన పనులు మిగతా జీవులకు తెలిశాయి. ఎలాగైనా ఈ రోజు దాని పని పట్టాలి’ అంది. ‘కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుందాం’ అని దానికి వంతపాడింది తోడేలు. అనుకున్న ప్రకారం దాన్ని ఆపి.. ‘ఎలుగుబంటి అన్నా..! మా బుద్ధి మార్చుకున్నాం. ఇక నుంచి ఎవరికీ నమ్మక ద్రోహం చేయం. ఇప్పుడు నువ్వు మాతోపాటు వస్తే.. నీకు పుట్ట తేనె లభించే చోటు చూపిస్తాం’ అన్నాయి. క్షణం కూడా ఆలోచించకుండా.. వాటి వెంట వెళ్లిన ఎలుగుని కొండపైకి తీసుకెళ్లి లోయలోకి తోసేశాయవి.

తిరిగి వస్తుండగా ఒక గున్న ఏనుగు వాటికి ఎదురుపడింది. అప్పుడు తోడేలు.. ‘దానిపై ఎక్కి మనం అడవంతా తిరుగుదాం. అలా అయితే.. ఏనుగే మనల్ని అడవంతా తిప్పుతుందని మిగతా జంతువులకు మన పట్ల గౌరవం పెరుగుతుంది’ నక్కతో అంది. ‘అవును నీ ఉపాయం బాగుంది’ అంది నక్క. ఇక తోడేలు ఏనుగును ఆపి.. ‘మమ్మల్ని నీ మీద ఎక్కించుకొని అడవంతా తిప్పవా..!’ అని అడిగింది. మరేం మాట్లాడకుండా ఆ రెండింటినీ.. వీపుపై ఎక్కించుకొని అడవంతా తిప్పింది ఏనుగు. ఇంతలోనే చీకటి పడింది. ‘ఇక మనకు ఈ అడవిలో తిరుగుండదు. మనం చెప్పిందే వేదం’ అని గర్వంగా అనుకుంటూ హాయిగా నిద్రపోయాయి.

 అవి రెండూ ఉదయాన్నే నిద్రలేచేసరికి వాటి చుట్టూ.. గున్న ఏనుగు, దాని తల్లి, ఎలుగుబంటి, పులి ఇలా చాలా జీవులు నిలబడ్డాయి. వాటిని చూసి.. ‘చూశావా! నిన్న గున్న ఏనుగు మీద ఎక్కి తిరగడంతో మన గొప్పతనం అడవంతా తెలిసింది. పులితో సహా.. అన్ని జంతువులూ మన దగ్గరికి వచ్చాయి’ అని నక్కతో చెబుతూ మురిసిపోయింది తోడేలు. ఇంతలో తల్లి ఏనుగు వాటితో.. ‘సంస్కారం లేని పనులు చేసే మీరు, నా బిడ్డ మీద ఎక్కి కూర్చుని అడవిలో తిరుగుతారా? మీకు అంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది. మీరు నిన్న చేసిన పనుల గురించి కాకి చెప్పింది. జింకను మభ్యపెట్టి చంపేశారు. ఎలుగుబంటిని లోయలో తోసేశారు. గున్న ఏనుగుపైన ఊరేగారు. ఇన్ని తప్పులు చేసిన మీకు ఈ అడవిలో ఉండే అర్హత లేదు’ అంటూ వాటిని అడవి నుంచి బయటికి గెంటేసింది. దాంతో అవి.. ‘వనదేవత ఇచ్చిన వరాన్ని మంచి మార్గంలో ఉపయోగించుకుంటే.. కనీసం బతకడానికి కావాల్సిన ఆహారమైన మనకు దొరికేది. ఇప్పుడు బయటికి వచ్చాం అది కూడా ఉంటుందో లేదో’ అనుకున్నాయి. తోడేలు, నక్క వెళ్లిపోవడంతో.. అడవిలోని జీవులన్నీ చాలా సంతోషించాయి.

- మొర్రి గోపి 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని